ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

దాచే కొద్దీ పెరుగుతున్న రాఫేల్ వివాదం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాఫేల్ కుంభకోణం ప్రతిపక్ష పార్టీలనన్నింటినీ ఏకం చేసింది. ఈ యుద్ధ విమానాల కొనుగోలుపై జరిగిన అవకతవకలకు బాధ్యత వహించాలని అనిల్ అంబానీని, ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నాయి. మరో వేపున ప్రభుత్వ పక్ష అధికార ప్రతినిధులు ఈ కుంభకోణంతో ప్రభుత్వానికి ఏ సంబంధమూ లేదని చెప్పడానికి తంటాలు పడుతున్నారు. కానీ ఇటీవల వెల్లడైన కొన్ని అంశాలు ప్రభుత్వాన్ని ఈ వివాదంలోకి మరింతగా లాగాయి. రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు అవినీతి, దుష్కృత్యాల కంపు కొడ్తోంది.

2015 ఏప్రిల్ లో అంబానీకి చెందిన రిలయన్స్ డెఫెన్స్ కంపెనీ భారత వైమానిక దళం కోసం కొంటున్న యుద్ధ విమానాల ఒప్పందంలో కొంత వాటా సంపాదించింది. ఫ్రాన్స్ లోని దసో విమానాల తయారీ కంపెనీ నుంచి ఈ విమానాలు కొంటున్నారు. ఈ విమానాల కొనుగోలులో చాలా నాటకీయత ఉంది. శపథాల మీద శపథాలు చేస్తున్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది వివిధ దేశాల నాయకులతో సంప్రదింపుల్లో భాగంగా ఫ్రాన్స్ సందర్శించారు. ఈ పర్యటన విదేశాలతో మన సంబంధాలు పటిష్ఠం చేసుకోవడానికి అని చెప్పారు. "ఇది నాయకుల స్థాయి" సమావేశం అని అప్పటి విదఏశాంగ శాఖ కార్యదర్శి ఎస్. జైశంకర్ అన్నారు. ఈ పర్యటనలో  ప్రతిపాదనలో ఉన్న రక్షణ సామాగ్రి కొనుగోలు లోతుల్లోకి వెళ్లే అవకాశం కూడా ఉండదని ఆయన తెలియజేశారు.

అంతకు ముందు ఉన్న ప్రభుత్వం 2007 తో ప్రారంభించి అనేక సంప్రదింపులు జరిపి దసో తో ఆయుధాలు సైతం ఉన్న 18 రాఫేల్ యుద్ధ విమానాలు కొనడానికి ఒప్పందం కుదుర్చుకున్నది. మిగతా 108 యుద్ధ విమానాలు ప్రభుత్వ రంగంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్.ఎ.ఎల్.) లో తయారు చేయాలని అనుకున్నారు. అయితే విమనాల ధరకు సంబంధించి కొన్ని సమస్యలు తలెత్తాయి. ఇలాంటి ఒప్పందాల్లో వివాదాలు అసహజమేమీ కాదు. నేరుగా యుద్ధ విమానాలు కొంటున్నప్పుడు, హెచ్.ఎ.ఎల్.కు సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేసేటప్పుడు, నేరుగా కొంటున్న 18 విమానాలకు ఆరు రెట్లు హెచ్.ఎ.ఎల్. తయారు చేయాలని అనుకున్నప్పుడు ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వీటి తయారీకి హెచ్.ఎ.ఎల్. 70 శాతం డబ్బు సమీకరించవలసి ఉండింది. మోదీ ఫ్రాన్స్ పర్యటనలో రక్షణ సామాగ్రి కొనుగోలుపై పెద్ద చర్చలు ఏమీ ఉండవు అని విదేశాంగ శాఖ కార్యదర్శి చెప్పిన రెండు రోజులకే పని చేయగలిగిన స్థితిలో ఉండే 36 విమానాలు కొనడానికి ఒప్పందం కుదిరింది అని రెండు దేశాల నాయకులు సంయుక్త ప్రకటనలో తెలియజేశారు.

అయితే ఇందులో లెక్కలు కుదరలేదు. "ఇతరత్రా" జరిగిన సంప్రదింపుల్లో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో నేరుగా 36 విమానాలు కొనే ప్రతిపాదనకు మించి ఏమీ లేదు. 2007లో విమానాలు కొనాలనుకున్నప్పుదు 126 జెట్ విమానాల సేకరణకు మొత్తం రూ. 42,000 ఖర్చయ్యేది. లేదా ఒక్కో విమానానికి రూ. 350 కోట్లు ఖర్చయ్యేది. ఇది ఊహే కావచ్చు. ఎందుకంటే మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ ఒక్కో విమానం ఖరీదు రూ. 715 కోట్లు ఉంటుందని ఏప్రిల్ 2015లో చెప్పారు. భద్రతా కారణాల దృష్ట్యా ఒక్కో విమానం ధర ఎంతో స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ ఒక్కో విమానం ధర రూ. 670 కోట్లు ఉంటుందని రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భమ్రే లోక సభలో 2016 నవంబర్ లో నోరు జారారు. కానీ దసో, రిలయన్స్ డిఫెన్స్ కలిసి 2017లో చెప్పిన ఒక్కో విమానం ధర రూ. 1,600 కోట్లు.

ఇంతవరకు ఒక్క విమానం కూడా అందలేదు కనక అనుకున్న సమయానికి విమానాలు అందుతాయన్న ఆశ లేదు. ఈ లోగా అనేక పరిణామాలు జరిగాయి. ఈ ఒప్పందంలో జరిగిన గూడుపుఠానీని కప్పి పుచ్చడానికి వివిధ ప్రభుత్వ సంస్థలను భాగస్వాముల్ని చేశారు. 2018 ఆగస్టులో ప్రసిద్ధ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మోదీ ప్రభుత్వాన్ని సమర్థించడం సాధ్యం కాదనుకున్న సీనియర్ బీజేపీ నాయకులు అరుణ్ శౌరీ, యశ్వంత సిన్ హా వివరాలన్నీ బయట పెట్టారు. వారు పూసగుచ్చినట్టు వరస క్రమంలో వివరాలు తెలియజేసినందువల్ల లోపాయికారీగా ఏదో జరిగిందన్న అనుమానాలు బలపడ్డాయి.

ఈ వ్యవహారంపై సి.బి.ఐ. చేత దర్యాప్తు జరిపించాలని ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైన తరవాత ఆ దర్యాప్తు సంస్థలో ఉన్నతాధికారులు అనేక మందిని మార్చారు. ఈ వ్యవహారాన్ని దర్యాప్తుకు చేపట్టడానికి ప్రయత్నించిన ఒక సీనియర్ అధికారిని ఉన్నట్టుండి ఉద్యోగంలోంచి తొలగించారు. ఉద్యోగ విరమణ తర్వాత మంచి పదవి ఆశ చూపారని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి వెల్లడించడం మరింత ఆశ్చర్యం కలిగించింది. అయితే సుప్రీంకోర్టు సి.బి.ఐ. దర్యాప్తునకు ఆదేశించకపోగా ఈ వ్యవహారాన్ని "కాగ్" పరిశీలించాలని చెప్పింది. నిజానికి అప్పటికి కాగ్ దర్యాప్తు మొదలే కాలేదు. ఇక ముగిసే అవకాశం లేనే లేదు.

చివరకు కాగ్ నివేదిక సమర్పించినప్పుడు అందులో ధర, మొత్తం ఖర్చయ్యే డబ్బు సవ్యంగానే ఉన్నయని తేల్చారు. కానీ ఒక్కో విమానం ధర 41 శాతం పెరిగిందని మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. పత్రాలతో సహా మీడియా ఈ విషయాలు వెల్లడించింది. ప్రధానమంత్రి కార్యాలయం అనుచిత జోక్యం చేసుకోవడంవల్ల గట్టిగా బేరమాడే అవకాశం తగ్గిందన్న వార్తలూ వచ్చాయి.

ప్రభుత్వం మాత్రం జాతీయ భద్రత సాకు చెప్తూనే ఉంది. తాము దాని కోసమే పాటు పడ్తున్నామని చెప్పారు. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించే ప్రతిపక్ష రాజకీయ నాయకులను "దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు" అని నిందించడం మొదలు పెట్టారు. కానీ అవినీతి కుళ్లు కంపు మాత్రం తగ్గడం లేదు.

Back to Top