ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

చెద పడ్తున్న ప్రజాస్వామ్యం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

భారత ఎన్నికలలో, సంస్థాగత రాజకీయాలలో పార్టీ ఫిరాయింపులు లేదా ఇతరులను అధికార పార్టీలో కలిపేసుకోవడం పరిపాటి అయిపోయింది. దీనివల్ల రాజకీయాల నైతికత దెబ్బ తింటుంది. రాజకీయాలలో సల్లక్షణాన్ని అలవరచుకోవాలంటే ఆదర్శప్రాయంగా మెలగాలి. పార్టీ ఫిరాయించేటప్పుడు తమకు ఓటేసిన ప్రజల అభిప్రాయం తెలుసుకున్నామా అని ఆలోచించుకోవాలి. నైతిక విలువలను పాటించడం ఆయా వ్యక్తుల నైతిక స్థాయి మీద, ఆత్మ గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. తమను ఎన్నుకున్న ప్రజల ఆకాంక్షలకు ఎంత మేరకు కట్టుబడి ఉండగలరు అన్న అంశం మీద ఆధారపడి ఉంటుంది. ఈ నిబద్ధత ఉంటే ప్రజా ప్రతినిధులు తమ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవచ్చు, ఆదర్శప్రాయులుగా మెలగ వచ్చు. నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రజా ప్రతినిధులపై జనానికి గౌరవం ఉంటుంది. ఈ విలువలున్న వారు ప్రలోభాలకు దూరంగా ఉంటారు. కానీ పార్టీ ఫిరాయింపులు ఈ విలువలన్నింటినీ మంట గలుపుతున్నాయి.

పార్టీ ఫిరాయించడం అంటే తమను ఎన్నుకున్న ప్రజల ఆకాంక్షలను వమ్ము చేయడమే. ప్రజాస్వామ్య నైతిక విలువలు దిగజారినందువల్ల ఫిరాయింపులవల్ల లబ్ధి పొందిన వారి, లేదా ఈ ఫిరాయింపులను ప్రోత్సహించే వారి నైతికత కూడా పతనమైనట్టే. తమను ఎన్నుకున్న వారి అభిప్రాయాన్నిబట్టి కాకుండా కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీ మారితే ఆత్మ గౌరవానికి భంగం కలగక తప్పదు. ఆచరణకు మాత్రమే పరిమితమైన రాజకీయాలు అనుసరించే వారికి ఆత్మ గౌరవం మీద ధ్యాస ఉండకపోవచ్చు. నిబద్ధత ప్రజా ప్రతినిధులకు కూడా ఉండవలసిన లక్షణమే. ఇవి కొరవడినప్పుడు ఆ ప్రజా ప్రతినిధులు, ఫిరాయింపులను ప్రోత్సహించే పార్టీలు కూడా ఈ దుర్లక్షణాన్ని మరింత దిగజార్చడానికే తోడ్పడతాయి. పార్టీ ఫిరాయించే వారు, ఫిరాయింపులను ప్రోత్సహించే రాజకీయ పార్టీలు కూడా ఆత్మగౌరవం కోల్పోవడానికే కారకులవుతారు. ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలన్న సంకల్పం ఉంటే రాజకీయ పార్టీల గౌరవమూ నిలబడుతుంది. కానీ పార్టీలు ఫిరాయించే వారు ఈ నియమాలేవీ పట్టించుకోవడం లేదు. ఫిరాయింపులను ప్రోత్సహించే పార్టీలకు తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలన్న ఆకాంక్ష ఉంటుంది. నిజానికి ఫిరాయింపులు తమ ఆధిపత్యానికి లైసెన్సులా భావిస్తాయి. ఫిరాయింపులకు తలొగ్గే వారు తమ సంగతే ఆలోచిస్తారు తప్ప సమానత్వం గురించి పట్టించుకోరు. సమానత్వ భావనే ఆత్మ గౌరవానికి పునాది. ఆత్మ గౌరవం నిలబెట్టుకోవాలంటే సమానత్వ భావన అలవర్చుకోవాలి. అలా జరగాలంటే రాజకీయ క్షేత్రంలో సమానత్వం అవసరం. సిద్ధాంత రీత్యా మాత్రం ఈ అవకాశం రాజ్యాంగంలో ఉంది.

ఫిరాయింపులను ప్రోత్సహించే పార్టీలలో ఆత్మ గౌరవాన్ని పెంపొందించే దినుసులేమీ ఉండవు. సానుకూలమైన ఎజెండా కూడా ఉండదు. ఇతర పార్టీల వారిని తమ పార్టీలో చేర్చుకునే పార్టీలకు తాము చేర్చుకునే వారి మీద అపారమైన ఆదరాభిమానాలు ఏమీ ఉండవు. వారివల్ల ఫలితం ఏ మేరకు ఉంటుందనే ధ్యాసే ఉంటుంది. పార్టీ మారే వ్యక్తులు ఆ పార్టీల దృష్టిలో అంగడి సరుకు మాత్రమే. ఇలా అంగడి సరుకుగా మారే వారు స్వతంత్రంగా వ్యవహరించలేరు. సహజంగానే వ్య్కతిగా కానీ, పార్టీ దృష్టితోగానీ ఉన్నత ప్రమాణాలనూ పాటించలేరు. ఫిరాయించే వారు అంగడి సరుకుగా తయారైనందువల్ల అధికార పార్టీలకు మాత్రం ఉపకరిస్తారు. ఫిరాయింపు దార్లు తమ స్వప్రయోజనాలు మాత్రమే చూసుకుంటారు. ఫిరాయించే వారికి కులం, సిద్ధాంతం, భాష, ప్రాంతం అనే తేడాలు ఏమీ ఉండవు. వీరిని కాకపోతే మరొకరిని అధికార పార్టీలు తమలో చేర్చుకుంటాయి. ఆదర్శవంతమైన వారు కాకుండా అంగడి సరుకుగా మారే వారు పెరిగిపోయినప్పుడు ప్రజాస్వామ్యానికి విఘాతం కలగక తప్పదు.

Back to Top