ఆర్.టి.ఐ. సవరణ ప్రజల భాగస్వామ్యానికి భంగం
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
పార్లమెంటు ఇటీవల ఆమోదించిన సమాచార హక్కు (సవరణ) చట్టం కేంద్ర సమాచార కమిషన్ అస్తిత్వానికే ముప్పు కలిగించేదిగా ఉంది. ఈ సవరణ చట్టం ప్రవేశపెట్టడానికి పార్లమెంటులో అనుసరించవలసిన ప్రక్రియ అనుసరించకుండానే హడావుడిగా ఈ సవరణ ఆమోదించేశారు. ఈ సవరణలను నిశితంగా పరిశీలించకుండా ఎందుకు ఆమోదించినట్టు? సెలెక్ట్ కమిటీకి పంపకూడదని ఎందుకు పట్టుబట్టినట్టు? ఈ సవరణలను చూస్తే ఈ మహా వ్యవస్థల అస్తిత్వమే ప్రశ్నార్థకంగా తయారైంది.
2005 నాటి ఆర్.టి.ఐ. చట్టం ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని, రహస్యంగా వ్యవహరించడాన్ని ప్రశ్నించే హక్కు పౌరులకు ఇస్తుంది. కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ ఉన్న సమాచార కమిషన్ల ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం అందుతుంది. ఈ సమాచారం ప్రజా శ్రయస్సు కోసం కావచ్చు. ఎందుకంటే అది ప్రజల ప్రయోజనాలకు సంబంధించింది. దాపరికం లేని ప్రభుత్వానికి మూల స్తంభం లాంటింది. 2019నాటి ఆర్.టి.ఐ. సవరణ చట్టం 13, 15, 27 సెక్షన్లను సవరించింది. ఈ సవరణల ద్వారా సమాచార కమిషనర్ల నియామకం, వేతనాలు, వారి పదవీ కాలం మొదలైన వాటిని నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి సంక్రమించింది. అయితే ప్రభుత్వానికి దఖలు పడే సవరణలు సమాచార హక్కు వ్యవస్థ స్వయంప్రతిపత్తికి, ఈ చట్టాన్ని సమర్థంగా అమలు చేయడానికి విఘాతం కలిగిస్తుంది.
ఇది ఫెడరల్ విధానాన్ని దెబ్బ తీసేది. ఇది రాష్ట్రాల మీద ఆధిపత్యం చెలాయించడానికి ఉపకరిస్తుంది. అందువల్ల ఇది ప్రజాస్వామ విరుద్ధమైంది. దీనివల్ల భవిష్యత్తులో సమచారా కమిషన్ల నియామకంలో ఎగుడు దిగుళ్లకు దారి తీస్తుంది. రాష్ట్రాలకు, కేంద్రాలకు మధ్య తగవులకు దారి తీస్తుంది. ప్రభుత్వాల దాపరికం లేని తత్వాన్ని దెబ్బ తీస్తుంది.
ప్రభుత్వం ఏ మేరకు దాపరికం లేకుండా వ్యవహరిస్తోంది, ఏ మేరకు లక్ష్యాలు సాధించగలుగుతుంది అనేది ఈ సవరణల మీద ఆధారపడి ఉంటుంది. కానీ వీటికి సంబంధించిన సమాచారం అనేక ప్రయోజనాలు ఉంటాయి. అది సమాజ ప్రయోజనాలు కాపాడగలుగుతుంది.
ప్రతి సంవత్సరం సమాచార హక్కు చట్టం కింద 60 లక్షల దరఖాస్తులు దాఖలవుతున్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత గొప్ప వ్యవహారం. ఈ దరఖాస్తులు అనేక రకాల సమాచారం కోరతాయి. ప్రాథమిక సమస్యలకు ప్రభుత్వ బాధ్యతను నిలదీస్తాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులను ప్రశ్నించడానికి ఈ దరఖాస్తులు ఉపకరిస్తాయి. సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని ప్రజలు అవినీతిని, మానవ హక్కుల ఉల్లంఘనను, రాజ్యవ్యవష చేసే పొరపాట్లను ప్రశ్నించారు. గత కొద్ది సంవత్సరాలుగా సమాచార కమిషనర్లు ఆదేశించినప్పటికీ సమాచారం ఇవ్వడానికి నిరాకరించారని ఈ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యులు చెప్పారు.
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం పౌరులకు సమాచారం ఎందుకు నిరాకరిస్తుంది? ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించి ప్రజలు సమాచారం అడగడానికి ఈ చట్టం ఉపకరిస్తుంది. సమాచార హక్కు చట్టం పటిష్ఠమైన ప్రజాస్వామ్యం కొనసాగడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాస్వామ్యం పౌరులను నిష్క్రియాపరులైన పాలితులుగా భావిస్తోంది. విధానాలు, నిర్ణయాలకు సంబంధించి పౌరులు తెలుసుకునే సమాచారం బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి వీలుంటుంది. అందువల్ల రాజకీయాలకు కేంద్ర బిందువు ప్రజలే తప్ప పాలకులు, నాయకులు కారు. సమాచార హక్కు చట్టం రాజ్యాంగంలోని 19,21 అధికరణాల నుంచి వచ్చిందని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో స్పష్టం చేసింది. భావా ప్రకటనా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యమే ఈ చట్టానికి మూలం. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల పాత్రను పరిమితం చేయాలని చూస్తోంది. పాలితులు పాలకులకు సంబంధించిన ప్రశ్నలు అడగడానికి వీలు లేదు. సమాచార హక్కు చట్టం వల్ల పరిశోధనాత్మక పత్రికా రచనకు తీవ్ర విఘాతం కలుగుతోంది. ఆర్.టి.ఐ. చట్టాన్ని వినియోగించుకుని పరిశోధనాత్మక పత్రికా రచన సాగింది. మీడియాను గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పరిశోధనాత్మక పత్రికా రచనకు అవకాశం లేకుండా చేస్తోంది.
ఆర్.టి.ఐ. ప్రజోద్యమాల నుంచి ఉద్భవించింది. అనేక మంది ఆర్.టి.ఐ.ని యాదృచ్ఛికంగా వినియోగించుకున్నారు. ఇది ఆర్.టి.ఐ. స్ఫూర్తికి సంకేతం. వందలాది మంది ఆర్.టి.ఐ. కార్యకర్తలను హతమార్చారు. దాడి చేశారు. వేధించారు. వ్యవస్థ మీదే దాడి జరుగుతున్నప్పుడు వ్యక్తులు పోరాడే అవకాశం ఉండదు. ప్రజల మద్దతు లేకుండా ఈ సవరణలను తిరగదోడడం సాధ్యం కాదు.