శ్రీ లంకలో పెట్రేగిన తీవ్రవాదం
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
శ్రీలంకలో 2019 ఏప్రిల్ 21 న జరిగిన తీవ్రవాద దాడి కేవలం ఆ దేశాన్నే కాక యావత్ప్రపంచానికి దిగ్భ్రాంతి కలగజేసింది. ఈస్టర్ పండగ రోజున కాథలిక్కుల చర్చీల్లో, పర్యాటకులు ఉండే హోటళ్లలో పక్కా వ్యూహంతో జరిగిన దాడులు 350 ప్రాణాలను బలిగొన్నాయి. ( ఆ తరవాత మృతుల సంఖ్య 253 అన్న సమాచారం వచ్చింది.) కొచ్చికడేలో ఆంథొనీ ప్రార్థనా మందిరంలో, కుతువాపితియాలో సెయింట్ సెబాస్టియన్ చర్చిలో, బట్టికలోవలో జియాన్ చర్చిలో; షాంగ్రి లా, కింగ్స్ బరీ, చిన్నమాన్ గ్రాండ్ హోటళ్లలో ఆత్మాహుతి దళాలు బాంబు పేలుళ్లకు పాల్పడ్డాయి. ఈ ఆత్మాహుతి దళాలు ఇస్లామిక స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐ.ఎస్.ఐ.ఎస్.) కు చెందినవంటున్నారు. ఈ సంస్థ బాంబు పేలుళ్లకు పాల్పడింది తామేనని చెప్పుకుంది. బాంబు పేలుళ్ల తీవ్రత, దాడి చేయడానికి ప్రార్థనా స్థలాలను ఎంపిక చేసుకోవడం చాలా భీతావహమైంది. ఈ దాడులు ఇటీవల న్యూజీలాండ్ లోని క్రైస్ట్ చర్చి మీద జరిగిన డాడులలాగే ఉన్నాయి. ఈ దాడులు సంక్షోభంలో ఉన్న శ్రీలంక రాజకీయ వ్యవస్థలో ఉన్న విభేదాలను, మతపరమైన మైనారిటీలకు ఉన్న అభద్రతా భావాన్ని, ముఖ్యంగా దక్షిణాసియా ప్రాంతంలో జాతుల మధ్య ఉద్రిక్తతల తీరును బయట పెట్టాయి.
కాథలిక్ చర్చీల మీద దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు ముందే గూఢచార సమాచారం అందినా ఈ సమాచారాన్ని అధికారికంగా అందజేయలేదని శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింగే అంటున్నారు. శ్రీ లంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన సర్వ సేనాధిపతిగా, రక్షణ శాఖ మంత్రిగా, శాంతి భద్రతల మంత్రిగా కూడా ఉన్నప్పటికీ గూఢచార సమాచారం అందినా జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించడమే. శ్రీ లంక అధ్యక్షుడు 2018 అక్టోబర్ లో "రాజ్యాంగ కుట్ర" జరిగినప్పటి నుంచి శ్రీ లంకలో పరిపాలన అస్తవ్యస్తంగానే ఉంది. అయితే ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింగే తన బాధ్యతల నుంచి తప్పించుకోలేరు. శాంతి భద్రతల పరిరక్షణ మంత్రిత్వ శాఖను దేశాధ్యక్షుడి పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రధానమంత్రి దీనికి సమ్మతించారు. శ్రీ లంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన నాయకత్వంలోని శ్రీ లంక ఫ్రీడం పార్టీకి (ఎస్.ఎల్.ఎఫ్.పి.) ప్రధానమంత్రి విక్రమ సింగే నాయకత్వంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ (యు.ఎన్.పి.)కి మధ్య వైరాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. దీనివల్లే వందలాది మంది ప్రాణాలు బలైనాయి. వివిధ జాతుల మధ్య సామరస్యం సాధిస్తామని వాగ్దానం చేసి 2015లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం సామాజిక సామరస్యాన్ని కాపాడడంలో ఘోరంగా విఫలమైంది. దశాబ్దం కిందట శ్రీ లంకలో అంతర్యుద్ధం జరిగేది.
సామరస్యం సాధించడానికి చేసే ప్రయత్నాలు భద్రతా దళాల పాత్రను, జాతి భద్రతను నిర్లక్ష్యం చేతున్నాయని పారమ్యవాదాన్ని, నిరంకుశత్వాన్ని ప్రోత్సహించే మాజీ అధ్యక్షుడు మహేంద్ర రాజపక్ష దుయ్యబడ్తున్నారు. ఈ సంవత్సరం ఎన్నికలు జరగనున్నాయి. ఆ సమయానికి వివిధ అభిప్రాయాలున్న వారు తమ తమ అభిప్రాయాల ప్రకారం సంఘటితం కావచ్చు. ఇదే అదునుగా అధ్యక్షుడు అత్యవసర పరిస్థితిని అమలు చేయవచ్చు. ఇలాంటి పరిస్థితి శ్రీ లంకలోని మతపరమైన మైనారిటీ వర్గాలలో భయాందోళనలను పెంచుతుంది. ఇలాంటి భయానక వాతావరణం ఏర్పడేట్టు చేయడమే ఐ.ఎస్.ఐ.ఎస్., ఇతర తీవ్రవాద సంస్థల లక్ష్యం. భయోత్పాతాన్ని సృష్టించి వారు ఈ పని చేస్తారు.
నిజానికి శ్రీ లంకలోని క్రైస్తవులు, ముస్లింల మధ్య కలహాలు, ఉద్రిక్తతలు ఏమీ లేవు. ఈ రెండు వర్గాల మీద అధిక సంఖలో ఉన్న సింహళ బౌద్ధ తీవ్రవాదులు దాడి చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇవి శ్రీ లంక సామాజిక అమరికకు తీవ్ర విఘాతం కలిగిస్తాయి. కొంత మంది శ్రీ లంక పార్లమెంటు సభ్యులు ఇప్పటికే ముస్లింలపట్ల వివక్షా పూరిత చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరుతున్నారు. ముస్లింలంటే ద్వేషం పెంచే పనులు కొనసాగుతూనే ఉన్నాయి. వేధింపులకు గురవుతున్న అహమదీయ ముస్లింలు రేవు పట్టణం ఉన్న నెగోంబో నుంచి వెళ్లి పోయి అజ్ఞాతవాసం గడుపుతున్నారు. గత దశాబ్ద కాలంలో సింహళ బౌద్ధులకు చెందిన బోడు బల సేన ముస్లింల మీద అనేక సార్లు దాడులు చేసింది. 1980లు, 1990లలో జాతి రీత్యా తమిళులైన ముస్లింలను లిబరేషన్ టైగర్స్ ఆఫ్ టమిల్ ఈలం (ఎల్.టి.టి.ఇ.)కి చెందిన వారు జాఫ్నాలో తీవ్ర వేధింపులకు గురి చేశారు. దీనికి తోడు సౌదీ అరేబియాలో మూలాలున్న వాహబీ సిద్ధాంత ప్రభావం పెరిగిపోతోంది. మైనారిటీ వర్గాలను ఈ సిద్ధాంతం తీవ్రవాదులను చేస్తోంది. ఇలాంటి భయంకర ఘర్షణ వాతావరణం ఉన్నప్పుడు శ్రీ లంకలో అధికారంలో ఉన్న రాజకీయ నాయకత్వం సామాజిక సామరస్యం సాధిస్తామని 2015లో చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉండాలి. అధిక సంఖ్యాక మతంవారు జాతిని మరో మారు సంక్షోభంలో కూరుకుపోకుండా చేయాలి. లేక పోతే మితవాద తీవ్రవాదం ప్రపంచమంతా పెరిగిపోతున్న దశలో మరింత ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది.
భారత్ లో దీని ప్రభావం గురించి ఆలోచిస్తే ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ బాహాటంగా ఈ విషాదాన్ని స్వప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారు. ఈ గర్హనీయమైన ధోరణిని శ్రీ లంకలోని పౌరులు, రాజకీయ వ్యాఖ్యాతలు తీవ్రంగా నిరసించారు. భారత ప్రధానమంత్రి ఇలాంటి వైఖరి కొనసాగిస్తే దక్షిణాసియాలో అసలే అంతంతమాత్రంగా ఉన్న భారత్ పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది.