ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

కార్పొరేట్ పన్ను తగ్గింపుతో ఎవరికి లాభం?

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

కార్పొరేట్ రంగంపై విధించే పన్ను మీద కోత పెట్టడం ద్వారా ఆర్థిక మందగమనం వాస్తవమైందేనని అది కేవలం అప్పుడప్పుడూ పునరావృతమయ్యే వ్యవహారం కాదు అని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. విదేశీ మదుపుదార్లకు వచ్చే లాభాల మీద సర్చార్జీ తగ్గించినా, ఒకే బ్రాండు చిల్లర వ్యాపారాలపై పెట్టుబడులను సరళీకరించినా, బొగ్గు తవ్వకాలలో 100 విదేశీ పెట్టుబడిని అనుమతించినా, ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి పెద్ద బ్యాంకులు ఏర్పడడానికి అవకాశం కల్పించినా 2019 సెప్టెంబర్ 20న కార్పొరేట్ పన్ను తగ్గించినప్పుడే స్టాక్ మార్కెట్లలో ఆనందాతిరేకాలు వ్యక్తమైనాయి.

మెరుగైన పన్నుల సంస్కరణ అంటే పన్ను వర్తించే వారి పరిధిని విస్తరించి పన్ను రేటు తగ్గించడం. కార్పొరేట్ సంస్థలపై తక్కువ పన్ను విధించడం ఇలాంటి సంస్కరణలకు ఊతం ఇస్తుంది. ఎందుకంటే ఇతర రంగాలలో అధిక ప్రయోజనాలు, తక్కువ పన్ను రేట్లు ఉంటే పెట్టుబడి అక్కడికే తరలి పోతుంది. ఈ దృష్టితో చూస్తే ప్రభుత్వం కార్పొరేట్ పన్ను తగ్గించాలని అనుకున్నప్పుడు ఆ రంగానికి ఇస్తున్న అనేక రాయితీలను వ్యూహాత్మకంగా పరిశీలించి ఉండవలసింది. మునుపటి ఆర్థిక మంత్రి అయిదేళ్ల కిందట కార్పొరేట్ పన్నును 25శాతాని తగ్గిస్తామని చెప్పినప్పుడు ఈ వ్యూహమే అనుసరిస్తారని ఆశించాం. కానీ పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసే హడావుడిలో ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో రాయితీలు పొందని కంపెనీల కార్పొరేట్ పన్నును 22 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీనికి అర్హులు ఎవరు అన్న విషయాన్ని నిర్ధారించడంలో సమస్యలు ఎదురు కావచ్చు. చిన్న వ్యాపారస్థులు సొంత ఆదాయపు పన్ను ఎక్కువగా చెల్లిస్తూ ఉండవచ్చు. పన్ను చెల్లించే వారి పరిధిని విస్తరించడమే లక్ష్యం అయినప్పుడు కనీస ప్రత్యామ్నాయ పన్ను (ఎం.ఎ.టి.) 18 శాతం నుంచి 15 శాతానికి తగ్గించవలసిన అవసరమ ఏమిటో తెలియదు.

పన్నుల వ్యవహారాన్ని బాగా పట్టించుకునే ఏ ఆర్థికవేత్తా పన్ను రాయితీలు పెంచి అనేక లక్ష్యాలు పెట్టుకోవడానికి సిద్ధపడరు. పన్ను రాయితీలు ఇవ్వడంవల్ల ప్రభుత్వానికి సమకూరే ఆదాయం తగ్గుతుంది కనక భారీ మూల్యమే చెల్లించవలసి వస్తుంది. ఈ లక్ష్య సాధన అనుమానాస్పదమూ కావచ్చు. నిజానికి ప్రభుత్వం కోల్పోయిన రెవెన్యూకు సంబంధించి బడ్జెట్ వివరాల్లో కార్పొరేట్ పన్ను రాయితీలు పొందినందువల్ల 28 అంశాలున్నాయని తెలియజేశారు. వీటిలో త్వరితమైన తరుగుదల వల్ల, ప్రత్యేక ఆర్థిక మండళ్లలో ఎగుమతులలో లాభాలు, విద్యుత్ సరఫరా పంపిణీ, మౌలిక వసతుల అభివృద్ధి, ఖనిజ తైలాల అన్వేషణ, దాతృత్వ సంస్థలకు విరాళాలు, ఈశాన్య, హిమాలయ పర్వత శ్రేణుల్లోని రాష్ట్రాలలో ఏర్పాటు చేసే పరిశ్రమలు, ఆహార శుద్ధి, నిలవ పరిశ్రమలు మొదలైనవి ఈ 28 అంశాల జాబితాలో ఉన్నాయి. వీటిలో ఒక్క 2018-19లోనే త్వరితమైన తరుగుదల వల్లే ప్రభుత్వం కోల్పోయిన రాబడి 49 శాతం ఉంది.

మార్కెట్లలో సంబరం కనిపించడానికి కార్పొరేట్ పన్ను తగ్గించడంవల్ల అపారమైన ప్రయోజనం ఉంటుదన్న ఆశ ఉండడమే. ఈ పన్ను తగ్గించక ముందు సెస్సు, సర్చార్జీతో కలిపి నామమాత్రమైన పన్ను 35శాతం ఉండేది. కానీ 2017-18లో నికర పన్ను రేటు 29.49 శాతమే ఉంది. కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ. 7, 66,000 కోట్లు ఉంటాయనుకుంటే పన్ను రేటు 22 శాతానికి తగ్గినందువల్ల ప్రభుత్వ రాబడి రూ. 1.12 లక్షల కోట్లు తగ్గింది. కొత్తగా ఏర్పాటైన కంపెనీలకు వర్తించే పన్ను రేటు 15 శాతానికి కుదించినందువల్ల అవి లాభాలు సంపాదిస్తే తప్ప ఈ రాయితీవల్ల ప్రయోజనం పొందలేవు. 2019-20లో పన్నులవల్ల ఆదాయాన్ని అధికంగా అంచనా వేసినందువల్ల నికర నష్టం తక్కువగానే కనిపించవచ్చు. కానీ నికర వసూళ్లు కూడా తగ్గొచ్చు.

వైపరీత్యం ఏమిటంటే కార్పొరేట్ పన్ను తగ్గించడంవల్ల ఎక్కువ నష్టపోయేది రాష్ట్రాలే. పన్ను తగ్గింపు మౌలిక రేట్ల మీదే తప్ప సెస్సులు, సర్చార్జీల మీద ఉండదు. ప్రస్తుతం రాష్ట్రాలకు కేంద్రం నుంచి దక్కవలసిన మొత్తానికి అనుసరించే సూత్రంవల్ల రాష్ట్రాలకు రూ. 60,000 కోట్ల రాబడి తగ్గుతుంది. కేంద్రానికి తగ్గే రాబడిలో నష్టం రూ. 82,000 కోట్లు అని అంచనా అయినా తగ్గిన పన్నువల్ల ప్రభుత్వ రంగ కంపెనీల నుంచి కేంద్రానికి డివిడెండ్ల రూపంలో దక్కే రాబడి రూ. 20,000 కోట్లు ఉంటుంది. పన్నుల ద్వారా వచ్చే రాబడిని ఎక్కువగా అంచనా వేసినందువల్ల రాష్ట్రాలకు కేంద్ర పన్నుల రాబడిలో వాటా తగ్గిపోతుంది. దీనివల్ల రాష్ట్రాలు ప్రణాళికేతర రంగంలో ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుంది. పైగా ఆర్థిక మందగమనంవల్ల భవన నిర్మాణ రంగం, స్థిరాస్తి రంగంలో లావాదేవీలు తగ్గుతాయి గనక స్టాంపులు, రిజిష్ట్రేషన్ల రూపంలో రాష్ట్రాలకు రావలసిన రాబడి సైతం తగ్గుతుంది. వినియోగ పన్నును వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.)లో విలీనం చేసిన తరవాత రాష్ట్రాలకు మిగిలిన ఆదాయ మార్గంలో స్టాంపులు, రిజిష్ట్రేషన్ సుంకమే ప్రధానమైంది.

అదీగాక కార్పొరేట్ పన్ను తగ్గించినందువల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందా అన్న అనుమానాలూ ఉన్నాయి. మార్కెట్లో ఎంత సంబరం కనిపించినా ఇది ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఉపకరిస్తుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే కొత్త కంపెనీలు లాభాలు సంపాదించినప్పుడే కార్పొరేట్ పన్నులో కోత విధించినందువల్ల ఫలితం దక్కుతుంది. పన్ను తగ్గింపువల్ల పెట్టుబడులు పెరుగుతాయో లేదో వేచి చూడవలసిందే. ఆర్థిక మాంద్యానికి ప్రధాన కారణం గిరాకీ తగ్గడం అనుకుంటున్నారు కనక సరఫరా రంగానికి ఊతం ఇవ్వడంవల్ల పెట్టుబడులు ఏ మేరకు పెరుగుతాయో చూడాలి. ప్రస్థుత పరిస్థితుల్లో గిరాకీ పెరగాలంటే ప్రభుత్వ వ్యయం పెరగాలి. అయితే దీనికి ద్రవ్య లోటును అదుపులో ఉంచాలన్న లక్ష్యం అవాంతరంగా మారుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలు తమ పెట్టుబడి ప్రణాళికలను పెంచాలని ఆర్థిక మంత్రి ఒత్తిడి చేస్తున్నారు. అదే సమయంలో డివిడెండ్ల రూపంలో లాభాల్లో వాటా ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థల మీద ఒత్తిడి పెంచుతున్నారు. అందువల్ల ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టుబడి పెట్టడానికి మిగిలేది అత్యంత స్వల్పంగానే ఉంటుంది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంవల్ల ఏ మేరకు ప్రయోజనం ఉంటుందో కొద్ది నెలలు గడిస్తే తప్ప తెలియదు.

Back to Top