బలమైన ప్రతిపక్షానికి అనుకూల తీర్పు
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
భారతీయ జనతా పార్టీ అజేయమైంది అన్న వాదన కేవలం మిథ్య అని మహారాష్ట్ర, హర్యాన ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. ఈ రెండు రాష్ట్రాలలో సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతాం అని బీజేపీ చెప్పిన మాటలన్నీ ప్రగల్భాలుగా మిగిలిపోయాయి. ఈ రెండు రాష్ట్రాలలోనూ బీజేపీకి 2014లో కన్నా తక్కువ స్థానాలు వచ్చాయి. 2019 సార్వత్రక ఎన్నికలలో బీజేపీ మునుపటికన్నా ఎక్కువ మెజారిటీతో మరో సారి అధికారం లోకి వచ్చింది. ఈ విజయానికి ప్రధాన కారణం బీజేపీ నాయక ద్వయం కారణమని ప్రజల మద్దతు తమకే ఉందని, ఇతర పార్టీలు ఎందుకూ కొరగావని బీజేపీ ప్రచారం చేసింది. కానీ నాయక ద్వయం అజేయమైందన్న వాదన్న ఈ రెండు రాష్ట్రాలలో ప్రజా తీర్పుతో వీగిపోయింది. అంతిమ నిర్ణేతలు ప్రజలేనని మరో సారి నిర్ధారణ అయింది. మహారాష్ట్రలో ప్రతిపక్ష ప్రచారం జోరుగా సాగింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్ జనంతో మమేకమై ప్రచారం చేసి బీజేపీ అనుల్లంఘనీయమైందన్న వాదన కేవలం మిథ్యేనని తేల్చేశారు. పవార్ చాలా స్థైర్యంతో ఎన్నికల ప్రచారం చేశారు. సతారాలో బోరున వర్షం కురుస్తున్నా ఆయన ప్రచారం ఆపలేదు. ప్రతిపక్ష శ్రేణులలో ఉత్సాహం నింపారు. ఆయన ప్రచారం క్షేత్ర స్థాయి సమస్యలను లేవనెత్తింది. ప్రజల జీవనోపాధి సమస్యల మీదే ఆయన ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. మెజారిటీ వర్గం ప్రచారం చేస్తున్న జాతీయతావాదంలోని డొల్ల తనాన్ని ఎండగట్టారు. అధికార పక్షం ప్రతిపక్షాల మీద చేస్తున్న దాడిని సమర్థంగా తిప్పికొట్టగలిగారు. "ప్రతిపక్ష రహిత భారత్" అన్న బీజేపీ ప్రచారం మహారాష్ట్రలోనూ, హర్యానాలోనూ కొరగాకుండా పోయింది. అధికార పక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించి తీరవలసిందేనని ఓటర్లు ఖండితంగా చెప్పారు. ప్రజలు గణనీయమైన సంఖ్యలో ప్రతిపక్షాలను బలపరిచారు. ప్రతిపక్షాలు గత రెండు నెలల కాలంలో చేసినంత ప్రచారం గడిచిన అయిదేళ్ల కాలంలోనూ జరిగి ఉంటే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు సైతం భిన్నంగా ఉండేవి.
శరద్ పవార్ కు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్ నోటీసులు ఇవ్వడం మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార సరళినే మార్చి వేశాయి. తమ నాయకుడి మీద పనిగట్టుకుని చేస్తున్న దాడిని మరాఠాలు నిర్ణయాత్మకంగా తోసిపుచ్చారు. ఈసడించుకున్నారు. అయితే మరాఠాలు ఎప్పుడూ కలిసికట్టుగా మాత్రమే ఓటు వేస్తారన్న వాదన కేవలం భ్రమేననీ తేలిపోయింది. "మరాఠాల తిరుగులేని నాయకుడు" అన్న మాటను బీజేపీ ఎంత నిందార్థంలో వాడినా జనాన్ని ఆకర్షించలేక పోయింది. ఈ వర్గంలోని కొందరి మద్దతు మాత్రమే పవార్ కు దక్కింది. అయితే ఆ రాష్ట్రంలో ఉన్న సామాజిక-సాంస్కృతిక చరిత్ర ఎక్కువ మంది మరాఠాలు పవార్ కు అండగా నిలబడడానికి దోహదం చేసింది. ఎన్ఫోర్స్ మెంట్ మెంట్ డైరెక్టొరేట్ పవార్ కు నోటీసులు జారీ చేసి వేధించడం మొదలు పెట్టిన తరవాత ఆ వర్గం వారు ఆయనకు దన్నుగా నిలిచింది. పవార్ తమ వాడు అని భావించారు. ఈ ఒక్క అంశం మాత్రమే కాకుండా గ్రామీణ-వ్యవసాయ సంక్షోభాన్ని అధికార పక్షం పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం ప్రజలలో బాగా నాటుకు పోయింది. అందుకే మరాఠాలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరారు. ధన్గర్లు అదే అభిప్రాయంతో ఉన్నారు. ఈ రెండు వర్గాలూ వ్యవసాయం మీద ఆధారపడినవే. వ్యవసాయ రంగంతో అంతగా సంబంధం లేని అధికార పక్ష నాయకుల స్వభావం పేశ్వాల పాలనను తలపించింది. అందుకే ప్రతిపక్షాల ప్రచారం కేవలం ఒక వర్గానికే పరిమితం కాలేదు. ప్రతిపక్షాల, ముఖ్యంగా నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం, ఎత్తుగడలు, టికెట్ల పంపిణీ విస్తృత ప్రజానీకం మద్దతు కూడగట్టగలిగింది. ఈ ప్రభావం పశ్చిమ మహారాష్ట్రలోనూ, మరాఠ్వాడాలోనూ, ఉత్తర మహారాష్ట్ర, విదర్భ ప్రాంతంలోనూ బాగా కనిపించింది. కేవలం మరాఠాలే కాకుండా ఇతర వెనుకబడిన కులాల వారు, ముస్లింలు ప్రతిపక్షాలకు అండగా నిలిచారు. పశ్చిమ మహారాష్ట్రలో ఎన్.సి.పి. మరాఠాలకే కాకుండా ఇతర వెనుకబడిన కులాల వారికి, ముఖ్యంగా ధన్గర్లకు ఎక్కువ టికెట్లు కేటాయించింది. మహారాష్ట్రలో శివాజీ మహారాజ్ పేరు ఇప్పటికీ చెల్లుబాటు అవుతుంది. అందుకే ప్రతిపక్షాలు మరాఠాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు మాలి వంటి ఇతర వర్గాలకూ ప్రాధాన్యం ఇచ్చాయి. మాలీ-ధన్గర్-వంజరి వర్గాల మద్దతును గత మూడు దశాబ్దాలుగా బీజేపీ బాగా వినియోగించుకుంది. దీనినే “మాధవ్” సంకీర్ణం అంటున్నారు. బ్రాహ్మణ నాయకత్వం ఈ సంకీర్ణాన్ని ఇంత కాలం బాగా వినియోగించుకోగలిగింది. ఈ అంశం ఎన్నికలలో ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. ప్రతిపక్షాలు ఇతర వెనుకబడిన కులాల వారి భావాలను అర్థం చేసుకోగలిగాయి. మహారాష్ట్రలో సంఘ్ పరివార్ సామాజిక స్వభావం లోని బూటకం గుట్టు విప్పగలిగాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి వివిధ సామాజిక వర్గాల మధ్యన తంపులు పెట్టడానికి ప్రయత్నం చేశారు. భిన్నమైన ఈ వర్గాలను నియత్రిత పద్ధతిలో గుప్పెట్లో పెట్టుకోగలిగారు. ఈ క్రమంలో మరాఠాలను ఒంటరి వారిని చేశారు. మిగతా వర్గాల మద్దతు సమీకరించడం మీద దృష్టి కేద్రీకరించారు. ఈ సామాజిక వైరుధ్యాలను ఉపయోగించుకుని సొంత బలం మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమన్న ధీమా వ్యక్తం చేశారు. పగటి కలలు కన్నారు. సామాజిక వైరుధ్యాలను నిరంతరం వినియోగించుకోగలమనుకున్నారు. ఈ వాదనలోని డొల్ల తనాన్ని ఎన్నికల ఫలితాలు బహిర్గతం చేశాయి.
ఈ వాస్తవ పరిస్థితులను గమనిస్తే ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని పదవీచ్యుతం చేయగలవనిపించింది కూడా. కానీ గత అయిదేళ్లుగా ప్రతిపక్షాల, ముఖ్యంగా కాంగ్రెస్ నిష్క్రియా పరత్వం బీజేపీని గద్దె దించడానికి దోహదం చేయలేదు. కాంగ్రెస్ దిక్కు తోచని స్థితిలో పడిపోయింది. అయినా ప్రజలు ప్రతిపక్షాలను గౌరవనీయమైన స్థానంలో నిలబెట్టారు కనక భవిష్యత్తులో జన సమీకరణ ద్వారా అధికార పక్షాన్ని సవాలు చేసే అవకాశం వచ్చింది. అధికార పక్షం విజయం సాధించినా సంక్షోభంలోనే ఉంది. అందువల్ల ప్రతిపక్షాల జన సమీకరణకు చాలా ప్రాధాన్యం ఉంటుంది.