ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

భావప్రకటనా స్వేచ్ఛపై మరో దాడి

.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనానికి నయన్ తారా సెహగల్ ను జనవరి 11న ఆహ్వానించాలన్నా ఆ పని చేయలేక పోయినందుకు చాలా మంది, ప్రధానంగా సాహితీ రంగ ప్రముఖులు తీవ్రంగా విమర్శించారు. తమ సంస్థ 92వ వార్షికోత్సవానికి సెహగల్ ను ఆహ్వానించాలని సాహిత్య సమ్మేళన్ సంస్థ వారు అనుకున్నారు. ఆహ్వానం రద్దు కావడం ఆహ్వానితురాలైన సెహగల్ కు ఎలాగూ ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆమెతో పాటు భావ ప్రకటనా స్వాతంత్ర్యం వంటి ప్రజాస్వామ్య అంశాలతో సంబంధం ఉన్న వారికి కూడా చిరాకుగానే ఉంటుంది. ఈ పరిస్థితి నుంచి మూడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొట్టమొదటిది-ఆహ్వానాన్ని ఉపసం హరించుకోవడం అంటే ఆత్మగౌరవాన్ని కోల్పోవడమే. అయితే ఇది ఆహ్వానించే వారి ఆత్మగౌరవం కోల్పోవడమా లేక ఆహ్వానితుల ఆత్మగౌరవానికి భంగం కలగడమా? రెండవది-ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇలాంటి నిర్ణయం తీసుకున్న వారి నైతిక శక్తి ఏమిటి? మూడవది-ఇలాంటి నిర్ణయంవల్ల ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వారి ఆత్మ గౌరవానికి భంగం కలుగుతుందా?

ఈ ఉదంతం తర్వాత అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం కార్యదర్శి ఆ స్థానానికి రాజీనామా చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకున్నది ఆయనే. రాజీనామా చేయడం అంటే ఆయన తన ఆత్మ గౌరవానికి భంగం కలిగినట్టు భావించడమే. ఈ సంస్థ కార్యదర్శి గానీ మరెవరైనా కాని ఆత్మ గౌరవాన్ని ఎందుకు కోల్పోవాలి? రాజకీయాధికారం చెలాయిస్తున్న పక్షం ఎవరైనా అవమాన పడవలసిన పరిస్థితి ఎందుకు తీసుకురావాలి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారిలో కొందరు కీలకపాత్ర పోషించి, అధికార పక్షంతో సంధాన కర్తలుగా పని చేసి తమ రాజకీయ, వృత్తిపరమైన లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నించి ఉండవచ్చు. అందుకే ఈ కార్యక్రమం నిర్వాహకులు ఈ పనే చేసి వెల్లువెత్తుతున్న విమర్శలను భరించడానికి తాము షాక్ అబ్సార్బర్ల లా ఉండాలనుకున్నారు. అందుకే సెహగల్ కు పంపిన ఆహ్వానాన్ని ఏకపక్షంగా ఉపసం హరించుకోవాలని నిర్ణయించారు. దీనికి తోడు ఈ నిర్వాహకులు ప్రభుత్వ ఒత్తిడికి కూడా లొంగిపోయారు.

నిర్వాహక కమిటీ నిర్ణయంతో తమకు ఏ సంబంధమూ లేనట్టుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి వ్యవహరించారు. సెహగల్ ప్రారంభోపన్యాసం రద్దు కావడంలో వీరి ప్రత్యక్ష ప్రమేయం లేకపోవచ్చు. కానీ ఇలాంటి ఉదంతాలవల్ల లాభం కలిగేది ప్రభుత్వానికే.

నిర్వాహకులను అవమానకర స్థితిలోకి నెట్టడంలో ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించడం సాధ్యం కాదు. మరాఠీ సాహితీ జగత్తులోని వారు ఈ ఉదంతంపై విమర్శలు గుప్పిస్తుంటే ప్రభుత్వం నిర్వాహకులను అడ్డం పెట్టుకుని తమ పాత్ర ఏమీ లేనట్టు వ్యవహరించింది. ఇలా నిందలను, అవమానాలను భరించే వారిని తయారు చేయడంవల్ల అధికార పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నైతిక విలువలు, ప్రజాస్వామ్య చర్చలు జరిపే అవకాశం తగ్గిపోయాయి.

నయన్ తారా సెహగల్ ప్రసంగం కచ్చితంగా కేంద్రంలోని, రాష్ట్రంలోని ప్రభుత్వాలను విమర్శించేదిగానే ఉండేది. వీరు ప్రభుత్వం మీద వ్యక్తమయ్యే విమర్శలను భరించడానికి సిద్ధంగా లేరు. ప్రస్తుత పరిస్థితికి పూర్తి భిన్నంగా ఎమర్జెన్సీ అమలులో ఉండగా జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకోవాలి. 1975లో జరిగిన ఈ సంస్థ 51వ వార్షికోత్సవంలో, అప్పటి కేంద్ర మంత్రి వై.బి. చవాన్ ఉండగానే దుర్గా భగవత్ ఎమర్జెన్సీని తూర్పారబడ్తూ ప్రసంగించారు. పాలకపక్షం ఇలాంటి సందర్భాలలో పాల్గొనడానికి నిరాకరించడం అంతే మారుతున్న పరిస్థితుల గురించి చర్చించడానికి సిద్ధంగా లేకపోవడమే. ఉదాహరణకు ఈ వర్గంవారు అధికారం సంపాదించడం ఎలా అన్న వ్యూహం రూపొందించడంలో నిమగ్నమై ఉంటారు. కానీ సమానత్వం, న్యాయం, గౌరవం లాంటి అంశాలు ఇలాంటి చోట సహజంగానే చర్చకు వస్తాయిగనక ఈ అధికారవర్గాలకు అసలు చర్చించే ఉద్దేశమే ఉండదు. ఇలాంటి చర్చలు అనుమానాలు నివృతి చేసుకోవడానికి అవసరం. ఇతరులతో చర్చించడం ఇష్టం లేకపోతే తమలో తామైనా చర్చించుకోవచ్చు. మానవీయ విలువలు, విశ్వజనీన విలువలు మొదలైన అంశాలపై ప్రస్తుతం అధికారంలో ఉన్న వర్గంలో ఏ స్థాయిలోనైనా చర్చ జరుగుతుందా అన్న విషయం మనకు తెలియదు. ఈ వర్గాలు అధికారం ఎలా సంపాదించాలన్న వ్యూహాలు రూపొందించడానికే తమ సమయమంతా వెచ్చిస్తాయా? పార్టీ స్థాయిలోనూ, ప్రభుత్వ స్థాయిలోనూ కొన్ని అంశాలపై చర్చలను నిరంతరం, నిరవధికంగా వాయిదా వేస్తుంటారు. దీనివల్ల వీరు అధికారం కాపాడుకోవడం మీద మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. ఇలాంటి సందర్భాలలో చర్చలో పాల్గొనవలసి వచ్చినప్పుడు 1936 లో లాహోర్లో జరగవలసిన జాత్ పాత్ తోడక్ మండల్ సమావేశంలో డా. బి.ఆర్. అంబేద్కర్ చేయవలసిన ప్రసంగం చేయలేకపోయారు. 2019లో నయన్ తారా సేహగల్ కు అదే పరిస్థితి ఎదురైంది.

ప్రసిద్ధ సాహిత్యవేత్తలు నయన్ తారా సెహగల్ కు గట్టి మద్దతు అందించారు. ఆమె స్థానంలో మరో ప్రసిద్ధ మరాఠీ రచయితను ఆహ్వానించాలన్న నిర్వాహకుల ప్రతిపాదనను ఆమోదించలేదు. దీన్నిబట్టి ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు పాటుపడ్తున్న సెహగల్ పట్ల గౌరవం ఇనుమడిస్తోంది. భావప్రకటనా స్వేచ్ఛకు అడ్డుతగులుతున్న వారి నైతిక శక్తి దిగజారుతున్నట్టు కూడా రుజువు అవుతోంది.

Back to Top