ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

సంకీర్ణమే ప్రజాభిప్రాయానికి ప్రతీక

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ప్రతిపక్షాల ఐక్యతా యత్నాలు బలపడుతున్న కొద్దీ భారతీయ జనతా పార్టీ శిబిరంలో గాబరా పెరిగిపోతోంది. బీజేపీ అగ్ర నాయకులు ప్రతిపక్ష ఐక్యతను తూలనాడుతూ ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల "మిలావటి సర్కార్" (కలుషిత ప్రభుత్వం) అని నిందించారు. ప్రతిపక్ష పార్టీలకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అధికారం వస్తే రోజుకొక ప్రధానమంత్రి ఉంటారు అని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అవహేళన చేశారు. ఇటీవల పార్లమెంటు బడ్జెట్ సమావేశం ఆఖరి రోజున మోదీ ప్రసంగంలో సుస్థిరత కొనసాగాలంటే మెజారిటీ ఉన్న ప్రభుత్వమే ఏర్పడాలని, సుస్థిర ప్రభుత్వం ఉన్నందువల్లే అంతర్జాతీయంగా భారత ప్రతిష్ఠ పెరిగిందని అన్నారు. ప్రతిపక్షాలకు నాయకుడు ఎవరు అని ప్రశ్నించడం ద్వారా బీజేపీ, ఆ పార్టీని సమర్థించే వారు జాతీయ నాయకత్వం తమదేనని చెప్పుకుంటున్నారు. ప్రతిపక్షాలు కల్తీవి అని చేసే వాదనకు అనుకూలంగానే ఈ మాటలున్నాయి. బీజేపీ మాత్రమే నిఖార్సైన పార్టీ అని, సుస్థిర ప్రభుత్వం అందించగలిగేది బీజేపీ మాత్రమే అన్న అభిప్రాయం కలిగించడానికే ఈ రకమైన విమర్శలు గుప్పిస్తున్నారు. తన పని తీరు ఆధారంగా ప్రజలను ఓట్లు అడగలేని పరిస్థితి ఉన్నందువల్లే బీజేపీ ఈ ఎత్తులు ఎత్తుతోంది. బీజేపీ చెప్తున్న సుస్థిరత, నిఖార్సైన పార్టీ అన్న వాదనలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనవి.

ప్రతిపక్షాలు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం రాజకీయ వాస్తవికత మీద ఆధారపడింది. ఇందులో బహుళ పార్టీలు, సాహసం చేసే పార్టీలూ ఉంటాయి. ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఇవన్నీ కలిసి పని చేయవలసిందే. ఇది బహుళ పక్షాల రాజకీయ ఆకాంక్ష వ్యక్తీకరణే. భిన్న సామాజిక వర్గాల న్యాయబద్ధమైన కోరికే. కానీ ఈ ప్రజాస్వామ్య భావ వ్యక్తీకరణ నియంతృత్వ పోకడలు గల బీజేపీ దృష్టిలో కలుషితమైంది. బహుళత్వాన్ని, అసమానతతో కూడిన సామాజిక వాస్తవికతను అంగీకరించే లక్షణం బీజేపీకి లేదు. భిన్నమైన రాజకీయ శక్తులు ఏకం కావడం మన రాజకీయ వ్యవస్థలోని ఫెడరల్ స్వభావానికి అనుగుణమైంది. తమది నిఖార్సైన పార్టీ అని చెప్పుకునే పక్షం నాయకత్వంలోని ప్రభుత్వం విఫలమైనందువల్లే ప్రతిపక్షాలు ఏకం కావలసిన అవసరం వచ్చింది. బీజేపీ నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్.డి.ఎ.)కి వ్యతిరేకంగా ఏకం కావాలని ప్రయత్నిస్తున్న రాజకీయ పక్షాలు వైవిధ్య భరితమైన రాజకీయ శక్తులకు, ప్రాంతాలకు, అస్తిత్వాలకు ప్రతీక. ఈ లక్షణాలన్నీ ఒకే పార్టీలో పొసగకపోవచ్చు. అందువల్ల ఒక్కో సారి పరస్పర విరుద్ధమైన భావాలు, ప్రయోజనాలు ఉన్న పార్టీలు ఐక్యం కావలసిన అవసరం ఉంటుంది. ఈ పక్షాలన్నీ తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి ఏకం కావడమే సర్దుబాటుకు వీలు కల్పిస్తుంది. ఇదే ఆ పక్షాల ఐక్యతకు పూచీ పడ్తుంది. తమది నిఖార్సైన పార్టీ అని చెప్పుకునే ప్రస్తుత అధికార పక్షం సమాజంలో ఉన్న విభేదాలను మరింత పెంచడానికి మాత్రమే ఉపయోగపడ్తుంది.

సర్వాధికారాలు ప్రధానమంత్రి కార్యాలయంలోనే కేంద్రీకృతం కావడం అంటే కాబినెట్ వ్యవస్థ ఆధారంగా నడవవలసిన ప్రభుత్వ వ్యవస్థను కుళ్లబొడవడమే. సంకీర్ణ ప్రభుత్వం ఉంటే ఏ రాజకీయ పార్టీకి తమదే ఆధిపత్యం అని విర్రవీగే అవకాశం ఉండదు. తద్వారా కాబినెట్ తరహా వ్యవస్థను పునరుద్ధరించడానికి వీలవుతుంది. అప్పుడు ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి సమానుల్లో ప్రథముడిగా ఉంటారు. మంత్రివర్గం ఉమ్మడిగా పార్లమెంటుకు జవాబుదారుగా ఉండడం సాధ్యం అవుతుంది. గత అయిదేళ్లలో జరిగినట్టుగా సకల అధికారాలు ప్రధానమంత్రి కార్యాలయంలోనే కేంద్రీకృతం అయితే పార్లమెంటుకున్న ప్రాధాన్యత అడుగంటుతుంది. జనాభిప్రాయానికి, ప్రజలెన్నుకున్న ప్రతినిధుల అభిప్రాయాలకు తావుండాలి అన్న సూత్రం గాలికి ఎగిరిపోతుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను అడ్డ దారిలో అధ్యక్ష తరహా వ్యవస్థగా మార్చే ప్రయత్నాలు నియంతృత్వ ధోరణులకు చోటిస్తాయి. పార్లమెంటుకు ఉండవలసిన పాత్రను పునరుద్ధరించాలంటే ప్రస్తుత పరిస్థితిలో సంకీర్ణ ప్రభుత్వం అత్యవసరం. అప్పుడే జనాభిప్రాయానికి పట్టం కట్టడం సాధ్యమవుతుంది.

ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరంతర భిన్నాభిప్రాయాలు, రాజకీయ పక్షాల మధ్య సంబంధాలు మారిపోతూ ఉండవచ్చు. అందుకే ప్రజాస్వామ్య వ్యవస్థ అస్థిరంగా కనిపించే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే దీనివల్ల ఒకే పార్టీ ఆధిపత్యం కొనసాగే ప్రమాదం తప్పుతుంది. అందువల్ల 50 ఏళ్లపాటు పరిపాలించారు అని విమర్శనాస్త్రాలు సంధించడానికి అవకాశం ఉండదు. తదుపరి ఎన్నికలకు సిద్ధమయ్యే అవకాశం కూడా ఉండదు. ప్రజాస్వామ్యంలో అస్థిరత అంటే ప్రభుత్వాలు నిరంతరం పడిపోతాయని కాదు. గతంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడిన సందర్భంలో అవి కూలిపోవడానికి జాతీయ పార్టీలు అని చెప్పుకునే పక్షాలు అహంకార పూరితంగా ప్రవర్తించడమే కారణం. అయితే తరచుగా ఇలాంటి మార్పులకు సామాజిక కారణాలు, మథనాలు ఉన్నప్పుడు సుస్థిరత పేర వాటిని తుంచేయాలనుకోవడం ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించడమే. ప్రజాస్వామ్యంలో అస్థిరత అనివార్యం అయినప్పుడు ప్రజలు కీలక పాత్ర పోషిస్తారు. వ్యవస్థ అందరి సంక్షేమం కోసం పాటుపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కొందరి ప్రయోజనం కోసమే అన్న ప్రయత్నాలు కొనసాగడానికి వీలుండదు. ఏకచ్ఛత్రాధిపత్యం చెలాయించాలనుకునే ఒకే పార్టీకి బదులు భిన్నమైన పక్షాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రజానుకూల విధానాలు అనుసరించడం అనివార్యం అవుతుంది. ప్రజానుకూల విధానాలు అనుసరించడం తప్ప సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలకు మార్గాంతరం ఉండదు. సంకీర్ణ ప్రభుత్వం అయితే బలహీనంగా ఉంటుందని, ఒకే పార్టీ పాలన అయితే పటిష్ఠంగా ఉంటుందని అమిత్ షా మాటలను ఈ దృక్కోణం నుంచి పరిశీలించాలి. ఆయన ఆంతర్యం ఏమిటో  గ్రహించాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం జనం ఆకాంక్షలకు, ఒత్తిడులకు లొంగి ఉండాల్సిందే. పటిష్ఠ ప్రభుత్వం అంటున్నది నిర్లక్ష్యంగానో, ప్రజాభిప్రాయానికి విరుద్ధంగానో ఉండే ప్రమాదం ఎక్కువ.

Back to Top