ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

పక్షపాత దృష్టికి బదిలీ విరుగుడా!

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో దళితుల మీద తాను తప్పుడు కేసులు మోపడాన్ని, ముస్లింలను వేధించడాన్ని, మరాఠాలను కాపాడడాన్ని గొప్పగా చెప్పుకుంటూ ఐ.పి.ఎస్. అధికారి భాగ్యాశ్రీ నవ్తకే రూపొందించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెను బదిలీ చేసింది. ఉన్నతాధికారులను, పోలీసు అధికారులను శిక్షించడానికే బదిలీ చేస్తారన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. అయితే ప్రభుత్వాలు తమకు నచ్చని అధికారులనూ బదిలీ చేయవచ్చు. ఫలానా అధికారిని బదిలీ చేయమని ప్రజల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు వారిని బదిలీ చేసి ప్రజల కోర్కె తీర్చాం అని చెప్పుకోవడానికీ ఆ పని చేయవచ్చు. నవ్తకే అభిప్రాయాలు గమనిస్తే ఆమెకు దళితులు, ముస్లింల మీద ఎంత ద్వేషం ఉందో అర్థం అవుతుంది. దీన్నిబట్టి రెండు విషయాల గురించి ఆలోచించాలి. బదిలీ చేసినంత మాత్రాన నవ్తకేలో ఉన్న కులతతత్వం, మత తత్వ దృక్పథం మారిపోతుందా? ఆ వర్గాల మీద ద్వేషం సమాజంలో అంతరిస్తుందా?

పోలీసు అధికారులు, ఇతర ఉన్నతాధికారుల్లో కులతత్వం, మతతత్వం, పితృస్వామ్యంవంటి ఆధిపత్యం చెలాయించే భావజాలం పాతుకుపోయిందన్నది కొత్తేమీ కాదు. పోలీసు వ్యవస్థలో పితృస్వామిక భావజాలం దండిగా కనిపిస్తుంది. మహిళలు, ఆదివాసులు, దళితులు, మైనారిటీలు అంటే చాలా మంది పోలీసు ఉన్నతాధికారులకు గిట్టదు.

సామాజిక-ఆర్థిక కొలమానాలనుబట్టి చూస్తే మహారాష్ట్ర "అభివృద్ధి" చెందిన రాష్ట్రం కింద లెక్క. అయితే పైన పేర్కొన్న మహిళా పోలీసు అధికారి వ్యవహార సరళి అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా ఉందని రుజువు అవుతోంది. ఇటీవలి సంఘటనలనే గమనిస్తే 2006లో ఖైర్లంజి మారణ హోమం దగ్గర నుంచి భీమా-కోరేగావ్ సంఘటనలో దళితుల మీద అఘాయిత్యాలనుబట్టి ఈ వర్గాల విషయంలో పోలీసులు వివక్ష చూపుతున్నారని స్పష్టం అవుతోంది. 2016లో మరాఠాలు 1989నాటి షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తరగతుల (అత్యాచార నిరోధక) చట్టానికి వ్యతిరేకంగా మౌన యాత్ర చేశారు. మరో వేపు దళితుల మీద అఘాయిత్యాలు, దహనకాండ జరిగినప్పుడు పోలీసులు ఎలాంటి చర్యా తీసుకోలేదని ఫిర్యాదు చేస్తూ బొంబాయ్ హై కోర్టులో పిటిషన్ దాఖలైంది. గత కొన్ని సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్ లో నిందుతులు ఏ వర్గం వారు అన్న దాన్నిబట్టి దూకుడుగా వ్యవహరిస్తున్నారు లేదా నిరాసక్తంగా ఉంటున్నారో స్పష్టంగానే కనిపిస్తోంది. "ఎన్కౌంటర్ల" పేర పోలీసులు అనేకమందిని అక్రమంగా కాల్చి చంపుతున్నారు. యువ జంటలను, ముఖ్యంగా ఆ జంటలో ఒకరు హిందువు, మరొకరు ముస్లిం అయినప్పుడు రోమియో బృందాలు వారిని విపరీతంగా వేధిస్తున్నాయి. "లవ్ జిహాద్" నెపంతో అనేక ఆగడాలు జరిగాయి. గోహత్యకు పాల్పడుతున్నారన్న నెపంతో మూకలు దాడి చేసి హత్యలకు పాల్పడుతున్నాయి. ఈ సంఘటనల్లో పోలీసులు బలంగా ఉన్న భావజాలం వైపే మొగ్గుతున్నారు. నిరాయుధుడైన ఒక కార్పొరేట్ ఉన్నతోద్యోగిని లక్నోలో పోలీసులు దారుణంగా హతమార్చారు. నిందితులైన పోలీసుల మీద చర్య తీసుకోకూడదని పోలీసు అధికారులు నల్ల బాడ్జీలు ధరించి నిరసనకు దిగారు. హషింపురా కేసులో తీర్పు కూడా ఇలాగే ఉంది. ప్రొవిన్షియల్ సాయుధ దళాల వారు (పి.ఎ.సి.) 42 మంది ముస్లింలను హతమార్చి వారి మృత దేహాలను కాలవలో పడేసిన ఈ సంఘటనపై 31 ఏళ్ల తర్వాత దిల్లీ హైకోర్టు తీర్పు వెలువడింది. "చట్టాన్ని అమలు చేసే వ్యవస్థల్లోనే పక్షపాత దృష్టి ఉంది" అని హైకోర్టు తీర్పులో పేర్కొన్నారు.

ప్రైవేటు గొడవలు జరిగినప్పుడు, శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు, దొమ్మీలు, ఇతర వివాదాలు తలెత్తినప్పుడు చర్య తీసుకోవలసింది, మధ్యవర్తిత్వం నెరపాల్సింది, శాంతి నెలకొల్పవలసింది పోలీసులే. ప్రజలకు ప్రభుత్వం పోలిసుల రూపంలోనే కనిపిస్తుంది. పోలీసు శాఖలో పని చేసే మహిళలైనా, స్త్రీలైనా అనునిత్యం ప్రజలతో వ్యవహరించవలసి ఉంటుంది. పోలీసులు ప్రజలతో స్నేహంగా మెలిగేట్టు, ప్రజలకు సేవ చేసేట్టు చూడడానికి లేదా అలా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి తరచుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కాని వివిధ వర్గాలవారు, బస్తీల్లో ఉండే వారు పోలీసులను ఏ దృష్టితో చూస్తారు? వారిలో ఉన్న దుర్భ్రమలను, పక్షపాత వైఖరిని నివారించడానికి వారికి ఏ రకమైన శిక్షణ ఇస్తున్నారు?

పోలీసు వ్యవస్థ సంస్కరణ గురించి చర్చోపచర్చలు జరిగాయి. కాని రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ విషయంలో సాధారణంగా ఏమీ చేయవు. 1978లో జాతీయ పోలీసు అకాడమీ పోలీసు వ్యవస్థను సంస్కరించడానికి అనేక సిఫార్సులు చేసింది. ఉత్తరప్రదేశ్ మాజీ పోలీసు డైరెక్టర్ జనరల్ 1995లో ఈ విషయమై సుప్రీంకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. జులియో రెబీరో కమిటీ 1998లో అనేక సూచనలు చేసింది. ఆ తర్వాత పద్మనాభయ్య, మలిమత్, సోలీ సోరబ్జీ కమిటీలు ఏర్పాటు చేశారు. 2006లో సుప్రీంకోర్టు ఆరు ఆదేశాలు జారీ చేసింది. అందులో ఒకటి "పోలీసు అధికారులకు శిక్షణ ఇచ్చేటప్పుడు వారిలో ప్రజాస్వామ్య భావాలు పాదుకొల్పాలని, మన దేశం బహుళ సంస్కృతులకు నిలయం అని తెలియబరచాలి" అని చెప్పింది. కానీ అణగారిన వర్గాల విషయంలో పోలిసుల పక్షపాత ధోరణి కొనసాగడం చూస్తే వారి శిక్షణలో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం అవుతోంది. ఈ విషయంలో ఘోరంగా విఫలమయ్యాం.

మహారాష్ట్రతో సహా అనేక రాష్ట్రాలు ఆదర్శవంతమైన పోలీసు చట్టాలు తీసుకొచ్చాయి. కొన్ని సంస్కరణలూ చేశాయి. కానీ ఇవన్నీ సమగ్రమైనవి కానందువల్ల అరకొరగానే ఉపకరిస్తాయి. సమాజంలో పక్షపాత దృష్టిని, దుర్భ్రమలను తొలగించడానికి చాలా సమయం పడ్తుంది. సమాజంలో ఉన్న ఇలాంటి వక్ర ధోరణులకు వ్యతిరేకంగా పోలీసులకు శిక్షణ ఇవ్వడం అత్యవసరం.

Back to Top