మరో ‘సంస్థాగత హత్య’
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
ముంబాయిలోని బి వై ఎల్ నాయర్ ఆసుపత్రిలో రెసిడెంట్ డాక్టరుగా పనిచేస్తున్న పాయల్ తడ్వీ ఇటీవల మరణించింది. మెడికల్ కాలేజీలలో షెడ్యూలు కులాలు / షెడ్యూలు జాతులకు చెందిన విద్యార్ధులకు వ్యతిరేకంగా మోసపూరితమైన రీతిలో సాగుతున్న వివక్ష, కులతత్వం తడ్వీ మరణంతో బట్టబయలైంది. తడ్వీ, భిల్ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన యువతీ. ఆమె కులం షెడ్యూలు జాతిగా గుర్తింపు పొందింది. బి వై ఎల్ నాయర్ ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న టోపీవాలా నేషనల్ మెడికల్ (టి ఎన్ ఎం) కాలేజీకి చెందిన ముగ్గురు సీనియర్ డాక్టర్ల వేధింపులు భరించలేకనే తడ్వీ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణ. అంతకు ముందు తడ్వీని ‘కులం’ పేరిట అవమానించడం, గద్దించడం, చీవాట్లు పెట్టడం గురించి ఆమె కుటుంబ సభ్యులు కాలేజీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికినీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
తడ్వీ మరణం తరువాతే సంస్థాగత యంత్రాంగం రంగంలోకి దిగి ముగ్గురు డాక్టర్లను, ఆమె పనిచేసే విభాగం అధిపతిని సస్పెండ్ చేసింది. ర్యాగింగ్ వ్యతిరేక కమిటీ దర్యాప్తు మొదలెట్టింది. షెడ్యూలు జాతికి చెందడమే కాక ఎస్సి/ ఎస్టీ కోటాలో మెడికల్ కాలేజీలో సీటు సంపాదించుకున్నందుకు తడ్వీ వివక్షకు, అవమానాలకు గురైందని, ఆమె ‘తీవ్రమైన వేధింపులకు’ గురైందని ఆమె మరణించిన వారం తరువాత కమిటీ సమర్పించిన నివేదిక తెలిపింది. ఆమె మరణం తరువాత ఎస్సీ / ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పలువురు డాక్టర్లు కాలేజీలో ఉన్నప్పుడు తాము ఏ విధంగా వివక్షకు గురైనారో తమ అనుభవాలను గుర్తు చేసుకొని ఆవేదన చెందారు.
ఇంత జరుగుతున్నా ఇండిన మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు మాత్రం వైద్య రంగంలో కుల వివక్షకు తావు లేదని, తాము పట్టించుకోవలసిన స్థాయిలో కులవివక్షత లేదని వారి అభిప్రాయం. నిజానికి తీవ్రమైన వత్తిళ్ళ మధ్య విద్యాభ్యాసం సాగే మెడికల్ కాలేజీలలో, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ఉన్నత విద్యాసంస్థలలో అగ్ర కులాలకు చెందిన విద్యార్ధులు, అధ్యాపకులు కులం పేరిట వివక్ష చూపడం, ఆగ్రహం వ్యక్తం చేయడం సర్వ సాధారణమైనటువంటిది. దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రధానమైన అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) కులవివక్ష నానావిధాలుగా హద్దుమీరిన స్థాయిలో ఉన్న విషయాన్ని తోరట్ కమిటీలో 2007 సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఆ నివేదిక వచ్చి పదేళ్ళకు పైగా అయ్యింది. అయినా కుల వివక్ష విషయంలో సంస్థాగత నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉందని, విద్యా సంస్థలను ఆ జాడ్యం ఇంకా పట్టి పీడిస్తూనే ఉందని తడ్వీ కేసుతో తేటతెల్లమైంది.
ఇటువంటి సంస్థల వ్యవహారశైలిలో ఉదాసీనత వాటి పనితీరు, అధికార వ్యవస్థ నిర్మాణంలోనే ప్రతిబింబిస్తుంది. అటువంటి సంస్థల్లో అధికారం కేంద్రీకృతమై ఉన్న తీరు సీనియర్లు ర్యాగింగ్ వంటి అలవాట్లకు పాల్పడటాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ సంస్థలలో విద్యార్ధులను, జూనియర్లను వేధించడానికి అవకాశం కల్పిస్తోంది. అలాంటి చర్యలకు పాల్పడే వారికి కనీసం మందలింపు కూడా ఉండదు. వాటిలో ఉండే వాతావరణం, అధికార వ్యవస్థ అందరి ప్రవర్తనను చెడగొడుతుంది. వక్రమార్గంలో పయనించేలా చేస్తుంది. 2013 నుంచి 2017 మధ్య ఉన్న నాలుగేళ్ల కాలంలో యూనివర్సిటీ గ్రాంట్ల సంఘానికి విద్యార్ధుల ర్యాగింగుకు సంబంధించి 3,022 ఫిర్యాదులు అందాయి. అవికాక ఫిర్యాదు చేయని, ఇతరుల దృష్టికి రాని ఘటనలు చాలా ఉంటాయి. ఇదే విషయాన్ని యూనివర్సిటీ గ్రాంట్ల సంఘం నివేదికలో కూడా పేర్కొన్నారు. సీనియర్ల చేతిలో ర్యాగింగుకు గురైన విద్యార్ధులలో 84.3% మంది ఫిర్యాదు చేయరని కూడా యు జి సి నివేదిక పేర్కొంది. దానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా కాలేజీ అధికారులు తమ ఫిర్యాదులపై చర్య తీసుకొంటారనే నమ్మకం విద్యార్ధులకు లేకపోవడంతో పాటు తమ కెరీర్ పాడవుతుందని, కాలేజీ నుంచి బహిష్కరిస్తారని, సీనియర్లు కొడతారని వారు భయపడుతారు.
అంతేకాకుండా వేధింపుల గురించి ఫిర్యాదు చేయడం ద్వారా తాము ఎస్సీ / ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవరమని, ఆ కోటాలో సీటు పొందినట్లు అందరికీ తెలిసిపోతుందని, దానివల్ల అగ్రవర్ణాలకు చెందిన విద్యార్దులు, అధ్యాపకుల ఆగ్రహానికి గురికావలసి వస్తుందనే భయం వల్ల వారు ఫిర్యాదు చేయకుండా మానుకుంటున్నారు. తడ్వీ, ఆమె తల్లిదండ్రులు అనేకమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ చర్య తీసుకోవడం సంగతి అటుంచితే కనీసం వాటిని స్వీకరించడం గాని, అందినట్లు రసీదు ఇవ్వడం కానీ చేయలేదు. నిజానికి టి ఎన్ ఎం కాలేజీలో ర్యాగింగ్ వ్యతిరేక కమిటీ గత ఏడాదిన్నర కాలంలో కనీసం ఒకసారి కూడా సమావేశం కాలేదని తెలిసింది. అంతేకాదు తాము కాలేజీ అధికారులకు ఫిర్యాదు చేసిన తరువాత వేధింపులు ఎక్కువయ్యాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అటువంటి ఫిర్యాదులను సంస్థ వారు పట్టించుకోకపోవడం, చర్యలు తీసుకోకపోవడంతో ఎస్సీ / ఎస్టీ విద్యార్ధులు ఫిర్యాదు చేయడం మానుకుంటున్నారు. చాలా మంది ఆ వేధింపులను మౌనంగా భరిస్తున్నారు. కొందరు కాలేజీ మానేస్తున్నారు, పరిస్థితి మరీ దారుణంగా ఉంటే అత్మహత్యకు పాల్పడుతున్నారు. దానివల్ల ఉన్నత విద్యలో అసలే తక్కువగా ఉన్న ఎస్సీ/ఎస్టీల ప్రాతినిధ్యం మరింత తగ్గుదలకు దారితీస్తోంది.
కాలేజీ నిర్వాహకులు, అధ్యాపకులలో ఎస్సీ / ఎస్టీ వర్గాలకు తగినంత ప్రాతినిధ్యం లేకపోవడం, కుల వివక్షను గురించి పట్టించుకోకపోవడం, ర్యాగింగ్ ఫిర్యాదులను, వేధింపులను అల్పమైన విషయాలుగా భావించడం, తడ్వీ కేసులోవలె కాలేజీ వారు ఖాతరుచేయకపోవడం వంటి కారణాల వల్ల ఒక సంస్థ తరువాత మరొక సంస్థలో ఇదే కథ పునరావృతమవుతుంది.
ఈ సందర్భంగా మనందరికీ హైదరాబాద్ యూనివర్సిటీలో పీ హెచ్ డి చేస్తున్న దళిత విద్యార్ధి రోహిత్ వేముల మరణం గుర్తుకువస్తోంది. రోహిత్ ఆత్మహత్యను ‘సంస్థాగత హత్య’ అని వర్ణించారు. ఆయన మరణానంతరం జరిగిన పరిణామాలు అణగారిన వర్గాలకు రక్షణ కల్పించేందుకు ‘రోహిత్ చట్టం’ చేయాలనే డిమాండునకు దారితీసింది. అయితే సంస్థలు, వాటిలో పనిచేసే వారు సామాజిక ఇవక్ష వల్ల కలిగే హానిని గుర్తించినప్పుడే అటువంటి చట్టం వల్ల సార్ధకత చేకూరుతుంది. హానికరం కాని ర్యాగింగ్ అలవాట్ల నుంచి ‘తీవ్రమైన వేధింపుల’కు గురిచేస్తూ భేదభావంచూపడం హింసాత్మకం, వ్యక్తులు గౌరవప్రదమైన జీవనాన్ని గడుపుతూ విద్యనూ పొందకుండా మానవ హక్కులపై దాడి చేయడం. ఆ విషయాన్ని గుర్తించి తడ్వీ, వేములతో పాటు మౌనంగా బాధపడుతున్న వేలాది మందికి న్యాయసాధన కోసం మనం ముందడుగు వేయాలి.