ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

యుద్ధోన్మాదం ప్రజాస్వామ్య విరుద్ధం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

పుల్వామాలో సి.ఆర్.పి. దళాల మీద తీవ్రవాదుల దాడి, పాక్ సరిహద్దు దాటి మన వైమానిక దళం చేసిన దాడుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వ్యవహార సరళి అనైతికం, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఘర్షణ వాతావరణం పెరుగుతూ ఉంటే దేశ ప్రజల్లో విశ్వాసం పెంపొందించడానికి ప్రధానమంత్రిగానీ, ఆయన సహచరులుగానీ ఏ ప్రయత్నమూ చేయలేదు. భారత వైమానిక దళ పైలెట్ పాకిస్తాన్ అధీనంలో ఉన్న సమయంలో ప్రధాని, ఇతర మంత్రులు తమ స్వప్రయోజన రాజకీయ కార్యకలాపాలు కొనసాగించారు.  దాపరికం లేని పద్ధతిలో ప్రజలకు సమాచారం అందించడానికి బదులు తమకు అనుకూలమైన మీడియా సంస్థల ద్వారా నిగ్గు తేలని సమాచారాన్ని "విశ్వసనీయ వర్గాల" సమాచారం అని చెప్పి ప్రచారంలో పెట్టారు. ఘర్షణలో, సంక్షోభమో ఎదురైనప్పుడు దాపరికం లేకుండా వ్యవహరించడం చాలా అవసరం. ప్రజలు వాస్తవాల ఆధారంగా నిర్ధారణలకు వచ్చే అవకాశం ఉండాలి. కానీ ఈ ప్రభుత్వం అలా చేయకుండా ఎన్నికల ప్రయోజనాల దృష్టితోనే వ్యవహరిస్తోంది. దీనివల్ల ప్రభుత్వం తాను మొనగాడినని నిరూపించుకోవడానికి వీలు కావచ్చు కానీ నిజానికి ప్రభుత్వం ఏం చేస్తోందో, దేశ రక్షణ చర్యలు ఏం తీసుకుంటోందో, ఎలాంటి వ్యూహాలు రూపొందిస్తోందో తెలియదు. ఉద్రిక్తత తార స్థాయిలో ఉన్నప్పుడు మన పైలెట్ విడుదలైన తరవాత రక్షణ మంత్రి ఒక ట్విట్టర్ సందేశం పంపడం తప్ప ప్రభుత్వం నుంచి ఏ సమాచారమూ లేదు.

సంక్షోభ సమయంలో ప్రభుత్వం దేశానికి రాజకీయ నాయకత్వం వహించకుండా భారత వైమానిక దళ దాడులను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటోంది. వైమానిక దళం సాధించిన విజయాన్ని తమ పార్టీ సాధించిన ఘనతలా బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. 2016లో మెరుపు దాడుల రీతిలోనే పాక్ ప్రేరేపిత తీవ్రవాదంపై "ప్రతీకారం" తీర్చుకున్నది తామేనని, ఇదివరకెప్పుడూ ఇలాంటిది లేదని ఊదరగొడ్తున్నారు. తద్వారా దేశ భద్రతకు పాటు పడేది తాము మాత్రమేనని ప్రచారం చేసుకుంటున్నారు. వైమానిక దాడుల్లో వందలాది మంది మరణించారని చెప్తున్నారు. వైమానిక దళం మాత్రం ఇలాంటి లెక్క ఏమీ చెప్పడం లేదు. భిన్నమైన లెక్కలు చెప్పడంవల్ల ఈ లెక్కలు నమ్మడం కష్టం. వాస్తవాలను కావాలని తొక్కి పెడ్తున్నారు. జాతీయతా వాదం గురించి ఊదరగొడ్తున్నారు. ఈ ప్రచారం జాతీయత అంటే గర్వించదగ్గదిగా, గొప్ప విజయంగా మారిపోతుంది. ఇది పౌర సమాజం సైతం యుద్ధోన్మాదం ప్రదర్శించడానికే ఉపయోగపడ్తుంది. వ్యూహాత్మక విజయాలను కేవలం కొన్ని అంకెలకు పరిమితం చేయడంవల్ల సైనికీకరణ ధోరణి ప్రబలి పోతుంది. ఇది విదేశాంగ విధానాన్ని, రక్షణ విధానాలను తెలివితక్కువగా అర్థం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడడం కాక యుద్ధం సరైందేనన్న దురభిప్రాయం కలగజేస్తుంది. సైనిక చర్య అంతర్గత రాజకీయాలలో ఒక పావుగా మారుతుంది. పార్టీ ప్రయోజనాల కోసం జాతీయ ప్రయోజనాలను బలి పెట్టడం వల్ల అర్థవంతమైన చర్చలకు తావు లేకుండా పోతుంది.

ఘర్షణ జరిగే ప్రమాదం ఉన్నప్పుడు జాతినంతటినీ ఒక్క తాటి మీద నడపడానికి బదులు ప్రభుత్వం ఘర్షణ ధోరణి అనుసరిస్తోంది. భారత వైమానిక దాడుల్లో ఎంతమంది మరణించారు, అవతలి పక్షానికి జరిగిన నష్టం ఎంత అని ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పకుండా సాయుధ దళాలను అడ్డం పెట్టుకుంటోంది. ఈ ప్రశ్నలకు సముచిత వేదికల మీద సమాధానం చెప్పకుండా ప్రతి వేదిక మీద ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోస్తోంది. ప్రతిపక్షాలు సాయుధ దళాలను అనుమనిస్తున్నాయి అని ప్రచారం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో సాయుధ దళాలు ప్రశ్నించడానికి వీలు లేనివి కావు. అంటే సాయుధ దళాలను కూడా ఈ ప్రభుత్వం ఎన్నికల ప్రయోజనం కోసమే వినియోగిస్తోంది. సాయుధ దళాల నిష్పాక్షితను ప్రశ్నార్థకం చేస్తోంది. సాయుధ దళాలు ప్రజాస్వామ్యంలో నిష్పాక్షికంగానే ఉండాలి. అయితే రాజకీయాలనే యుద్ధంగా పరిగణించే పార్టీ ఇలాంటి పరిణామాలను ఖాతరు చేయదు.

రాజ్యం అంటే ఈ ప్రభుత్వం యుద్ధ యంత్రాంగం అని భావిస్తోంది. ఈ ప్రభుత్వంలో అది మరీ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దును కూడా నల్లధనంపై మెరుపు దాడిగానే ప్రచారం చేసుకున్నారు. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకించిన వారందరినీ ద్రోహులుగా పరిగణించారు. ఈ ప్రభుత్వ యుద్ధ తంత్రాలన్నీ ప్రతిపక్షాలకు వ్యతిరేకమైనవే. అంటే దేశ పౌరులకు వ్యతిరేకమైనవే. అధికార పార్టీకి అధికారం నిలబెట్టుకోవడం మీద ఉన్న దృష్టి ప్రజాస్వామ్య వ్యవస్థలను పరిరక్షించడం మీద లేదు. వైమానిక దాడుల వల్ల లబ్ధి పొందాలన్న ప్రయత్నంలో శత్రువులుగా పరిగణించడం అంటే సర్వదా యుద్ధానికి సన్నద్ధంగా ఉండడమే. దేశంలో ఉన్న కొందరి మీదే యుద్ధం చేయాలని వాదించే సంఘ్ పరివార్ ఛత్రఛాయల్లో నడిచే పార్టీ ఈ ధోరణి అనుసరించడంలో ఆశ్చర్యం లేదు. ప్రజాస్వామ్యంలో పౌరులను నిరంతరం యుద్ధ సన్నద్ధులను చేయకూడదు. వారితో సంప్రదించాలి. కానీ ఈ ప్రభుత్వానికి సంప్రదించే సామర్థ్యం లేదు. అందుకే యుద్ధం గురించే మాట్లాడుతుంది. 

Back to Top