కోట్లాది రైతుల గోడు, పోరు
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 200 రైతు సంస్థలకు నాయకత్వం వహిస్తున్న అఖిల భారత రైతు పోరాట సమన్వయ సంఘం (ఏ ఐ కె ఎస్ సి సి) గత కొన్ని నెలలుగా రైతులను ‘ఢిల్లీ ఛలో’ కార్యక్రమానికి సమాయత్తం చేస్తోంది. నవంబర్ 29,30 తేదీలలో రాజధాని నగరానికి చేరాలని వారి యోచన. దేశంలో నెలకొనిఉన్న వ్యవసాయ సంక్షోభాన్ని గురించి చర్చించడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం ఏ ఐ కె ఎస్ సి సి ప్రధాన ఎజెండా. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు, కనీస మద్దతు ధర (ఎం ఎస్ పి) అమలు, నియంత్రణ, సమస్యాత్మకంగా మారిన పంటల భీమా విధానాన్ని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకించడం, కరవు పీడిత ప్రాంతాల ప్రభుత్వ వర్గీకరణలో లోపాలు, వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులపట్ల బ్యాంకులు అనుసరిస్తున్న వివక్ష వైఖరి తదితర అంశాలపై ఆ ప్రత్యెక సమావేశంలో చర్చించాలని రైతులు కోరుతున్నారు. రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో వారినుంచి బకాయిలను రాబట్టడానికి కొందరు బ్యాంకు అధికారులు కఠిన వైఖరిని అవలంబిస్తూ వారిని అవమానిస్తున్నారు, వేధిస్తున్నారు. అదే సమయంలో వేల కోట్ల రుణాలు తీసుకొని ఎగవేసిన కొందరు వ్యక్తులపట్ల కొన్ని బ్యాంకుల అధికారులు ఉదారవైఖరిని అవలంబిస్తుండటం గమనార్హం. బ్యాంకుల వివక్ష వైఖరివల్ల ఎంతో మంది రైతులు బలయ్యారు.
కనీస మద్దతు ధర తమకు లాభసాటిగా ఉంటుందా లేదా అనే విషయంలో రైతులకు సందేహాలు ఉన్నాయి. లాభాపేక్షతో ప్రైవేటు వ్యక్తులు మార్కెట్ నియంత్రిస్తున్నందువల్ల ఎప్పటికప్పుడు పరివర్తన చెందే మార్కెట్ తీరుతెన్నుల నుంచి కనీస మద్దతు ధర తమకు ఏ మేరకు విముక్తి కలిగించగలదని వారు చాలా కాలంగా అడుగుతున్నారు. అదేవిధంగా వాణిజ్య పంటలపై కార్పొరేట్ బీమా కంపెనీల పట్టు రోజురోజుకు విస్తరిస్తున్నందువల్ల అది రైతులకన్నా కంపెనీలకే ఎక్కువ ప్రయోజనకారి కాగలదని వారు నమ్ముతున్నారు. దూరగ్రాహక (రిమోట్ సెన్సింగ్) విధానం వల్ల కచ్చితమైన ఫలితాలు వస్తాయా అని కూడా వారికి అనుమానాలు ఉన్నాయి. రిజర్వాయర్లలో నీటి మట్టాల గురించి కచ్చితమైన అంచనాలు ఇవ్వడంలేదని వారు అంటున్నారు. ఈ కారణాలన్నీ వ్యవసాయ సంక్షోభానికి, అది తీర్వరూపం దాల్చి రైతుల ఆత్మహత్యలకు దారి తీస్తోంది.
ఈ నేపధ్యంలో వ్యవసాయ సంక్షోభాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడానికి రైతుల సమీకరణ జరుగుతోంది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించే విషయంలో ఉదాసీనతతో వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని ప్రజాస్వామిక చర్చ జరిపేలా ఒత్తిడి తేవడానికి రైతు సమీకరణ జరుగుతోంది. రైతు సమస్యలను ఎప్పుడు కూడా చుట్టపు చూపుగా చర్చించడం మినహా భారతీయ ఆర్ధిక రంగం అధికార వ్యవహారాల్లో పూర్తిగా విస్మరించడం జరిగింది. పత్రికలలో, ఎలక్ట్రానిక్ మీడియాలో అందంగా, ఆర్భాటంగా వెలువరించే అధికార ప్రకటనలు రైతు ఆత్మహత్యల విషాదకర వాస్తవాలను అపహాస్యం చేస్తుంటాయి.
ఈ సమస్యను పార్లమెంటులో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడానికి గల కారణం తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. చర్చ జరిగితే సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో తమ వైఫల్యాన్ని ప్రభుత్వం అంగీకరించవలసి వస్తుంది. నిజానికి కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలను కాపాడే మిషతో అసలు పరిస్థితిని పట్టించుకోకుండా సంక్షోభం తీవ్రరూపం దాల్చడానికి కారణమయ్యిందని తమనే బాధ్యులను చేస్తారేమో అని కూడా ప్రభుత్వం భయపడుతోంది.
రైతు సమీకరణ అనేక విధాలుగా విశిష్టమైనది. ఇది గతంలో శరద్ జోషి నేతృత్వంలోని షేట్కారి సంఘటన పిలుపు మేరకు జరిగిన రైతు సమీకరణకు భిన్నంగా ఉండగలదనే హామీ కనిపించడం మొదటిది. షేట్కారి సంఘటన ఇండియా, భారత్ అనే ద్వంద్వత్వ వ్యతిరేకత ఆధారంగా రైతులను సమీకరించాలని సంకల్పించింది. గ్రామీణ భారతంలో నివసించే వారి త్యాగాల ఫలితంగా పట్టణాలలో నివసించే మధ్యతరగతి వర్గాలు వినియోగ సంస్కృతికి అలవాటుపడి సబ్సిడీలు అనుభవిస్తున్నారని జోషి విమర్శల సారం. అయితే ఇప్పుడు ఏ ఐ కె ఎస్ సి సి పిలుపుపై జరుగుతున్న రైతు సమీకరణ పల్లె, పట్టణ ప్రాంతాల మధ్య తేడాను చూపకుండా పట్టణాలలో నివసించే మధ్యతరగతి వర్గాల మద్దతును కూడా కూడగడుతోంది. ఈ జనసమీకరణ బహుళవర్గాలకు చెందినదని చెప్పవచ్చు. ఎందుకంటే విద్యార్థులు, కళాకారులు, సినీ ప్రముఖులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన నిపుణులు, వృత్తిపనివారు, బ్యాంకు ఉద్యోగుల నుంచి కూడా దానికి మద్దతు వచ్చింది. ఈ ఏడాది మార్చిలో నాసిక్ నుంచి ముంబైకి జరిగిన చారిత్రాత్మక రైతు యాత్ర ద్వారా బహుళవర్గాల మద్దతు స్పష్టమైంది.
ఇక రెండవ అంశం వ్యవసాయ సంబంధ సమస్యలపై చర్చించడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశం జరపాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి రైతులు ప్రయత్నించడం న్యాయసమ్మతం. ప్రభుత్వం తన వాదన వినిపించడానికి ఇది మంచి అవకాశం. సంక్షోభం గురించి చర్చించడానికి జ్ఞానాత్మకమైన నేపధ్యం కల్పించడంలో రైతులు ముందుండటం మూడవది.
ఇక చివరిది దేశం తమది మాత్రమే అని చెప్పడం ప్రతీకాత్మకం మాత్రమేనని, వాస్తవానికి దేశం కార్పోరేట్ సంస్థల ప్రయోజనాలను కాపాడుతోందని ప్రభుత్వానికి, దేశ ప్రజలకు రైతులు చెప్పదలచుకోవడం. వ్యవసాయ వనరులైన భూమి, నీరు, అడవులు, ఖనిజాల ప్రైవేటీకరణ పెరిగిపోవడంతో అది స్పష్టమవుతోంది. వ్యవసాయానికి పెట్టుబడులు సమకూర్చడం, విత్తనాలు, ఎరువుల సరఫరా, మార్కెట్ ను కూడా నియంత్రించడం ద్వారా ప్రైవేటు కంపెనీలు ప్రభుత్వ మద్దతుతో వ్యవసాయంపై తమ పట్టుబిగిస్తున్నాయి. ఛలో ఢిల్లీ ప్రదర్శన లక్ష్యం రైతులను చిన్న చూపు చూసి తీసివేయరాదని పాలక వర్గాలకు తెలియజేయడం. రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా తాము మరింత మేలైన జీవితాన్ని గడిపే సామర్ధ్యం కలవారని, దేశ ప్రతిష్ఠను పెంచడానికి తోడ్పడగలరని చలో ఢిల్లీ తెలియజెప్పనుంది. వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైనందువల్లే పార్లమెంట్ ప్రత్యేక సమావేశం జరపాలనే వారి డిమాండ్ తలెత్తిందని మనకు తెలుస్తోంది. పార్లమెంట్ చర్చలు, ఒకవేళ జరగనిస్తే, సంక్షోభానికి బాధ్యత ప్రభుత్వానిదేనని తేలుస్తాయి.