ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

సంక్షేమ పథకాలు అమలు చేసే వారూ కార్మికులే

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

మహారాష్ట్రలో రెండు లక్షలకు పైగా అంగన్ వాడీ కార్యకర్తలు ఫిబ్రవరిలో చాలా రోజులు ఆందోళనకు దిగారు. బిహార్ లో మధ్యాహ్న భోజనం వండే వారూ తమ వేతనం పెంచాలని జనవరిలో సుధీర్ఘ కాలం సమ్మె కట్టారు. ఈ అంగన్ వాడీ కార్యకర్తలు, వంట చేసే వాళ్లే దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తారు. ప్రభుత్వాలు ఈ పథకాలను చాలా ప్రధాన్యతగలవిగా భావిస్తాయి. కానీ సమ్మెలు కట్టి, ఆందోళన చేస్తే తప్ప వారి కోర్కెలు నెరవెరకపోవడం వైపరీత్యమే. ఒక వేళ తీర్చినా అది తృణమో పణమోగా మాత్రమే.

ఈ పథకాన్ని అమలు చేసే వారు విద్య, ఆరోగ్యం, పోషకాహారం మొదలైన రంగాలలో కీలకమైన సేవలు అందిస్తారు. వీరిని "స్వచ్ఛంద కార్యకర్తలు" అంటారు. వీరికి చెల్లించే జీతాలు చాలా తక్కువ. ప్రభుత్వ ఉద్యోగులకు దక్కే ఏ ప్రయోజనాలూ వీరికి ఉండవు. దేశవ్యాప్తంగా 27 లక్షల మంది అంగన్ వాడీ కార్యకర్తలు, సహాయకులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే. వీరంతా సమగ్ర శిశు సంక్షేమాభివృద్ధి పథకం కింద పని చేస్తారు. మధ్యాహ్న భోజనం కోసం ఏర్పాట్లు చేసే వారు కూడా దాదాపు ఇంతే మంది ఉంటారు. అలాగే మరో పది లక్షల మంది సామాజిక ఆరోగ్య కార్యకర్తలుంటారు. పట్టణ ప్రాంతాలలో పని చేసే ఆరోగ్య కార్యకర్తలూ ఉంటారు. అలాగే మరో మూడు లక్షల మంది సహాయక నర్సులు, మంత్రసానులు (ఎ.ఎన్.ఎం.లు) ఉంటారు. వీరంతా జాతీయ ఆరోగ్య మిషన్ కిందే పని చేస్తారు. జాతీయ బాల కార్మిక పథకం, చిన్న మొత్తాల పొదుపు పథకం, సర్వ శిక్షా అభియాన్, జాతీయ జీవనోపాధి మిషన్ కింద పని చేసే వారూ లక్షలాదిగా ఉంటారు.

చేసే పనినిబట్టి చూస్తే అణగారిన వర్గాల సంక్షేమానికి వీరి పాత్ర చాలా కీలకమైంది. సమాజ సంక్షేమ కార్యక్రమాలకు ఆనవాళ్లు వీరే. వీరు గర్భిణులు, బాలలు, జబ్బు పడ్డవారు, పోషకాహార లొపంతో తీసుకుంటున్న వారికి సహాయం చేస్తుంటారు. వీళ్లల్లో ఎక్కువ మంది మహిళలే. వీరి మీద పనిభారం ఎక్కువ కావడమే కాక సర్వేలు చేయడానికి, సమాచారం సేకరించడానికి కూడా వినియోగించుకుంటారు అని వీరి కార్మిక సంఘాల వారు అంటారు. అయినా వీరిని ప్రభుత్వ సిబ్బందిగా గుర్తించరు. వారికిచ్చేది "గౌరవ వేతన"మే. వారు మోసే బాధ్యతలతో పోలిస్తే వారికిచ్చేది నామ మాత్రమే. వివిధ పథకాలకు కేటాయించే నిధుల్లో కోత పెట్టినప్పుడు వీరి ఉద్యోగ భద్రతకు ముప్పు ఉంటుంది. 2015-16 కేంద్ర బడ్జెట్లో సమగ్ర శిశు సంక్షేమాభివృద్ధి, మధ్యాహ్న భోజన పథకాలకు కేటాయించే నిధుల్లో కోత పెట్టారు. వారు చేస్తున్న పనినిబట్టి చూస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి గౌరవప్రదమైన వేతనం చెల్లించాలి. పని పరిస్థితులు మెరుగ్గా ఉండేట్టు చూడాలి.

కానీ ఇలా జరగకపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. పైగా మహారాష్ట్ర ప్రభుత్వం వీరందరినీ 2018నాటి అత్యవసర సేవల కొనసాగింపు చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. వారిని హక్కులున్న కార్మికులుగా గుర్తించడం లేదు. 2019 జనవరిలో మధ్యాహ్న భోజన వండే 2.48 లక్షల మంది బిహారులో సమ్మె చేస్తే ఆ సమ్మెను 39 రోజులపాటు కొనసాగనిచ్చారు. ఆ తర్వాత వారి వేతనం స్వల్పంగా పెంచారు. 25మందికన్నా తక్కువ మంది లబ్ధిదార్లు ఉన్న చోట అంగన్ వాడీ కేంద్రాలను మూసేస్తామంటున్నారు. ఒక్క మహారాష్ట్రలోనే 97,000 పెద్ద, 10,000 చిన్న అంగన్ వాడీలున్నాయి. పెద్ద అంగన్ వాడీలో కనీసం ఒక ఉపాధ్యాయుడు/నిర్వాహకుడు, ఒక సహాయకుడు ఉంటారు. వీటిని మూసేస్తే వారి జీవనోపాధికి భంగం కలుగుతుంది.

2018 జనవరి 17న కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేసే 50 లక్షల మంది సమ్మె చేశారు. దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల కార్యాలయాల దగ్గర నిరసన ప్రదర్శనలు చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో పని చేసే వారిని కార్మికులుగా గుర్తించాలని, వారికి కనీస వేతనాలు, పింఛన్లు, కలిసికట్టుగా తమ హక్కులకోసం పోరాడే అవకాశం కల్పించాలని 2013 మేలో భారత కార్మిక సంఘం (ఐ.ఎల్.సి.) కోరినా పట్టించుకోలేదు. వారికి భవిష్య నిధి, స్టేట్ ఇన్సూరెన్స్ పథకం వర్తింప చేయాలని, కేంద్ర బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించాలని ఐ.ఎల్.సి. సిఫారసు చేసినా ఖాతరు చేయలేదు. పైగా వీటిలో కొన్నింటిని ప్రైవేటీకరించే ప్రయత్నం చేశారు.

తాము చేసే పనిని "ఇంట్లో చేసే చాకిరీ"గా పరిగణించినందువల్లే తమ కోర్కెలను ఖాతరు చేయడం లేదని ఈ కార్మికులు అంటున్నారు. కీలక బాధ్యతలనుంచి తప్పించుకోవాలని ప్రభుత్వం చూస్తున్నందువల్లే వీటిని ప్రైవేటీకరించాలని, నిధుల్లో కోతపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఈ కార్మికుల సమస్యలు కేవలం ఆర్థిక కోర్కెలు కావు. వారిని కార్మికులుగా పరిగణించాలి.

Back to Top