ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

అణచివేతతో కశ్మీర్ చల్లారదు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

అనురాధా భాసిన్ జంవాల్

 

రంజాన్ సందర్భంగా కశ్మీర్ లో కాల్పుల విరమణ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రాధేయపడడానికి కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మే 9వ తేదీన ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం ఆశ కన్నా అనుమానాలే ఎక్కువగా మిగిల్చింది. ఒక వేళ కాల్పుల విరమణ ప్రకటిస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పడమూ కష్టమే. ఎందుకంటే కశ్మీరీ యువకులు సాయుధులై అనునిత్యం వీధి పోరాటాలు చేస్తున్నారు. ప్రభుత్వం కొనసాగిస్తున్న దమనకాండ వల్ల ఆ రాష్ట్ర ప్రజలు "పరాయీకరణ"కు గురయ్యారని "ఆగ్రహావేశపరులు" అయ్యారని మొన్నటి దాకా అనుకున్నాం. కాని ఇప్పుడు కశ్మీర్ యువతలో తిరుగుబాటు ధోరణి కనిపిస్తోంది. తూటాలకు వారు ఎంత మాత్రం భయపడడం లేదు. నిరసన తెలియజేసే వారిలో అలసట కూడా కనిపించడం లేదు. గుడ్డి నమ్మకం కారణంగానో, భద్రతా దళాలవారిని అలిసిపోయేట్టు చేయాలనో, తాము ఎదుర్కుంటున్న అవమానాలకు ప్రతీకారంగా దేశాన్ని రక్త సిక్తం చేయాలనో - కారణం ఏదైనా కశ్మీరీ యువత చావో రేవో తేల్చుకోవలన్న ధోరణిలో వ్యవహరిస్తోంది. కశ్మీరీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మీద ఏ మాత్రం విశ్వాసం లేనందువల్ల శాంతియుత ప్రతిఘటనకు అవకాశమే కనిపించడం లేదు. కశ్మీర్ విశ్వవిద్యాలయం అధ్యాపకుడు ఒకరు విద్యార్థులకు శాంతియుతంగా ప్రతిఘటించాలని ప్రబోధించారు. ఉదారవాద భావాలు వ్యాప్తి చేయాలని అనుకున్నారు. కాని భద్రతా దళాల వారి కాల్పుల్లో ఆ అధ్యాపకుడూ బలై పోవడంతో శాంతియుత ప్రతిఘటనకు అవకాశం లేకుండా పోయింది.

కశ్మీర్ లోని ప్రతిపక్షాలన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తివల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. హింసను అంతమొందించడానికి చర్చలు ప్రారంభించాలని మెహబూబా ముఫ్తీ చేసిన విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం ఖాతరు చేయలేదు. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అంతకు ముందున్న ప్రభుత్వానికన్నా ఎక్కువ యుద్ధోన్మాద ధోరణిలోనే వ్యవహరిస్తోంది. ముందున్న ప్రభుత్వం ఒక వేపు ఒక వేపు పశుబలం ఉపయోగిస్తూనే మరో వైపు ప్రజాస్వామ్య పాఠాలైనా వల్లించేది. ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పే ప్రయత్నం చేస్తున్నట్టు కనీసం నటించేది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్ఫూర్తితో పని చేసే బీజేపీ ప్రభుత్వంలో కనీసం ఈ నటన అయినా కనిపించడం లేదు. ప్రస్తుత ప్రభుత్వం కశ్మీర్ ను పశు బలంతో అణచివేయాలని ప్రయత్నించడంతో పాటు దేశంలో ప్రజాస్వామ్యం పీచమణచాలని ప్రయత్నిస్తోంది. కశ్మీర్ జనాభా స్వరూపాన్ని మార్చాలని సంఘ్ పరివార్ ఎప్పటి నుంచో ఆలోచిస్తోంది. అందుకే ముస్లింలను అణచి వేస్తోంది. తన చిరకాల కాంక్ష అయిన "హిందూ రాష్ట్ర" ను ఏర్పాటు చేసే దిశగా ప్రయాణిస్తోంది. ఈ లక్ష్య సాధనకు కశ్మీర్ లో అల్లకల్లోల పరిస్థితి, హింసాకాండ, అస్థిరత కొనసాగడం సంఘ్ పరివార్ కు అవసరం.

కశ్మీర్ ప్రజల ప్రాణాలు అసంఖ్యాకంగా గాలిలో కలిసిపోవడం మాట అలా ఉంచినా భారీ సంఖ్యలో నేలకు ఒరుగుతున్న భద్రతా దళాల వారి గురించి అయినా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సింది. కాని అదీ లేదు. 2018లో 40 మంది మిలిటెంట్లను హతమారిస్తే భద్రతాదళాల వారు 24 మంది ప్రాణ త్యాగం చేయాల్సి వచ్చింది. అంటే ఇద్దరు మిలిటెంట్లను హతమార్చడానికి ఒకరి కన్నా ఎక్కువ మంది భద్రతాదళాల వారు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సైనిక చర్య ప్రశ్నార్థకం అవుతోంది. దీనికి తోడు రాళ్లు రువ్వే సంఘటనలు, ఇతర హింసాత్మక కార్య కలాపాలలో 37 మంది పౌరులూ బలయ్యారు. వీరిలో కశ్మీర్ కు పర్యటనకోసం వచ్చిన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. వందలాది మందికి తుపాకి గుళ్లు తగిలి క్షతగాత్రులయ్యారు. ఇంత అపారమైన జన నష్టం కలిగినా మిలిటెంట్ల కార్యకలాపాలు ఏ మాత్రం తగ్గడం లేదు. గాయపడిన కశ్మీరీల మనసులను ఈ హింసాకాండ మరింత విధ్వంసానికి పాల్పడేలా చేస్తోంది. అనేక మంది మిలిటెంట్లుగా తయారయ్యారు.

ఈ నేపథ్యంలో కశ్మీర్ నుంచి అఖిలపక్ష ప్రతినిధివర్గం దిల్లీ వెళ్లినా కేంద్ర ప్రభుత్వ వైఖరి మారక పోవచ్చు. అందువల్ల ఘర్షణ వాతావరణాన్ని చల్లబరచడానికి ముఖ్యమంత్రి మెహబూబాకు ఉన్న అవకాశాలు స్వల్పమే కాదు దాదాపు పూజ్యం. అయితే రాళ్లు విసిరే వారిపై ఉక్కుపాదం మోపకుండా ఉండే అవకాశం మాత్రం ముఖ్యమంత్రికి ఉంది. దాని వల్లా పరిస్థితిలో గుణాత్మకమైన మార్పు ఉంటుందని ఆశించలేం. అరెస్టులు, ప్రాథమిక దర్యాప్తు నివేదికలు అమలు కావడం, నిరంతర వేధింపుల వల్ల రాళ్లు విసిరే వారు తుపాకులు చేతబూనే దశకు చేరుతున్నారు. పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (పి.డి.పి.) ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ వేర్పాటువాది అయిన మసరాత్ ఆలం ను విడుదల చేశారు. కాని కేంద్రం ఒత్తిదివల్ల మళ్లీ అరెస్టు చేయవలసి వచ్చింది. అంటే దమనకాండకు, అణచివేతకు కేంద్ర ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత ఇస్తోందో అర్థం అవుతోంది.

కశ్మీర్ మీద కేంద్ర ప్రభుత్వ పెత్తనం సాంప్రదాయికంగా ఎక్కువే. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి పరిస్థితిని చక్క దిద్దే అవకాశం తక్కువ. ప్రస్తుతం పి.డి.పి. సామరస్య సాధనం కోసం ఎంత చిన్న ప్రయత్నం చేసినా కేంద్రం దాన్ని సాగనివ్వదు. బీజేపీ ఎంత ప్రతిఘటించినా కథువా అత్యాచార కేసులో మెహబూబా ముఫ్తీ కఠిన చర్య తీసుకోవడం లాంటివి మినహాయింపులే. బీజేపీ అంతిమ లక్ష్యం కశ్మీర్ లో ప్రజలను మతాల వారిగా చీల్చడం. అందువల్ల కథువా ఉదంతంలో న్యాయ ప్రక్రియకు అంతగా అడ్డు తగల లేదు.

కశ్మీర్ లో సంప్రదింపుల కోసం పి.డి.పి. చేసే ప్రయత్నాలు విఫలం కాక తప్పదు. అయినా విధ్వంసానికి దిగుతున్న యువతను ఆకట్టుకోవడానికి ఆ ప్రయత్నాలు ఎంతో కొంత ఉపకరించవచ్చు. ఏదో సంఘటన జరిగినప్పుడల్లా పాఠశాలలు, కళాశాలలు మూసేయడానికి బదులు వాటిలో భావ వ్యక్తీకరణకు అవకాశం కల్పించాలి. ప్రతిఘటనను ప్రభుత్వం ఆపడం అసాధ్యం. నవతరం మనసుల్లో ప్రతిఘటన అన్న భావన పాతుకుపోయింది. ప్రభుత్వం చేయగలిగిందల్లా శమంతియుత ప్రతిఘటనకు అవకాశం కల్పించి తద్వారా శాంతి చర్చలకు తగిన వాతావరణం ఏర్పాటు చేయడమే.

 

Back to Top