సహకార లేని సమాఖ్య విధానం
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
ఆర్థిక సంఘం స్వతంత్రమైన రాజ్యాంగ వ్యవస్థ. కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య నిధుల పంపిణీని స్వతంత్రంగా సిఫార్సు చేస్తుంది. రాజ్యాంగంలోని 7వ స్కెడ్యూలులో నిర్దేశించిన విధంగా కేంద్రం, రాష్ట్రాలు తమ విధులను నిర్వర్తించడానికి అనువుగా నిధులు కేటాయించేట్టు చేయడం ఆర్థిక సంఘం బాధ్యత. గతంలో ఆర్థిక సంఘాలు ఈ బాధ్యతను బాగా నిర్వర్తించాయి. ఒక వ్యవస్థగా ఆర్థిక సంఘానికి అపారమైన గౌరవం ఉండేది. భారత ఆర్థిక ఫెడరల్ వ్యవస్థ పని తీరుకు ఆర్థిక సంఘం కీలకమైంది. ఆర్థిక సంఘాలు ఫెడరల్ విధానాలను బలోపేతం చేయడానికి ఉపకరించాయి. ఈ సంఘం ఏం చేయాలో అది పరిశీలించవలసిన అంశాలను నిర్దేశించడంపై ఆధారపడి ఉంటుంది. 15వ ఆర్థిక సంఘం పరిశీలనాంశాలను నిర్దేశించిన తీరు అనేక అనుమానాలకు దారి తీస్తోంది. 1971 జనాభా లెక్కలను కాకుండా 2011 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకుని ఆర్థిక సంఘం పని చేయాలన్న నిర్దేశంవల్ల కొన్ని రాష్ట్రాలకు నష్టం కలిగే ప్రమాదం ఉంది. పరిశీలనాంశాలను కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా నిర్దేశించారు. 15వ ఆర్థిక సంఘం కనక సమతూకంతో పని చేయకపోతే ఇప్పటికే కేంద్రానికి అనుకూలంగా ఉన్న నిధుల కేటాయింపు కేంద్రం ఆదేశించి, అదుపు చేసే స్థాయికి చేరుతుంది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసిన తర్వాత మొట్ట మొదటి సారిగా ఏర్పడింది 15వ ఆర్థిక సంఘమే. అందువల్ల ఈ సంఘం కేంద్ర, రాష్ట్రాల వనరులపై సమగ్రమైన వైఖరి అనుసరించాలి. ఈ సంఘం సిఫార్సు చేయని మార్గాల ద్వారా సమకూరే నిధులను కూడా పరిగణించాలి.
వనరులు, వ్యయంపై సమగ్రమైన వైఖరి అనుసరించిన మొదటి ఆర్థిక సంఘం 14వ ఆర్థిక సంఘమే. ఆ సంఘం కేంద్రం వసూలు చేసే పన్నులవల్ల వచ్చే రాబడిలో రాష్ట్రాలకు 42 శాతం కేటాయించాలని సిఫార్సు చేసింది. రాష్ట్రాల ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ సిఫార్సు చేసింది. కేంద్ర జాబితాలో ఉన్న అంశాలను అమలు చేయడానికి కేంద్రానికి తగినన్ని నిధులు అందుబాటులో ఉన్నాయి. కేంద్రం నిధులు సమకూర్చే పథకాలను కూడా ఈ ఆర్థిక సంఘం పరిగణనలోకి తీసుకుంది. కాని 14వ ఆర్థిక సంఘ సిఫార్సులవల్ల రాష్ట్రాలకు ఎక్కువ నిధులు అందుతాయి కనక కేంద్ర ప్రభుత్వ ద్రవ్య స్థితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలని 15వ ఆర్హిక సంఘం పరిశీలనాంశాలలో చేర్చారు. ఇది గతంలో ఎన్నడూ లేనిది. ఈ నవ భారత్ 2022 ఏమిటి? ఈ ప్రభుత్వ గడువు 2019తో తీరిపోతుంది. అలాంటప్పుడు 2022 నాటికి ఉండే పరిస్థితిని గమనంలో ఉంచుకోవాలని కోరడం అంటే రాబోయే ప్రభుత్వం తన విధానాలనే అనుసరించాలని చెప్పడమేగా! సామాజిక, ఆర్థిక రంగాలలో కేంద్రం ప్రతిపాదించే పథకాలను కూడా నవ భారతం అన్న భావన పరిగణనలోకి తీసుకుంటుంది. పైగా ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం, రాష్ట్రాలు చేసే వ్యయంలో 48 శాతం రాష్ట్రాలే ఖర్చు పెట్టాల్సి ఉన్నప్పుడు ఏ జాతీయ అభివృద్ధి ఎజెండా అయినా రాష్ట్రాల వనరుల్లో కోత పెట్టడానికి వీలుంటుందా? కేంద్రం నిర్దేశించిన పరిశీలనాంశాల ఆంతర్యం స్పష్టంగానే కనిపిస్తోంది. ద్రవ్య సంబంధమైన స్వయం ప్రతిపత్తిని నియంత్రించాలని, రాష్ట్రాల నిధులను అదుపు చేయాలని కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు స్పష్టం అవుతూనే ఉంది.
275వ అధికరణం ప్రకారం ఆర్థిక సంఘం కేటాయించే నిధులు రాష్ట్రాల ద్రవ్యలోటు పూడ్చడానికి ఉపయోగపడాలి. ఈ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘానికి నిర్దేశించిన పరిశీలనాంశాలలో "రెవెన్యూ లోటు భర్తీ చేయడానికి రాష్ట్రాలకు అసలు నిధులు కేటాయించాలా లేదా అని కూడా ఆలోచించాలి" అని చేర్చారు. ఒక వేళ కమిషన్ కనక ఈ నిధులు కేటాయించకూడదని తేలిస్తే రాష్ట్రాలు రెవెన్యూ లోటు పూడ్చుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గం ఏమిటి? ఇలా నిర్దేశించడంలోని అంతరార్థం ఏమిటంటే పన్నూల్లో వాటా అందిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ లోటు ఉండకూడదనే. అంటే రాష్ట్రాల రాబడి, ఖర్చులను ఆర్థిక సంఘం అవాస్తవికంగా అంచనా వేయాలని చెప్పడమే.
కేంద్రం నిర్దేశించిన పరిశీలనాంశాలు అనేక షరతులతో కూడుకుని ఉన్నాయి. ఈ పరిశీలనాంశాల్లో ఏడవ అంశం ప్రకారం రాష్ట్రాలకు పని తీరు ప్రకారం నిధులు కేటాయించడంలో ప్రోత్సాహకాలు ఇచ్చే విషయం పరిశీలించాలని కూడా చేర్చారు. ఈ సందర్భంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రోత్సహకాలు ఇవ్వడానికి రాష్ట్రాల పని తీరును బేరీజు వేయడానికి ఆర్థిక సంగం సరైన వ్యవస్థేనా? ద్రవ్య, వ్యయ లోపాలను సరిదిద్దే బాధ్యత ఆర్థిక సంఘానికి అప్పగిస్తే ఇక ప్రోత్సాహకాలు ఎక్కడ నుంచి ఇస్తుంది? ఒక వేళ ప్రోత్సాహకాలనుబట్టి పన్నుల్లో వాటా నిర్ణయించేటట్టయితే ద్రవ్యంలో సమానత్వం సాధించే లక్ష్యంలో రాజీ పడ్డట్టు కాదా? గ్రాంట్ల రూపంలో నిధులు కేటాయిస్తే షరతుల ప్రకారం గ్రాంట్లు ఇస్తారు కనక పన్నుల్లో రాష్ట్రాల వాటా తగ్గిపోదా? ఆర్థిక సంఘంతో సంబంధం లేకుండా కేంద్రం ఎప్పుడైనా గ్రాంట్లు, ప్రోత్సాహకాలు ఇవ్వవచ్చు. ఏడవ పరిశీలనాంశం ద్వారా ఆర్థిక సంఘం విధికి అడ్డు తగలడం ఎందుకు?
చివరి విషయం రుణాలు, లోటు, ద్రవ్య నిర్వహణా బాధ్యత. మొత్తం మీద రాష్ట్రాలు ద్రవ్య విధానంలో వివేకవంతంగానే పని చేస్తాయి. 2017-18 కేంద్ర బడ్జెట్ ప్రకారం స్థూల జాతీయోత్పత్తిలో అన్ని రాష్ట్రాల ద్రవ్య లోటు 2.7 శాతం మాత్రమే ఉంది. అందువల్ల పదిహేనవ ఆర్థిక సంఘం రాష్ట్రాల రుణాలకు కత్తెర వేస్తే రాష్ట్రాల వ్యయం తగ్గి పోతుంది. ముఖ్యంగా అభివృద్ధి పథకాల కోసం పెట్టే ఖర్చు తగ్గుతుంది. ద్రవ్య లోటును నియంత్రించవలసింది కేంద్రం. రాష్ట్రాలు కాదు. 2008 నుంచి ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టానికి కట్టుబడకుండా ఉన్నది కేంద్రమే.