మార్క్సిజాన్ని విస్మరిస్తే మానవాళికే ముప్పు
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
కనికరం లేకుండా విమర్శించడం మార్క్స్ లక్షణం. పెట్టుబడి, పెట్టుబడిదారీ విధానాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించడానికి ఆయన కనికరం లేకుండానే వ్యవహరించారు. ఆయన ప్రపంచంలోని అత్యున్నత, ప్రభావవంతమైన మేధావి. ఆయన తన భావాలను, అభిప్రాయాలను కూడా అంతే నిర్దయగా పరిశీలించేవారు. తాను రాసిన దాంట్లో తప్పేమిటి, ఒప్పేమిటి అని నిశింతంగా పరిశీలించేవాడు. ఉదాహరణకు ఆయన బ్రిటిష్ వాలసవాదుల నుంచి అందిన సమాచారం ఆధారంగా 1853లో అది "అచేతనమైన చరిత్ర ఉపకరణం" అని భావించి బ్రిటిష్ వలసవాదం భారత పరిణామక్రమానికి దోహదం చేస్తుందని భావించారు. కాని ఆ తర్వాత 1881లో తగిన సమాచారం అందుబాటులోకి వచ్చినప్పుడు "బ్రిటిష్ వారు భారత్ ను పీల్చి పిప్పి చేసి తాము ఇచ్చే దానికన్నా వాళ్లు దోచుకు వెళ్తున్నది అపారం" అని భావించారు. సముచిత సమాచారం ఎప్పుడందినా మార్క్స్ పరిగణనలోకి తీసుకునే వారు. అదీ గాక ఆయన భావనలు, నిర్వచనాలు అంతిమ సత్యాలని ఎన్నడూ అనుకోలేదు. చారిత్రక పరిస్థితులకు అనుగుణంగా అవి మారవచ్చునని నమ్మారు.
మార్క్స్ మొదట ఒక కాల్పనిక భావవాదిగానే ఫ్రెడరిక్ హెగెల్ ను, లుడ్విగ్ ఫ్యూర్బాహ్ ను విశ్లేషించారు. ఇతర తత్వవేత్తల విషయంలో కూడా ఇలాగే వ్యవహరించారు. తన చుట్టూ జీవితంలో కనిపించే వాస్తవికతను గుర్తించిన కొద్దీ తనదైన గతితార్కిక భౌతిక వాదాన్ని, చారిత్రక భౌతికవాదాన్ని రూపొందించారు. అప్పటి నుంచి ఆయన ధోరణిలో విపరీతమైన మార్పు కనిపించదు. కాని మొదట ఉన్న మార్క్స్ కు తర్వాత పరిణతి చెందిన మార్క్స్ కు మధ్య పెద్ద తేడా లేదు. జర్మనీ తత్వ శాస్త్రం, ఫ్రాన్స్ సోషలిజం, బ్రిటిష్ రాజకీయ అర్థ శాస్త్రం, ఆ తర్వాత రష్యా జనాకర్షక వాదం మార్క్స్ ను బాగా ప్రభావితం చేశాయి.
కాపిటల్ (పెట్టుబడి) గ్రంథంలో మార్క్స్ ‘నైరూప్య ఊహించదగిన’ పద్ధతి నుసరించాడు. దాన్నే తర్వాత క్రమానుసార పద్ధతి అన్నారు. ఈ పద్ధతిలో విశ్లేషణ ఒక్కొక్క అడుగే ముందుకు వెళ్తుంది. నైరూప్యమైన భావాలు తర్వాత నిర్దిష్ట భావాలుగా పరిణమిస్తాయి. కేవలం ఊహలు వెశ్లేషణా స్థాయికి చేరుకుంటాయి. క్రమానుగత విశ్లేషణా దశలు నిర్దిష్టమైన ధోరణులను విడమర్చి చెప్తాయి. నైరూప్య ఊహలు విపరీతమైన పరిశీలన ద్వారా కీలకాంశాలను విప్పి చెప్పగలుగుతాయి. పెట్టుబడికి శ్రమకు ఉన్న సంబంధాన్ని వివరించడానికి మార్క్స్ ఇదే పద్ధతి అనుసరించారు. పెట్టుబడి గ్రంథం మొదటి సంపుటంలో మార్క్స్ చేసిన పని ఇదే. కీలకాంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. మార్క్స్ విశ్లేషణా విధానం చరిత్ర పరిణామం మీద ఆధారపడింది. మార్పు అంతర్నిహితమైన సామాజిక సంబంధాల మీద ఆధారపడి ఉంటుందని, అది మానవుల ఆచరణ మీద ఆధారపడి ఉంటుందని, సమాజం కొన్ని పరిమితులకు లోబడి మారుతూ ఉంటుందని, "వాస్తవ పరిస్థితుల మీద ఆధారపడి, గత పరిణామ క్రమం మీద ఆధారపడి మారుతుంది"అని మార్క్స్ విశ్లేషించారు. చారిత్రక పెట్టుబడిదారీ విధానం కాని పెట్టుబడిదారీ విధానం ఏదీ లేదు. అందుకే పశ్చిమ యూరప్ లో పెట్టుబడిదారీ విధానం ఎలా అస్తిత్వంలోకి వచ్చింది, అది ఎలా పని చేస్తుంది, చివరకు ఎక్కడికి దారి తీస్తుందని చారిత్రక దృష్టితో నిర్దుష్టంగా నిరూపించ గలిగాడు.
మార్క్స్ దృష్టిలో మార్పును కోరుకునే చారిత్రక శక్తులకు, వ్యవస్థాపరమైన శక్తులకు మధ్య నిరంతరం ఘర్షణ జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో ఒక సమతుల్యత సాధించడానికీ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దాని వల్ల ప్రయోజనాత్మకంగా కలిసికట్టుగా ఉన్న శక్తులు విడిపోయి విశిష్టమైన మార్పుకు దోహదం చేస్తాయి. మార్క్స్ 1860లలో పెట్టుబడిదారీ విధానాన్ని ఎంత నిశితంగా పరిశీలించి నిర్దిష్ట సూత్రీకరణలు చేసినప్పటికీ ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థలో, సమాజంలో విశేషమైన మార్పులు వచ్చాయి. అందుకని జరగవలసింది ఏమిటంటే మార్క్స్ పద్ధతిలో పరిశోధన కొనసాగిస్తూ ఆ పద్ధతికి మరింత పదును పెట్టడం. ఆయన శాశ్వత సత్యం చెప్తున్నానని అన లేదు. ఆయన విధానాన్ని విమర్శించాలనే కోరుకున్నాడు. తన పద్ధతిని సుసంపన్నం చేయడం కోసం మార్క్సిస్టు దృక్పథంతో విశ్లేషించాలని భావించాడు.
మార్క్స్ కాపిటల్ గ్రంథం మొదటి సంపుటం వెలువడి 150 సంవత్సరాలు గడిచాయి కనక వాస్తవ స్థితిగతుల ఆధారంగా మార్క్స్ సూత్రీకరణలను పరిపుష్టం చేయాల్సిన అగత్యం ఉంది. ప్రస్తుతం పెట్టుబడిదారీ వ్యవస్థ విశ్వవ్యాప్తమైంది. పెట్టుబడిదారీ వ్యవస్థ పరిధి, దాని పరిమిత పరిధి కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సైనికంగా దాని కేంద్రానికి అనుగుణంగానే ఉంటుంది. ఈ పరిధిలో దోపిడీ, వ్యవస్థలో ఏర్పడే మిగులును పంచుకోవడంలో అధికార వర్గాలకు, వృత్తినిపుణులకు ఎక్కువ వాటా దక్కుతుంది. అదే ఈ వ్యవస్థలోని ప్రధానాంశం. మాంద్యం కనక ఏర్పడితే ఏకఛత్రాధిపత్యం వహించే బహుళజాతి కంపెనీలు విస్తరిస్తాయి. పెట్టుబడి ద్రవ్య రూప పెట్టుబడిగా మారుతుంది. ఇది అసలైన ఆర్థిక వ్యవస్థల మీద ప్రభావం చూపుతుంది. ఉన్న పెట్టుబడులపై లాభాలు రాకపోతే ఊహాపరమైన ఆర్థిక లాభాల కోసం అన్వేషిస్తారు.
"వాస్తవిక" ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కార్మికులు ఈ వ్యవస్థ కేంద్రంలోకి వలస వెళ్తారు. బహుళజాతి సంస్థల పెట్టుబడులు పెరుగుతాయి. అసమానమైన రంగాల్లో పెట్టుబడి పెట్టడంవల్ల దోపిడీ మరింత పెరుగుతుంది. ఈ సంస్థల్లో శ్రమ శక్తి వల్ల సమకూరే లాభాలను కాజేస్తారు. వస్తూత్పత్తి పరిశ్రమలను స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఈ దోపిడీ రైతులకు కూడా విస్తరిస్తుంది. అప్పుడు రైతుల లాభాలనే కాక, భూమి మీద వచ్చే కౌలును, వారి అప్పుల మీద వచ్చే వడ్డీని, వారి వేతనాల్లో కొంత భాగాన్ని కూడా కబళిస్తారు.
ఈ పరిస్థితుల్లో కాపిటల్ గ్రంథమే రాయవలసి వస్తే, విమర్శనాత్మకంగా విశ్లేషించవలసి వస్తే కచ్చితంగా అది మార్క్స్ రాసిన మూడు భాగాల కాపిటల్ కన్నా భిన్నంగానే ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో వర్గ విశ్లేషణ, శ్రమ శక్తి విలువ, మొదలైనవన్నీ వేరుగానే ఉంటాయి. పేద రైతులను, చిన్న వస్తువులను తయారు చేసే వారిని పెట్టుబడి దోపిడీ చేస్తుంది. ఇంటి పని చేసే వారికి ఏ వేతనమూ లేదు. సహజ వనరులను పెట్టుబడి కొల్లగొడ్తోంది. పర్యావరణం కూడా సామ్రాజ్యవాద లక్షణాలను సంతరించుకుంటోంది. అస్థిరత, సంక్షోభం, గిరాకీ మొదలైనవన్నీ ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాయి. ద్రవ్య పెట్టుబడి రాజ్యమేలుతోంది. రాజ్య వ్యవస్థలు పెట్టుబడిని నిర్దేశిస్తున్నాయి. పౌర ప్రభుత్వాలు, సైనిక పాలనలు, సామ్రాజ్య వాదం ప్రధానమైన వైరుధ్యాలుగా తయారయ్యాయి.
మార్క్స్ జన్మించి రెండువందల ఏళ్లు అయిన తర్వాత చేయవలసిన పని ఆయన ఆలోచనా విధానం, పద్ధతి ప్రకారం ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయడం. దీనికి చారిత్రక భౌతికవాదం, గతితార్కిక భౌతికవాద సూత్రాలను అన్వయించవలసి ఉంటుంది. మార్క్స్ నుంచి మనకు అందిన వారసత్వాన్ని వినియోగించుకుని ప్రతి అంశాన్నీ విమర్శనాత్మకంగా చూడవలసి ఉంటుంది. మార్క్సిజాన్ని యాంత్రికంగా అనువర్తింప చేస్తే ప్రయోజనం లేదు.
ప్రపంచాన్ని పునర్నిర్వచించడం, సామాజిక విప్లవం ద్వారా సోషలిజం సాధించడం ప్రస్తుత లక్ష్యం. ఎందుకంటే పెట్టుబడి, పెట్టుబడిదారీ విధానం మరో 200 ఏళ్లు కొనసాగితే మానవజాతే మిగలక పోవచ్చు.