ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

కాశ్మీర్లో వంచనకు తెర

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

జమ్మూకాశ్మీర్ లో కాల్పుల విరమణకు, అసహజ సంకీర్ణానికి తెరదించి బిజెపి తన అధికసంఖ్యాక ఎజెండాకు రంగం సిద్దం చేసింది. కాశ్మీర్ కు సంబంధించి గత కొన్నాళ్లుగా వివిధ స్థాయుల్లో ప్రచారంలో ఉన్న రెండు కట్టుకధలకు ఇటీవలి రోజుల్లో తెరపడింది. అందులో ఒకటి పరస్పరం అనుమానాలతో కూడిన కాల్పుల విరమణ కాగా రెండవది భిన్నధృవాల వంటి పార్టీల మధ్య సాగిన పొత్తు. అయితే ఈ కృత్రిమ భావనలకు అతీతంగా మనకు కనిపించే  కఠోర వాస్తవం పవిత్ర రంజాన్ మాసం ముగుస్తుండగా ప్రముఖ పాత్రికేయుడు షుజాత్ బుఖారి దారుణ హత్య. అలాగే కాశ్మీర్ మానవహక్కుల అధ్వాన పరిస్థితి గురించి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఒకటి వెల్లడించిన నివేదికకు ఆధారాలకు కూడా కొదవలేదు. దీన్ని కొట్టిపారేయడానికి భారత ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా వాస్తవాలు మరుగున పడిపోవు.

నిజానికి కాశ్మీర్ లో కాల్పుల విరమణ అనే  పదాన్ని వాడడానికి కూడా ప్రభుత్వం ఇష్టపడలేదు. చట్టవిరుద్దమైన సంస్థలపై పోరాటానికి ఈ చట్టపరమైన పదాన్ని ఉపయోగించడం ఇష్టంలేక భారత ప్రభుత్వం “సైనిక చర్యల నిలిపివేత” అనే పదాన్ని నిరంతరం వాడుతూ వచ్చింది. అంటే బలప్రయోగ చర్యలను కొద్దికాలం నిలిపివేయడం అన్నమాట. జామ్మూ కాశ్మీర్ జనాభాలో అధిక సంఖ్యాకులైన ముస్లింలకు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైనప్పుడు ఈ తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించారు. కానీ ఈ ‘సుహృద్భావ పూర్వక’ చర్యను ప్రకటించడానికి ముందు భారత సైనిక దళాల ప్రధానాధికారి సైనికాధికారులు రాజకీయాలకు దూరంగా ఉండే సంప్రదాయాన్ని పక్కనపెట్టి స్వేచ్చగా తన సొంత అభిప్రాయాలను వెలిబుచ్చారు. “కాశ్మీరుకు  స్వాతంత్ర్యం అనేది అసంభవం” అనే విషయాన్ని అక్కడి యువతకు తెలిసివచ్చేటట్టు చేయడమే కాశ్మీర్లో  ప్రభుత్వం వ్యూహం లక్ష్యం అని జనరల్ బిపిన్ రావత్ కుండబద్దలుకొట్టారు. రాష్ట్రంలో హింస ప్రజ్వరిల్లుతోంది. మరింత మంది యువకులు తీవ్రవాదులుగా మారుతున్నారు, అయినా అలా పోరాటం చేసే వారందరికీ దానివల్ల ఉపయోగం లేదని సైన్యం తెలిసివచ్చేటట్టు చేస్తుంది అని రావత్ చెప్పారు.

ఈ నేపధ్యంలో మొదలైన కాల్పుల విరమణ ప్రశాంతతను సాధించింది లేదు. రెండు పక్షాల మధ్య అపనమ్మకం, ద్వేషం ఎక్కడా ఉపశమించలేదు. షోపియన్ జిల్లాలో మోహరించిన సైనిక దళం ఇచ్చిన ఇఫ్తార్ విందును స్థానికులు బహిష్కరించారు. ఆ తరువాత శ్రీనగర్ లో నిరసనకారులు శుక్రవారం ప్రార్ధనల తరువాత ఓక సి ఆర్ పి ఎఫ్ దళాన్ని చుట్టుముట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి, భయాందోళనలకు గురైన ఒక డ్రైవరు జనంలోకి దూసుకు పోయినప్పుడు ఒకరు చనిపోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

ఆ మర్నాడు అంత్యక్రియల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో నిరసన జ్వాలలు ప్రజ్వరిల్లగా ఆ సంఘటనల ఫోటోలను ప్రచురించినందుకు రైజింగ్ కాశ్మీర్ సంపాదకుడు షుజాత్ బుఖారి పై సామాజిక మాధ్యమాల్లో విద్వేషం వెల్లువెత్తింది. సామాజిక మాధ్యమం ట్విట్టర్ పరిభాషలో ఆయన తనపై దుమ్మెత్తి పోస్తున్న వారికి జవాబిస్తూ ‘సి ఆర్ పిఎఫ్ చర్యను సమర్ధించే పూర్తి హక్కు వారికి ఉందని”, ఎందుకంటే కాశ్మీర్ ను కేవలం “ఒక స్థిరాస్తి”గా మాత్రమే పరిగణించే ఆలోచనాధోరణికి అది సరిపోతుందని అన్నారు. అంతేకాక, తనపై విరుచుకుపడుతున్న వారిలో నిజంగా ఈ సమస్యను గురించి లోతుగా ఆలోచించే వారుగనుక ఉంటే “కాశ్మీర్ యువతలో చావు భయం కనిపించకపోవడం” గురించి ఆలోచించాలని ఆయన సూచించారు. బుఖారి స్వరంలో ధిక్కారంతో పాటు ఉదారవాద సూచన సమ్మిళితమై ఉంది. గత అనేక సంవత్సరాలుగా ఆయన అనుసరిస్తున్న సంపాదకీయ ధోరణి,  భారత్ లోను, బయటా చర్చల్లో ఆయన అనుసరిస్తున్న విధానం ఇదే.  కాశ్మీర్లో భారత్ అనుసరిస్తున్న విధానంలో అంతకంతకు ద్వేషం, శత్రుభావం ప్రస్ఫుటమవుతున్నా ఇటీవల కొద్దినెలలుగా, ముఖ్యంగా 2016 జులైలో హింస ప్రజ్వరిల్లిన తరువాత, ఆయన సత్వరం చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని పదేపదే నొక్కి చెబుతూ వచ్చారు.

జూన్ 14న ఇఫ్తార్ సమయంలో ఆయన తన కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా దుండగులు ఆయనను, ఆయన ఇద్దరు భద్రతా సిబ్బందిని అతిదగ్గర నుంచి కాల్చి చంపారు. ఉదారవాద గళాలను శాశ్వతంగా మూగబోయేటట్టు చేసే ప్రయత్నాలకు ఇది పరాకాష్ఠ. ఆయన హత్యపై దర్యాప్తు చేయాలని గట్టిగా కోరేవారు లేకపోవడాన్ని బట్టే హత్య వెనుక ఉన్న వారు ఎంతమేరకు  విజయవంతమయ్యిందీ అర్ధమవుతుంది. కాశ్మీర్ లో ఇప్పుడు నెలకొని ఉన్న అరాచక వాతావరణంలో అటువంటి డిమాండ్లు చేయడమంటే కష్టాల్ని కొనితెచ్చుకోవడమే.

కాశ్మీర్ పై తీవ్రమైన అభిప్రాయాలకు, వైఖరులకు మాత్రమె మీడియా వీలుకల్పిస్తున్న ప్రస్తుత వాతావరణంలో బుఖారి హత్య చర్చలకు, సంప్రదింపులకు తావులేదన్న నిర్దిష్ట సంకేతాన్ని ఇచ్చినట్టయ్యింది. రంజాన్ కాల్పుల విరమణ పేరిట అయిష్టంగానయినా ఇచ్చిన కొన్ని రాయితీలు,  సడలింపులకు స్వస్తి చెప్ప నిఘావిభాగం మాజీ అధిపతి, ప్రస్తుతం ప్రధాన మంత్రి జాతీయ భద్రతా సలహాదారు అయిన అజిత్ దోవాల్ పేరిట ‘దోవాల్ సిద్దాంతం’ గా చెలామణీ అవుతున్న కఠినవైఖరిని తిరిగి ప్రభుత్వం అనుసరించడం మొదలుపెట్టింది. దోవాల్ సిద్ధాంతం అంటే నిరంతరం, తీవ్ర స్థాయిలో బలప్రయోగాన్ని కొనసాగించడం. భారత ప్రభుత్వం ఏకపక్షంగా కాల్పుల విరమణను రద్దు చేసుకోవడం ద్వారా సర్దుబాట్లు, సడలింపులపట్ల తన ఏవగింపును బయటపెట్టుకుంది. ఈ నిర్ణయానికి జమ్మూ కాశ్మీర్ సంకీర్ణ ప్రభుత్వం నుంచి తనకు మద్దతు లభించదు కనుక బిజెపి ఆ వెంటనే పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీతో తన  అసహజ సంకీర్ణం నుంచి ఉపసంహరించుకుని, రాష్ట్రంలో గవర్నర్ పాలన ప్రకటించింది. జమ్మూలో మెజారిటి సాధించి కాశ్మీర్ లో చాలా చోట్ల డిపాజిట్లు కోల్పోయిన బిజెపి, సంకేర్ణ ప్రభుత్వంలో ఉన్నంత కాలం కూడా తన ఇష్టప్రకారమే పాలన నడిపింది. ఈ సంకీర్ణం వల్ల పార్టీకి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఇతర ప్రాంతాలలో దీనివల్ల ఆ పార్టీకి పెద్దగా ప్రయోజనం ఒనగూడే అవకాశాలు కనిపించలేదు.

భారత్ లో జాతీయ స్థాయి చర్చలో కాశ్మీర్ ప్రజలకు  ఒక గుర్తింపు లేదని, కాశ్మీర్ ను కేవలం ఒక స్థిరాస్తి (రియల్ ఎస్టేట్ ) గా మాత్రమే పరిగణిస్తున్నారని షుజాత్ బుఖారి తరచుగా వాపోయేవారు. ప్రజలు కేవలం సంఖ్య ద్వారా కొలిచే ఒక సమూహంగా కాక “సమష్టి సంకల్పం” ద్వారా ఒక విశిష్ట సమూహంగా గుర్తింపు పొందుతారన్న రూసో మాటలనే ప్రమాణంగా తీసుకుంటే భారత్ లోని జాతీయవాద శక్తులు  కాశ్మీర్ ను ఆ విధంగా పరిగణించడంలేదని, దాన్ని కేవలం ఆధీనంలో ఉంచుకోవాల్సిన స్థిరాస్తి గా మాత్రమే చూస్తున్నారని స్పష్టమవుతుంది. ఇప్పుడు బిజెపి యావ అంతా రానున్న సార్వత్రిక ఎన్నికల మీదే ఉండటంతో అది ‘సమష్టి సంకల్పాన్ని’ పక్కన పెట్టి తనను విజయతీరాలకు చేర్చే ‘పాక్షిక సంకల్పం’ మీదే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తుందని అర్ధమవుతోంది. కాశ్మీరీయతను పక్కన పెట్టడం ద్వారా మాత్రమే అధిక సంఖ్యాక వర్గాన్ని తనతో తీసుకుపోయే ‘పాక్షిక సంకల్పాన్ని’ బిజెపి సాధించగలదు.

అధికసంఖ్యాక వాదం దూకుడుగా వెళుతున్న ప్రస్తుత అంతర్జాతీయ వాతావరణంలో కాశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన గురించి ఐక్య రాజ్యసమితి మానవ హక్కుల కమిషనర్ కార్యాలయం రూపొందించిన నివేదికను భారత ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోపోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం దారుణంగా క్షీణించిందనడానికి ఇది ఒక ప్రమాదకరమైన సూచిక. ముఖ్యంగా కాశ్మీర్ ప్రజలు మున్ముందు ఎదుర్కోబోయే మరింత గడ్డురోజులను ఇది సూచిస్తుంది.

Back to Top