ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

నగరాలతో పాటు పొగ చూరిన మెదళ్లు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

దిల్లీలో పొగ మంచు కమ్ముకోవడం ప్రతి ఏడాది ఎదురయ్యే పరిణామమే. అలాగే విపరీతమైన ఆందోళనా ప్రతి ఏటా ఉంటుంది. దిల్లీలో దట్టమైన పొగ మంచు కమ్ముకోవడానికి హర్యానా, పంజాబ్ రాష్ట్రాలే కారణమని దిల్లీ వాదిస్తుంది. ఆ రెండు రాష్ట్రాలు మాత్రం దిల్లీయే కారణం అంటున్నాయి. ఈ ఉభయ పక్షాలు నెపం కేంద్రప్రభుత్వం మీద మోపుతున్నాయి. దిల్లీ వాసులు మాత్రం పరిశుభ్రమైన గాలి పీల్చుకోగలమని కలలు కనడానికి కూడా అవకాశం లేదు. ముఖ్యంగా పేదలకు, పిల్లలకు, వృద్ధులకు ఉన్న అవకాశమల్లా బతకాలంటే కలుషిత గాలి పీల్చుకుని మృత్యువాత పడడమే మార్గం. ఈ మాట నాటకీయంగా కనిపించవచ్చు కాని అనేక ప్రసిద్ధ సంస్థలు చేసిన పరిశోధనల్లో దిల్లీ లో వాతావరణం ఎంత కలుషితమైందో హెచ్చరించాయి. లాన్సెట్ అనే బ్రిటిష్ వారపత్రిక ఇటీవల పరిశోధించి 2015లో గాలి కాలుష్యం వల్ల భారత్ లో 25 లక్షల మంది ప్రజలు అకాల మరణం పాలయ్యారని తేల్చింది.

ఈ నెల ఏడవ తేదీన దిల్లీని పొగమంచు ఆవరించి ఉండవచ్చు. కాని ఆ ప్రమాదం చాలా కాలంగా పొంచి ఉన్నదే. అనిల్ అగర్వాల్, శాస్త్ర - పర్యావరణ కేంద్రం (సిఎస్.ఇ.) వారు 2002 లోనే దిల్లీలో వాయుకాలుష్యం పెరిగిపోతోందని హెచ్చరించారు. ప్రజా రవాణా వాహనాలకు డీసెల్ కాకుండా సంక్షేపిత సహజ వాయువు (సి.ఎన్.గి.) వాడాలని కూడా సూచించారు. అంటే పరిస్థితి ఎంతటి సంక్షోభానికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. కాని ఈ సూచనను పట్టించుకోవడానికి పెద్దగా చేసింది ఏమీ లేదు కనక ప్రస్తుతం తీవ్ర పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. మెట్రో రైలు నిర్మించినా, దిల్లీ రోడ్లు ఎంత విశాలమైనవి అయినా వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. డీసెల్ వాడే లారీలు దిల్లీ వీధుల గుండా దూసుకుపోతూనే ఉంటాయి. ఘన రూప వ్యర్థాలను బహిరంగ ప్రాంతాలలోనే తగలబెడ్తుంటారు. పరిశ్రమలు ఎంత కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయో సరైన పర్యవేక్షణ లేదు. దిల్లీకి చుట్టుపక్కల ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలు సల్ఫర్ డై ఆక్సైడ్ (గంధక ద్విఆమ్లజనిదం)ను, బూడిదను వెదజల్లుతూనే ఉంటాయి. డీసెల్ జనరేటర్ల వల్లా ఈ బాధ ఎటూ తప్పదు. ఈ కారణంగా ఏడాది పొడవునా వాయు కాలుష్యం స్వైర విహారం చేస్తూనే ఉంటుంది. ఈ సమస్య కేవలం శీతాకాలంలోనే ఉండదు. శీతాకాలంలో మంచు కూడా తోడవుతుంది కనక ఈ సంమస్య ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. చలి కాలంలో ఇది పొగ మాంచుగా కనిపిస్తుంది. తేడా అదొక్కటే.

గత ఏడాది దిల్లీలో వాయు కాలుష్యానికి కారణం ఏమిటో కాన్పూర్ లోని ఐ.ఐ.టి. ఓ అధ్యయనం చేసి నివేదిక విడుదల చేసింది. పంట కోతల తర్వాత దుబ్బులు తగులబెట్టే సమస్య ఉండని వేసవిలో కూడా దిల్లీ వాతావరణంలో వాయు కాలుష్యం తక్కువేమీ కాదని ఈ నివేదికలో హెచ్చరించారు. చలి కాలంలో దుబ్బులు తగులబెట్టినందువల్ల సూక్ష్మ రేణువులు గాలిలో కలిసి పోయి, గాలి తక్కువగా వీచడం వల్ల పొగ మంచు ఆవరిస్తుంది. దిల్లీలోని వాయువులో 98 శాతం సల్ఫర్ డై ఆక్సైడ్, 60 శాతం నైట్రోజెన్ ఆక్సైడ్ కు కారణం థర్మల్ విద్యుత్ కేంద్రాలు, పరిశ్రమలు, రెస్టారెంట్లు, దీసెల్ జనరేటర్లేనని ఈ అధ్యయనంలో తేలింది. దిల్లీకి 300 కి.మీ. పరిధిలో 25 పెద్ద పరిశ్రమలు, 25 పారిశ్రామిక సముదాయాలు ఉన్నాయి. ఈ పరిశ్రమలు తమ కొలుముల్లో చమురు వాడతాయి. దీని వల్ల ప్రతి పది లక్షల రేణువుల్లో ఉండవలసిన గంధకం కంటే 500 భాగాలు ఎక్కువ ఉంటుంది. పైగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏ మేరకు గ్యాస్, బూడిద వెదజల్లుతున్నాయో పర్యవేక్షణ లేదు. దిల్లీలో 9000 చిన్న హోటళ్లు ఉన్నాయి. ఇవి బొగ్గు వాడతాయి. దిల్లీలోని 90 శాతం మంది వంట చేసుకోవడానికి పరిశుభ్రమైన ఇంధనమే వాడినా ఇంకా 10 శాతం మంది కట్టెల పొయ్యిలు, పంట కోతల తర్వాత మిగిలిన దుబ్బులు, పిడకలు, బొగ్గు మీదే వంట చేసుకుంటారు. దిల్లీలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడమూ కాలుష్యానికి కారణం. 

దిల్లీ కాలుష్యం ఇప్పుడు చర్చనీయాంశం అయి ఉండవచ్చు కాని దేశంలోని అనేక నగరాలలో పీల్చే గాలి కలుషితమైందే. దీనికి కారణాలు పైన పేర్కొన్నవే. ఉత్తర భారతంలో కాలుష్య సమస్య మరీ ఎక్కువ. భారత ఉపఖండ ఉత్తర భాగంలోనూ ఇదే పరిస్థితి. దిల్లీ, పాకిస్తాన్ లోని లాహోర్ లో వాయు కాలుష్యం ఎక్కువ అని మీడియాలో వార్తలు వచ్చాయి. అందువల్ల ఈ సమస్యను పరిష్కరించడానికి పొరుగు దేశంతో సంప్రదించాలి. భారత్-పాకిస్తాన్ దేశాలకు చరిత్రలోనే కాక భౌగోళికంగానూ సంబంధం ఉంది. మనకు ఉత్తరాదిన సమస్య ఉన్నట్టే పాకిస్తాన్ లో కూడా ఉంది.

ఈ సమస్య రుతువులను బట్టే లేదు. శాశ్వతంగా ఉంది. ఇది ఒక నగరం సమస్య కాదు. పాకిస్తాన్ భూభాగాన్ని కూడా కలిపి చూస్తే ఒక భౌగోళిక ప్రాంతంలో ఉన్న సమస్య ఇది. దీనికి తక్షణ పరిష్కారాలు ఉండవని విధాన నిర్ణయాలు చేసే వారు గుర్తించాలి. అత్యవసరంగా కొన్ని చర్యలు తీసుకోక తప్పదు. ఇవి అరకొర, అసమర్థ నిర్ణయాలుగా కనిపించినా సరే. ఏ చర్య లేనిదానికన్నా ఏదో ఒక చర్య ఉండడం మంచిదే. కాని వాతావరణం కొంత మెరుగుపడగానే మామూలే అనుకోగూడదు. ప్రస్తుత సమస్యకు కారణం ఇలా అనుకోవడమే. పొగ మంచు లేనప్పుడు కూడా మన నగరాల్లో గాలి ప్రాణాంతకమైందే.

ఈ సమస్యను ఎదుర్కున్న దేశాలు ఏం చేశాయో గమనించాలి. అలా చేయాలంటే కచ్చితమైన నిబంధనలు ఉండాలి. భూ వినియోగానికి సంబంధించిన చట్టాలు ఉండాలి. ప్రైవేటు రవాణా కన్నా ప్రజా రవాణాకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రజలకు బహిరంగ ప్రదేశాలు, చెట్లు చేమలు అందుబాటులో ఉండాలి. పరిసర ప్రాంతాలలో కాలుష్యాన్ని నియంత్రించాలి. ఎందుకంటే ఏ నగరమూ ఒక దీవిలో ఉండదు. కాలుష్య రహిత వాతావరణం ఉండవలసిన అగత్యం ఏమిటో పౌరులకు తెలియజెప్పాలి. వాయు కాలుష్యాన్ని తొలగించడానికి మంత్ర దండం ఏదీ ఉండదు. క్రమ పద్ధతిలో, దీర్ఘ కాలిక, నిలకడగా ఉండే కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తే తప్ప మన నగరాలు ఆవాస యోగ్యంగా ఉండవు. 

Back to Top