ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

వనరులు లేకుండా మోసాలపై దర్యాప్తు!

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

గత పదిహేనేళ్లుగా మరీ ముఖ్యంగా 2013 నుంచి మోసాల దర్యాప్తు సంస్థ (ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్) కార్పొరేట్ సంస్థల మోసాలపై దర్యాప్తు చేసే సంస్థగా పని చేస్తోంది. ఈ సంస్థ అనేక ప్రసిద్ధ కేసులపై దర్యాప్తు చేసింది. అలాంటప్పుడు కార్పొరేట్ సంస్థల మోసాలను బహిర్గతం చేసే ఈ సంస్థకు సరైన సిబ్బంది లేకుండా పని చేసే పరిస్థితి ఎందుకు కల్పించారు? మరి ఆ సంస్థ తన సామర్థ్యాన్ని ఎలా నిరూపించుకోగలుగుతుంది?

ప్రభుత్వ వ్యవస్థలలో సిబ్బంది కొరత కొత్తేమీ కాదు. కాని మోసాల దర్యాప్తు సంస్థ బాధ్యతలు దానికి 2013 నాటి కంపెనీల వ్యవహారాల చట్టం కింద చట్టబద్ధత కల్పించినప్పటి నుంచి బాగా పెరిగాయి. ఏప్రిల్ 2014 నుంచి 2018 జనవరి వరకు ఈ సంస్థకు 447 కంపెనీ వ్యవహారాలపై దర్యాప్తు చేసే బాధ్యత అప్పగించారు. మొత్తం 667 దర్యాప్తుల్లో ఈ సంస్థే 67% దర్యాప్తులు చేపట్టింది. ఈ సంస్థ 2003 నుంచి పని చేస్తోంది. 2014-15 నుంచి ఈ సంస్థ సిబ్బంది సంఖ్య మాత్రమ 133కే పరిమితమైంది. 69 ఖాళీలు ఉన్నాయి.

మోసాల దర్యాప్తు సంస్థ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధీనంలో పని చేస్తుంది. ఇది భిన్న రకాల దర్యాప్తులు కోనసాగిస్తుంది. ఫారెన్సిక్ ఆడిటింగ్, కార్పొరేట్ చట్టాలు, సమాచార సాంకేతికత, పెట్టుబడి మార్కెట్లు, పన్నులు, ఇతర అనుబంధ రంగాలలో జరిగే ఘరానా మోసాలపై జరిగే దర్యాప్తులకు ఈ సంస్థ మార్గదర్శకత్వం వహిస్తుంది. అటల్ బిహారీ వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2003 జులై రెండవ తేదీన ఈ సంస్థను ఏర్పాటు చేశారు. కార్పొరేట్ ఆడిట్, పరిపాలనపై అధ్యయనం చేసిన నరేశ్ చంద్ర కమిటీ సిఫార్సు మేరకు దీనిని ఏర్పాటు చేశారు. మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యు.పి.ఎ. ప్రభుత్వ హయాంలో కంపెనీల చట్టం ప్రకారం ఈ సంస్థకు చట్టబద్ధ అధికారాలు ఇచ్చినా కాని ఈ సంస్థకు ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారాలు మాత్రం 2017 ఆగస్టులోనే దక్కాయి. ఈ సంస్థను ఏర్పాటు చేసినప్పటి నుంచే ఇది నైపుణ్యం అవసరమైన సంస్థగా భావించారు. ఇందులో నియామకాలు చాలా వరకు ఇతర విభాగాల నుంచి డిప్యుటేషన్ మీద పంపే వారేనన్న అవగాహన కూడా ఉంది. సివిల్ సర్వీసులో అనుభవజ్ఞులైన వారిని, నైపుణ్యం ఉన్న వారిని సలహాదారులుగా నియమించాలనుకున్నారు.

ఏ మేరకు నిధుల గోల్మాల్ జరిగింది, ఏ కేసులో ప్రజల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అన్న అంశాల ఆధారంగా మోసాల దర్యాప్తు సంస్థకు దర్యాప్తు బాధ్యతలు అప్పగిస్తారు. ఇటీవలి కాలంలో నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించిన వ్యవాహారంపై కూడా ఈ సంస్థే దర్యాప్తు చేస్తోంది. గత పదిహేనేళ్లుగా ఈ సంస్థ ఇలాంటి ప్రధానమైన కేసులెన్నింటినో దర్యాప్తు చేసింది. 2జి కుంభ కోణంతో సంబంధం ఉన్న సంస్థలపై, కింగ్ ఫిషర్ ఏర్ లైన్స్ కేసు, శారద చిట్ ఫండ్ కేసు, సత్యం కంప్యూటర్స్ కేసును కూదా దర్యాప్తు చేసింది. ఈ మోసాలలో ఆడిటర్ల బాధ్యత కూడా తక్కువేమీ కాదని తేలింది. ఆడిటర్లు సదరు కంపెనీలతో కుమ్మక్కవుతుంటారు. దేశంలోని పెద్ద 500 కంపెనీల్లో మూడో వంతు కంపెనీలు ఇలాగే తమ ఖాతా పుస్తకాలను "మాయ" చేస్తుంటాయని ఈ సంస్థ తేల్చింది. అత్యున్నత స్థానంలో ఉన్న 100 కంపెనీలు చేసే పని కూడా ఇదే. అకౌంటెంట్ల తప్పుడు నడవడికపై దర్యాప్తు చేయాలని చార్టెడ్ అకౌంటెంట్ల సంస్థను కోరింది కూడా. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. అమెరికాలోనూ, ఇంకా అనేక దేశాలలోనూ చాలా కంపెనీలు అకౌంటెంట్లు కుమ్మక్కు అయినందువల్లే ఎదిగాయి. 2007-08 ఆర్థిక సంక్షోభంలో కుప్ప కూలిన కంపెనీలు ఇవే. అనేక కంపెనీల ఆడిట్ నివేదికలు ఎందుకూ కొరగానివని తేలింది.

మోసాల దర్యాప్తు సంస్థ సమర్థంగా, స్వతంత్రంగా పని చేయగలిగితే కార్పొరేట్ సంస్థల దురాశను, కుమ్మక్కయ్యే ఆడిటర్లను అదుపు చేసి చట్టం అమలయ్యేట్టు చేయడం సాధ్యం అవుతుంది. అదే సమయంలో కంపెనీలలో పెట్టుబడి పెట్టే వారి ప్రయోజనాలను కూడా పరిరక్షించవచ్చు. ఈ సంస్థకు లోతైన దర్యాప్తు చేయగలిగిన సామర్థ్యం ఉన్న సిబ్బంది అవసరం. ఇలాంటి పనిలో నైపుణ్యం, అనుభవం ఉన్న వారు లేనందువల్లే మోసాల దర్యాప్తు సంస్థలో ఖాళీలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ సంస్థ దర్యాప్తు చేయవలసిన కేసులు పెరుగుతున్నాయి కనక కేవలం డెప్యుటేషన్ మీదే సిబ్బందిని నియమించే విధానంపై పునరాలోచించాలి. పూర్తికాలం పని చేసే, సుశిక్షుతులైన సిబ్బందిని నియమించాలి. ప్రైవేటు రంగానికి చెందిన వారిని నియమిస్తే దాంట్లో ఉన్న ఇబ్బందులు దానికి ఉంటాయి. ప్రైవేటు రంగంలో ఎక్కువ జీతాలు ఉంటాయి. ప్రయోజనాల విషయంలో ఘర్షణ ఉంటుంది. తమను నియమించిన ప్రైవేటు కంపెనీల మీద విశ్వాసం కొనసాగుతూ ఉంటుంది. పరిపాలనా సంస్కరణలపై వీరప్ప మొయిలీ కమిటీ 2017లో సమర్పించిన 33వ నివేదికలోనూ, 2018 మార్చి లో సమర్పించిన 59వ నివేదికలోనూ డెప్యుటేషన్ మీద నియమించే సిబ్బంది కాకుండా శాశ్వత ప్రాతిపదికన నియమించే సిబ్బంది అవసరం ఉందని గుర్తించారు. సిబ్బంది కొరత ఈ సంస్థకే పరిమితమైంది కాదు. సీబీఐలోనూ సిబ్బంది కొరత ఉంది. అందుకే కీలకమైన కేసుల్లో దర్యాప్తు కుంటి నడక నడుస్తోంది.

Back to Top