ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

మాల్దీవుల్లో అనవసర జోక్యం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

మాల్దీవుల్లో దాదాపు నెలన్నరగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అమెరికా, భారత్ చూపుతున్న ఆసక్తి ఆ దేశ ప్రజల ప్రజాస్వామ్య హక్కులకోసం అనుకోవడం అమాయకత్వమే అవుతుంది. హిందూ మహా సముద్రంలో ఉన్న ద్వీప సమూహం అయిన మాల్దీవులు నౌకాయాన మార్గంలో ఉన్నాయి. భారత్, జపాన్, చైనా, తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా దేశాలకు ఈ మార్గం గుండానే చమురు, ఇతర సరుకుల రవాణా అవుతుంది. పశ్చిమాసియా, ఆఫ్రికా, యూరప్ లాంటి చోట్లకు వస్తువుల సరఫరాకు కూడా ఇదే మార్గం. మాల్దీవులను భారత్ తన పెరడు అనుకుంటుంది. భారత్, అమెరికా దేశాల భావనకు విరుద్ధంగా మాల్దీవుల ప్రభుత్వం చైనా ఒకే బెల్ట్, ఒకే రోడ్డు మౌలిక సదుపాయాల ప్రథకంలో పాల్గొనాలని నిర్ణయించింది. చైనాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

ఫిబ్రవరి అయిదున మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ అత్యవసర పరిస్థితి ప్రకటించి ప్రజాస్వామ్య హక్కులను రద్దు చేశారు. పార్లమెంటులో ఇద్దరు ప్రతిపక్ష నాయకులను విడుదల చేయాలని ఫిబ్రవరి ఒకటో తేదీన తీర్పు చెప్పిన ఇద్దరు న్యాయమూర్తులను అరెస్టు చేయించారు. మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ ను, ఇతర ప్రముఖ ప్రతిపక్ష నాయకులను కూడా విడుదల చేయాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఆ మరుసటి రోజే మాల్దీవుల వ్యవహారంలో భారత్ జోక్యం చేసుకోవాలని రెచ్చగొట్టే విధంగా ప్రకటన చేశారు. ఆయన శ్రీ లంకలో ప్రవాస జీవితం గడుపుతున్నారు. మాల్దీవుల అధ్యక్షుడు యామీన్ ను గద్దె దించాలని అమెరికాకు, భారత్ కు విజ్ఞప్తి చేసారు. భారత్, అమెరికా, యూరప్ సమాజం ప్రతిపక్షాలకు మద్దతు ఇస్తున్నందువల్ల న్యాయమూర్తులపై విపరీతమైన ఒత్తిడి ఉండి ఉంటుంది. తన పార్టీ నుంచి ఫిరాయించిన వారికి కోర్టు విముక్తి కలిగించడంతో యామీన్ ప్రభుత్వం పతనమై ఉండేది. ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోవడం కష్టమై ఉండేది. నషీద్ తిరిగి వచ్చి అధ్యక్ష పదవికి గట్టి అభ్యర్థి అయి ఉండే వారు. అందువల్ల యామీన్ ఎమర్జెన్సీ విధించి మిగతా సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో అంతకు ముందు ఇద్దరు న్యాయమూర్తుల నిర్ణయాన్ని తిరగతోడించారు.

"స్వల్ప వ్యవధిలో సైన్యాన్ని దించడానికి భారత సేనలు సిద్ధంగా ఉన్నాయి" అని భారత్ లోని బడా మీడియా సంస్థలు ప్రచారం చేశాయి. కాని మాల్దీవుల భద్రతా దళాలు యామీన్ కు విశ్వాసపాత్రమైనవని భారత్ కు తెలుసు. అదీ గాక మాల్దీవుల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకునే హక్కు భారత్ కు లేదని ప్రరోక్షంగానైనా చైనా కచ్చితమైన హెచ్చరిక జారీ చేసింది. పైగా అమెరికా, బ్రిటన్ మద్దతు భారత్ కు ఉన్నా సైనిక జోక్యం చేసుకోవడం అంటే "సైనికంగా తటస్థంగా" ఉంటాం అన్న భారత హామీకి విఘాతం కలిగినట్టవుతుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మఒదీకి ఫోన్ చేసి మాల్దీవులలో పరిస్థితి గురించి చర్చించాలని అడిగారు. శ్రీ లంక లో మహీంద రాజపక్ష చైనాకు అనుకూలంగా పని చేస్తున్నారన్న కారణంగా అమెరికా, భారత్ దేశాలు మైత్రీపాల సిరిసేన తిరుగుబాటు జెండా ఎగరవేయడానికి తోడ్పడ్డాయి. 2015 లో అధ్యక్ష స్థానానికి జరిగిన ఎన్నికలలో సిరిసేన ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్తి కావడానికి సహకరించాయి. సిరిసేన గెలిచారు కూడా. అలాగే మాల్దీవులలో ప్రభుత్వం మారేటట్టు చేయాలని అమెరికా, భారత్ దేశాలు భావిస్తున్నాయి. 1998లో అబ్దుల్ గయూం నాయకత్వంలోని నిరంకుశ ప్రభుత్వం పై జరిగిన కుట్రను భగ్నం చేయడానికి భారత సేనలు సహకరించాయి. గయూం భారత మద్దతుతో 2008 దాకా అధికారంలో కొనసాగారు.

ఫిబ్రవరి 20 వ తేదీన యామీన్ మరో 30 రోజుల పాటు ఎమర్జెన్సీని పొడిగించడంతో భారత్, అమెరికా దేశాలు కంగు తిన్నాయి. భారత్ కు అతి సమీపంలో ఉన్న పొరుగుదేశంలో తన ప్రభావం తగ్గడాన్ని ఎదుర్కోవాలని మీడియాలోని కొన్ని వర్గాలు, భద్రతా విభాగం  సూచించినప్పటికీ భారత్ సమ్యమం పాటించింది. తన పొరుగున ఉన్న దేశంలో భద్రత కొరవడితే భారత్ అంతర్జాతీయ శక్తిగా ఎలా అవతరిస్తుంది అని భద్రతా వ్యవహారాల నిపుడు ఒకరు ప్రశ్నించారు. బలవంతం చేసే దౌత్య విధానమైనా అనుసరించాలని అవసరమైతే సైనిక జోక్యం చేసుకోవాలను సూచించిన వారూ ఉన్నారు.

మాల్దీవులలో చైనా ప్రభవాన్ని తగ్గించడం ఎలా అన్న ప్రశ్నతోనే భారత అధికార వ్యవస్థలోని వారు ఆలఒచిస్తున్నారు. ఈ పని ఎలా సాధించాలని ట్రంప్, మోదీ కూడా ఆలఒచిస్తూ ఉండి ఉంటారు. వారు వుస్తృత ప్రయోజనం హిందూ మహా సముద్రంలో నౌకాయాన మార్గాలపై ఆధిపత్యం సంపాదించడం. చైనా విదేశీ వాణిజ్యానికి ఉపయోగపడేది ఇదే మార్గం. మాలిదీవుల్లో సైనిక స్థావరాలు ఏర్పాటు చేయాలను భారత్, అమెరికా దేశాలు భావిస్తున్నాయి. ఆ స్థావరాలను సెషెల్స్, డీగో గార్షియాతో అనుసంధానం చేయాలనుకుంటున్నాయి. బహుశః మాల్దీవుల్లో ప్రభుత్వం మారితే ట్రంప్ ప్రభుత్వం అక్కడ సైనిక స్థావరాలు నెలకొల్పడానికి ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు.

Back to Top