ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

యుద్ధోన్మాద జాతీయతకు ధిక్కారం!

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

జనవరి 14 నుంచి 19 దాకా ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ భారత్ లో పర్యటించారు. ఇజ్రాయిల్ తో మనం పూర్తి స్థాయి దౌత్య సమంధాలు నెలకొల్పుకున్న సరిగ్గా 25 సంవత్సరాల తర్వాత నెతన్యాహూ మన దేశంలో పర్యటించారు. ఇజ్రాయిల్ తో మనం దౌత్య సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఓ నేపథ్యం ఉంది. అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య సుధీర్ఘ కాలం పాటు కొనసాగిన ప్రచ్ఛన్న యుద్ధంలో అమెరికా సోవియట్ పై విజయం సాధించిన సందర్భంలోనే మనం ఇజ్రాయిల్ తో స్నేహం కుదుర్చుకున్నాం. 2017 జులై నాలుగు నుంచి ఆరు దాకా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయిల్ సందర్శించారు. దీనికీ ఓ సందర్భం ఉంది. సరిగ్గా వంద సంవత్సరాల కిందట 1917లో బ్రిటిష్ వారు పలస్తీనా ప్రాంతాన్ని ఆక్రమించి యూదులకు ఆవాసం కల్పిస్తామని హామీ ఇస్తూ బల్ఫోర్ ప్రకటన చేసి వందేళ్లు అయిన సందర్భంగా మోదీ ఇజ్రాయిల్ లో పర్యటించారు. యూదు మతస్థుల జాతీయవాద పోరాటం జరుగుతున్నప్పుడు పలస్తీనాలో యూదులకోసం ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేస్తామని వందేళ్ల కింద బ్రిటిష్ సామ్రాజ్యవాదులు హామీ ఇచ్చారు. యూదుల జాతీయోద్యమం దురభిమానంతో కూడుకున్నది. వారి జాతీయోద్యమ పోరాటాన్ని యూదుల దురభిమానంగా వ్యవహరిస్తారు. 1948 మే 14న యూదు యుద్ధోన్మాదులు తమకో స్వతంత్ర దేశం ఏర్పడిందని చెప్పి సరిగ్గా 70 ఏళ్లయింది. వలసవాదుల దుష్కృత్యాలకు సంబంధించిన చేదు జ్ఞాపకాలు అప్పుడు ఎక్కువగా ఉండేవి. భూగోళం మీద అస్తిత్వమే లేని ఇజ్రాయిల్ ను ఏర్పాటు చేయడాన్నీ, పలస్తీనా వారిమీద పాల్పడిన అఘాయిత్యాలను నెహ్రూ హయాంలో మన దేశం తీవ్రంగా ఖండించింది. పలస్తీనియన్లను వారి సొంత ప్రాంతం నుంచి పారదోలి అక్కడ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కృత్రిమంగా ఇజ్రాయిల్ ను సృష్టించారు.

యూదుల దురభిమానాన్ని, యుద్ధోన్మాదాన్ని విస్మరించడానికి వీలు లేదు. దానికి వలసవాదుల దన్ను ఉండేది. ఈ దురభిమానులకు, వారిని వెనకేసుకొచ్చిన వారికి జాత్యహంకారం మెండు. అరబ్బులైన పలస్తీనియన్ల మానవ హక్కులను సంపూర్ణంగా అణచివేసి యూదుయుద్ధోన్మాదులు, వలసవాదులు కలిసి పలస్తీనా ప్రజలను నిరాశ్రయులను చేశారు. యూదుల యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకించడం అంటే యూదు మతాన్ని, ఆ మతస్థులను వ్యతిరేకించడం కాదు. ప్రపంచంలోని యూదులందరి తరఫున పోరాడుతున్నామని చెప్పుకునే యూదుదురభిమాన నాయకత్వం నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులందరికీ బద్ధ శత్రువు. యుద్ధోన్మాదులైన యూదు నాయకులు పలస్తీనాను ఆక్రమించారు. పలస్తీనా వారిని సమాన స్థాయిలో చూడడానికి యూదు దురభిమానులు ససేమిరా అంగీకరించరు. ఇజ్రాయిల్ విష కౌగిలి నుంచి విముక్తం కావడం కోసం పలస్తీనా ప్రజలు వీరోచిత పోరాటం చేశారు. అది సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో భాగమే. సామ్రాజ్యవాదులతో అంటకాగుతున్న అరబ్ ప్రపంచంలోని ప్రభుత్వాలకు వ్యతిరేక పోరాటమే. ఆ తర్వాత అమెరికా ఇజ్రాయిల్ కు వత్తాసు పలకుతోంది. 1948, 1967, 1973లో జరిగిన మూడు యుద్ధాల ఆసరాగా ఇజ్రాయిల్ జోర్డాన్ నదికి పశ్చిమం వేపున ఉన్న పలస్తీనా భూభాగాన్నంతటినీ ఆక్రమైంచింది. పలస్తీనా వారు తమ ప్రాంతాల్లోకి వెళ్లకుండా ఇజ్రాయిల్ అడ్డగిస్తోంది. వారిని బానిసలుగా చూస్తోంది. కిరాతకంగా వ్యవహరిస్తోంది.

నెహ్రూ విధానాలను అటకెక్కించిన నాయకులు ఇప్పుడు తమ అసలు రంగు బయట పెడ్తున్నారు. యూదుల ధురభిమానం కూడా జాతి వివక్ష లాంటిదేనని మనం గతంలో భావించే వాళ్లం. కాని 1991లో అమెరికా ఐక్య రాజ్య సమితిలో మన వాదనకు భిన్నమైన తీర్మానం ప్రతిపాదిస్తే 1991లో మన నాయకులు సమర్థించారు. గత పాతిక సంవత్సరాలుగా ఇజ్రాయిల్ తో మన సంబంధాలు ప్రధానంగా సైనిక సంబంధమైనవే. ఇజ్రాయిల్ నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశంలో ఆంతరంగిక భద్రతను పరిరక్షించడానికి కూడా ఇజ్రాయిల్ నుంచి సలహాలు తీసుకుంటున్నాం. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికీ, గూఢచార కార్యకలాపాలలోనూ ఇజ్రాయిల్ సలహాలు పాటిస్తున్నాం. ఇప్పుడు ఇజ్రాయిల్ నుంచి భారీగా ఆయుధాలు, యుద్ధ సామాగ్రి దిగుమతి చేసుకుంటున్నాం. కశ్మీర్ లో తీవ్రవాదులను ఎదుర్కోవడానికి ఇజ్రాయిల్ అనుసరిస్తున్న తీవ్రవాద వ్యతిరేక ఎత్తుగడలను, వ్యూహాలనే మనమూ అనుసరిస్తున్నాం. గూఢాచార సమచారం సేకరించడానికి కూడా పలస్తీనియన్ల విషయంలో ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొసాద్ బాటలోనే నడుస్తున్నాం.

ఇటీవల ఇజ్రాయిల్ ప్రధాని పర్యటన సందర్భంగా రక్షణ ఒప్పందాలు ఏమీ కుదరలేదు కాని ఆ దేశం నుంచి ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకోసం ప్రయత్నించాం. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రక్షణ శాఖకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేయాలని అడిగాం. మన దేశంలో డి.ఆర్.డి.ఓ.లో తయారవుతున్న శతఘ్నులను ధ్వంసం చేసే క్షిపణులకోసం వేచి చూడకుండా ఇజ్రాయిల్ నుంచి స్పైక్ క్షిపణులు దిగుమతి చేసుకోవడానికి తాపత్రయపడుతున్నాం. ఈ విషయంలో రెండు దేశాల మధ్య ఒప్పందం తొందరలోనే కుదరవచ్చు. మధ్య తరహా, నేల మీంచి నేల మీదకు ప్రయోగించే క్షిపణులను అభివృద్ధి చేయడానికి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న హిందుత్వ వాద నాయకులు ప్రయత్నిస్తున్నారు. గత సంవత్సరం ఇజ్రాయిల్ తో కలిసి వైమానిక విన్యాసాల్లో పాల్గొన్నాం. ఇప్పుడు హిందుత్వవాద నాయకులు తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో ఇజ్రాయిల్ ను అనుసరిస్తున్నారు.

హిందుత్వవాదులు ఇజ్రాయిల్ యుద్ధోన్మాద జాతీయవాదాన్ని చూసి మురిసిపోతుంటారు. అందుకే తీవ్రవాదవ్యతిరేక కార్యకలాపాల్లో సమగ్ర సహకారం కోసం వెంపర్లాడుతున్నారు. ఇజ్రాయిలీ యుద్ధోన్మాదులు పలస్తీనియన్ల విషయంలో ఎలా వ్యవహరించారో కశ్మీరీ తీవ్రవాదులకు సంబంధించి అలాగే ఉండాలనుకుంటున్నారా? యూదుమతానికి యుద్ధోన్మాద యూదుతత్వానికి తేడా ఉన్నట్టే హిందూ మతానికి హిందూ మతోన్మాదానికి తేడా ఉంది. హిందూ మతం మోక్షమార్గం కోసం అనుసరించే విశ్వాసాల సమాహారం. హిందుత్వం ఫాసిస్టు సిద్ధాంతం. అది నాజీయిజం లాంటిదే. యూదు యుద్ధోన్మాదం యూదు మతం కాదు. అది యూదు మతానికి విరుద్ధమైంది. అలాగే హిందుత్వ హిందూమతానికి విరుద్ధమైందే. యూదులు తమకు యుద్ధోన్మాద యూదులతో సంబంధం లేదని బహిరంగంగా ప్రకటించడం ఎంత అవసరమో హిందువులు కూడా తమకు హిందుత్వతో సంబంధం లేదని బాహాటంగా చెప్పవలసిన అగత్యం ఉంది. ఈ పోరాటంలో హిందువులు, యూదులు, ముస్లింలు అందరూ మానవతావాద దృష్టితో పలస్తీన ప్రజలకు, కశ్మీర్ ప్రజలకు బాసటగా నిలబడాలి. యూదుల వ్యతిరేకతను, ముస్లిం వ్యతిరేకతను విడనాడాలి. 

Back to Top