ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

కుట్రల బూచి చూపి పెద్ద కుట్ర

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

భీమా కోరేగావ్ కేసులో అయిదు నెలలు కాలయాపన చేసిన తర్వాత పుణే పోలీసులు జూన్ ఆరవ తేదీన ముంబై, నాగపూర్, దిల్లీలో అనేక మందిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన అయిదుగురు నిందితులైన సుధీర్ ధవాలే, సురేంద్ర గాడ్లింగ్, షోమా సేన్, మహేష్ రౌత్, రోమా విల్సన్ మానవ హక్కుల కోసం పోరాడే వారే. ఎల్గార్ పరిషత్ తో సంబంధం ఉందన్న కారణంగా వీరిని అరెస్టు చేశారు. భీమా కోరేగావ్ లో ద్విశత వార్షికోత్సవాల సందర్భంగా ఎడ్గార్ పరిషత్ హింసను రెచ్చగొట్టిందని పోలీసులు వాదిస్తున్నారు. "పట్టణ ప్రాంతాలలో పని చేసే ఈ మావోయిస్టులు" ప్రధానమంత్రి మోదీని హతమార్చడానికి కుట్ర పన్నారని కూడా పోలీసులు వాదిస్తున్నారు. వీరిని అరెస్టు చేయడానికి ఎంచుకున్న సమయం, నలు దిశల నుంచి అరెస్టు చేయడంలో భారతీయ జనతా పార్టీ ఎత్తుగడ ఒక దెబ్బతో అనేక పిట్టలను కొట్టడానికి ప్రయత్నించినట్టు స్పష్టం అవుతోంది.

మహారాష్ట్రలోనూ, కేంద్రంలోనూ ఎన్.డి.ఎ. పరిస్థితి దిగజారుతున్న తరుణంలో ఈ పెద్ద నాటకానికి తెర తీశారు. సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ఏడాది వ్యవధి కూడా లేదు. ఈ నేపథ్యంలో భీమా కోరేగావ్ లో హింసాకాండ చెలరేగడంతో మహారాష్ట్రలో దళితులు ఆగ్రహావేశపరులై ఉద్యమించారు. 2005 నాటి షెడ్యూల్డ్ తరగతులు, షెడ్యూల్డ్ కులాల వారి మీద అఘాయిత్యాల నివారణ బిల్లు "దుర్వినియోగం" కాకుండా నివారించడానికి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో దళితులు బీజేపీకి దూరం కావడం పూర్తి అయింది.

పౌర హక్కుల కోసం పాటు పడే వారు, ప్రత్యర్థి రాజకీయ నాయకులు, ప్రభుత్వానికి వ్యతిరేకిస్తున్న దళిత కార్యకర్తలపై బీజేపీ తాజాగా ప్రయోగించిన అస్త్రమే ఈ అరెస్టులు. ముందు వామపక్ష విద్యార్థి సంఘాలను అపఖ్యాతి పాలు చేసిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు సభ్య సమాజంలో వామపక్ష భావజాలం గల వారిపై గురిపెట్టింది. ఈ అరెస్టులకు భీమా కోరేగావ్ సంఘటనకు ఏ మాత్రం సంబంధం లేదు అని చెప్పడానికి ప్రభుత్వం అరెస్టు చేసిన అయిదుగురిలో ఒకరికి ఆ విషయంతో ఏ మాత్రమ సంబంధం లేకపోవడమే నిదర్శనం. ఈ సందర్భంగా ఒక లేఖ దొరికిందని, అందులో ప్రధానమంత్రిని హత్య చేయడానికి సంబంధించిన అంశాలు ఉన్నాయని వాదించడం గర్హనీయమైందే. ప్రతిపక్షాలు అన్నీ ఏకం కావడం వల్ల బీజేపీ ఇరకాటంలో పడింది కనక ప్రతిపక్షాలను కూడా ఈ ఉచ్చులోకి లాగారు. అనారోగ్యం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న కేంద్ర ఆరోగ్య మంత్రి ఏకంగా "అర్థ మావోయిస్టులు" అన్న కొత్త పదమే కనిపెట్టారు. వీరు అజ్ఞాతంగా పని చేస్తున్న మావోయిస్టులకు బాహిర రూపం అని ఆయన అంటున్నారు. వీరు పౌర కార్యకర్తలమని చెప్పుకుని తిరుగుతుంటారు అని జైట్లీ అంటున్నారు. వీరు పైకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూనే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పని చేస్తారని ఆయన వాదిస్తున్నారు. 1967 నాటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద వీరిని అరెస్టు చేసి అంబేద్కర్ వాదులైన మేధావులను, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నవారిని భయభ్రాంతులను చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోంది.

బీజేపీ అనుసరిస్తున్న ఈ వ్యూహం కొత్తదేమీ కాదు. 2006లో మహారాష్ట్రలోని ఖైర్లంజిలో ఓ దళిత కుటుంబాన్ని మట్టుబెట్టినప్పటి నుంచే అసమ్మతి తెలియజేసే దళితులను మావోయిస్టులుగా ముద్ర వేయడం ప్రారంభమైంది. దళితుల ప్రతిఘటనను చట్ట సమ్మతం కాదని ముద్రవేసే క్రమంలో ఇది భాగమే. అన్యాయం జరిగినప్పుడు రాజ్యంగబద్ధంగా ప్రతిఘటించడాన్ని అడ్డుకోవడమే. సుప్రీం కోర్టు ఎస్.సి., ఎస్.టి.లపై అత్యాచార నిరోధక బిల్లును దుర్వినియోగం చేయకుండా అడ్డుకునే పేర ఇచ్చిన తీర్పును బట్టి చూసినా దళితులకు న్యాయబద్ధంగా ఊరట లభించే అవకాశం లేదని అర్థం అవుతోంది. ప్రజా నిరసనకు అవకాశం లేకుండా చేస్తున్నారు. దీని వల్ల దళితులు జాతి వ్యతిరేకులు అని చిత్రించడంతో పాటు అసలు దేశాన్నే దళితుల వ్యతిరేకంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది.

బీజేపీ పాలనను వామపక్ష ప్రగతిశీల శక్తులు "నయా పేశ్వా పాలన" అన్నారు. భీమా కోరేగావ్ సంఘటన సమాజంలోని అట్టడుగు వర్గాల వారు హిందుత్వ శక్తులకు వ్యతిరేకంగా ఐక్యం కావడానికి ఉపకరించింది. మహారాష్ట్రలో కుల వివక్ష వ్యతిరేక ఉద్యమాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. అక్కడ ప్రత్యామ్నాయ సంస్కృతిని ప్రోది చేసే ప్రయత్నం జరిగింది. ఇది సంఘ్ పరివార్ కు కంటగింపైంది. దీని ప్రభావం దేశంలోని ఇతర ప్రాంతాలపై కూడా ఉంది. భీమా కోరేగావ్ ఉద్యమంవల్ల ఎగిసిన ఆగ్రహజ్వాలలను చల్లార్చే ప్రయత్నంలో నిజానికి బీజేపీ అంబేద్కర్ వాదులను మరింత పటిష్ఠం చేసింది. ఈ వర్గాలు ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దళితుల మీద జరిగిన హింసాకాండను కప్పి పుచ్చే ప్రయత్నంలో అందులో హిందుత్వ వాదుల పాత్రను కనుమరుగు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. భీమా కోరేగావ్ హింసాకాండను ప్రేరేపించిన సంభాజి భీడే, మిలింద్ ఎక్బోటేకు వ్యతిరేకంగా ముంబై, కొల్హాపూర్ లో అనుకూల, వ్యతిరేక ప్రదర్శనలు గత రెండు నెలల కాలంలో చాలా జరిగాయి. భీమా కోరేగావ్ ఆందోళనను తీవ్రవాద ఉద్యమం అని, దేశ వ్యతిరేక ఉద్యమం అని చిత్రించే క్రమంలో బీజేపీ పనిగట్టుకుని అంతర్గత కలహాలను ప్రేరేపిస్తోంది.

మోదీని హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని ప్రధానమైన మీడియా ఎంతగా ప్రచారం చేసినప్పటికీ బీజేపీపై ఊహించినంత సానుభూతి వ్యక్తం కానే లేదు. ఈ ఉద్యమంలో మావోయిస్టుల పాత్ర గురించి ఎంత ప్రచారం జరిగినప్పటికీ శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లాంటివి కూడా ఈ అయిదుగురి అరెస్టును తీవ్రంగా నిరసించాయి. నిజానికి ఇలాంటి ఎత్తులు ఎత్తినప్పుడల్ల మోదీ ఇరకాటంలో పడుతున్నారు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచీ ఇదే వరస. ఒక వేపున కుట్రలు జరుగుతున్నాయని వాదించి తామే కుట్రలకు పాల్పడడం, మరో వేపు ప్రధానమంత్రి వ్యాయామ విన్యాసాలను ప్రచారంలో పెట్టడం చూస్తే ఆయన పార్టీ ఎంతగా నిర్వేదానికి గురవుతోందో అర్థం అవుతోంది. దీనివల్ల బీజేపీ ఒక వ్యక్తి మీద ఆధారపడిన పార్టీగా దిగజారిపోతోంది. ఆయన భౌతికంగా పటిష్ఠంగా ఉంటే పార్టీ కూడా పటిష్ఠంగా ఉంటుందన్న అభిప్రాయం కలగజేస్తున్నారు.

Back to Top