జీవ నది నిర్జీవమవుతున్న వేళ
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
జీవనది అంటే నిరంతరం ప్రవహిస్తూ ఉండాలి. కానీ ఆ నదీ ప్రవాహాన్ని అడ్డగించి “నీరు వృధా కాకుండా "వినియోగించుకుంటున్నాం" అనుకుంటాం. ఇది ఎంతదాకా వచ్చిందంటే ఒక నది జీవనది అవునో కాదో చెప్పలేని స్థితికి వచ్చేశాం. నిజానికి జీవనదిని కనిపెట్టడమే దుర్లభం. ఎందుకంటే ఆ నదీ జలాలను సొరంగాల్లోకి మళ్లించి విద్యుత్తు ఉత్పత్తి చేస్తాం. లేదా అందులో చెత్తాచెదారం, విష పదార్థాలు ఉండవచ్చు. లేదా ఆ నదీ ప్రవాహాన్ని ఒక నీటి గొట్టంలా ఎలా పడితే అలా వంచేసి నదులను అనుసంధానిస్తాం. "అభివృద్ధి" పేరిట, దానిని పునరుజ్జీవింప చేసే పేర నదీ ప్రవాహాన్ని అడ్డుకుంటాం. ఏది సజీవమో ఏది కాదో నిర్ణయించడం కష్టమే. అది సజీవంగా ఉండడానికి దాన్ని బతికించవలసి వస్తే మరీ కష్టం. నది ప్రవాహ గతిని మార్చినప్పుడు దాని సహజ ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. దాన్ని భూసంబంధ, జీవావరణ గతి సహజంగా ఉండదు. ముక్కముక్కలైపోయిన నదిని జీవనది అనడం కష్టమే. అప్పుడు దాని సహజ జీవావరణానికి విఘాతం కలుగుతుంది. స్వయంగా పునరుజ్జీవం చెందే అవకాశం ఉండదు.
గంగా నదే కాక ఇతర నదులూ ఇలాంగే ప్రమాదంలో ఉన్నాయి. గంగా నది పరిస్థితి మరింత దారుణంగా ఉంది. "గంగా మాత పిలుపు" మేరకు నరేంద్ర మోదీ వారణాసి నుంచి పోటీ చేసి గెలిచి ప్రధాని అయ్యారు. అయితే హిందుత్వ ఆలోచనలకు అనుగుణంగానే గంగత్వాన్ని కూడా భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి వినియోగించుకున్నారు. గంగా నదితో అసలు ఉండవలసిన సంబంధం మాత్రం మృగ్యమవుతోంది. పర్యావరణ ఇంజనీరుగా ఉండి సాధువు అవతారం దాల్చిన జి.డి. అగర్వాల్ 112 రోజుల పాటు నిరాహార దీస్ఖ చేసి కాలగర్భంలో కలిసిపోయారు. ఆయన గంగా నది పిలుపు ప్రధాని మోదీకి వినిపిస్తుందనుకున్నారు. ఉత్తరాఖండ్ లోని ఇతరుల లాగే అగర్వాల్ కూడా ఇసక తరలించే సమస్యను, జలవిద్యుదుత్పత్తివల్ల తలెత్తే సమస్యలను పట్టించుకోవాలని అగర్వాల్ కోరారు. ఈ పనులవల్ల చాలా చోట్ల గంగానది ప్రవాహ గతి బాగా తగ్గింది. గంగానది జన్మస్థలమైన హిమాలయ పర్వతాలు ఒట్టిపోతున్నాయి.
గంగా నది అవిరళంగా, నిర్మలంగా ప్రవహించడానికి రూ. 20,000 కోట్లతో నమామి గంగే పథకం ప్రారంభించారు. నది ప్రవాహగతినే దారి మళ్లించినప్పుడు అవిరళత ఎక్కడి నుంచి వస్తుంది? గంగా నది "సంపూర్ణతత్వాన్ని పునరుద్ధరించడం" నమామి గంగే పథకం లక్ష్యం. అది అవిరళత, నిర్మలత్వం పునరుద్ధరించడానికి ఉద్దేశించింది. కానీ ఈ పథకం అమలు చేసే వారు జీవావరణ సూత్రాల ప్రకారం అందులో కనీస జల ప్రవాహం ఉండాలన్న అంశాన్ని పట్టించుకోలేదు. దీనికి కట్టుబడి ఉండడాన్ని తప్పనిసరి చేయలేదు.
నిర్దిష్టమైన చర్యలు తీసుకోకుండా, వాస్తవ పరిస్థితులను గమనించకుండా ప్రధానమంత్రి తిరోగమన మార్గాన్ని అనుసరిస్తున్నారు. గంగా నది పరిరక్షణను అయితే చిన్న చూపు చూస్తున్నారు కాకపోతే భారీ పథకాలు ప్రకటించి, నదీ ప్రవాహాన్ని అడ్డుకుంటూ గంగా నది పునర్వికాసాన్ని కేవలం సంకేత ప్రాయం చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలను పరిరక్షించడానైకే ఇలా వ్యవహరిస్తున్నారు. నదీ ప్రవాహం సవ్యంగా ఉండేట్టు చూడకుండా, ప్రవాహగతిని కాపాడకుండా, అందులోకి వదిలే కశ్మలాలకు అడ్డుకట్ట వేయకుండా, ఆ చుట్టుపక్కల ఉన్న అరణ్యాలను పరిరక్షించకుండా, ఆ నదిలో కలిసే ఇతర నదులను కాపాడకుండా నదిని పరిరక్షించడమేమో కాని చుట్టుపక్కల ప్రాతాలలో "అభివృద్ధికి" దోహదం చేస్తున్నారు. గంగా నదిని కాపాడాలంటే కరకట్టలను బలోపేతం చేయాలి. నదిలోకి నీరు చేర్చే మైదాన ప్రాంతాలను వాణిజ్య అవసరాలకు వినియోగించకూడదు. ఇతర వనరుల నుంచి నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలి.
గంగా నది ఎగువన ప్రవాహా గతిని అంతమొందించారు. హాల్దియా-వారణాసి మధ్య రూ. 5,369 కోట్ల ఖర్చుతో జల మార్గ వికాస్ పథకం అమలవుతోంది. దీనిలో ప్రపంచ బ్యాంకు పెట్టుబడీ ఉంది. ఇటీవలే ప్రధానమంత్రి నదికి ఉన్న ముప్పును ఖాతరు చేయకుండా పెప్సికో్కు స్వాగతం పలికారు. గంగా నదిలో 1,500 టన్నుల బరువు ఉండే నౌకలు తిరగడానికి అవకాశం లేదు కనక భారీ ఎత్తున తవ్వకాలు చేపట్టాలి, తరచుగా ఇసక మేటలు తొలగించాలి, నది గర్భం లోతును కృత్రిమంగా పెంచాలి. ఇందులో వాణిజ్య ప్రయోజనాలున్నాయి. ఉదాహరణకు మేట వేసే ఇసకను నిర్మాణ కార్యకలాపాలకు వినియోగించుకోవచ్చు. బహుళజాతి గుత్త కంపెనీలకు తవ్వకం పనులు అప్పగించారు. అందులో అదానీ కంపెనీ కూడా ఉంది. కాలుష్య ప్రమాదాలను ఖాతరు చేయడం లేదు. జల చరాల, జాలర్ల మనుగడను పరిగణించడం లేదు. వారణాసిలో ఉన్న తాబేళ్ల పరిరక్షణా కేంద్రానికి ఉన్న ప్రతిపత్తిని రద్దు చేయబోతున్నారు. గంగా నదిలో ఉన్న డాల్ఫిన్లు అంతమొందే ప్రమాదం ఉంది.
నదిలో సహజంగా ఉండే జీవజాలం సామరస్యంగా ఎలా ఉంఛాలో పట్టించుకోవడం లేదు కాని వాణిజ్యపరంగా ఏ మేరకు ఉపయోగం ఉందో చూస్తున్నారు. జలమార్గ రవాణాకు, విద్యుదుత్పాదనకు, మతపరమైన పర్యాటకానికి ఎలా పనికొస్తుందో చూస్తున్నారు. నది నుంచి మనం ఎంత పొందగలమనే చూస్తున్నారు. దీనివల్ల పక్కా కట్టడాలు, కాలుష్యం మరింత పెరుగుతాయి. వాణిజ్య అవసరాల మీదే ప్రభుత్వం దృష్టి నిలిపింది కనక త్వరలో ప్రతిపాదించబోయే జాతీయ గంగా నది పునరుజ్జీవన బిల్లు కూడా గంగ పరిరక్షణకు సాయుధ దళాలను నియమించినా ప్రయోజనం ఏమీ ఉండదు. గంగకు కీడు చేసే అంశాలను శిక్షార్హమైన నేరాలుగా పరిగణిస్తే తప్ప ప్రయోజనం ఉండదు. ప్రభుత్వమే వాణిజ్య అవసరాల కోసం వెంపర్లాడుతున్నప్పుడు ఫలితం ఎలా ఉంటుంది గనక.