ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

స్వేచ్ఛను హరిస్తున్న వారికే స్వేచ్ఛ!

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

భారత పౌరులకు ఉన్న వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రసాదించేవి కావు. రాజ్యాంగంలోని 19(1)ఎ అధికరణం దీనికి పూచీ పడుతోంది. కాని ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల చెప్తున్న మాటలు, తీసుకుంటున్న చర్యలు ప్రభుత్వాన్ని సమర్థించే వారికి, ఆ ప్రభుత్వ సైద్ధాంతిక ధోరణిని సమర్థించే వారికి మాత్రమే స్వేచ్ఛ ఉంటుంది అన్న ధోరణిలో ఉన్నాయి. అలా లేని వారు ఈ స్వేచ్ఛను వినియోగించుకుంటే అది వారికే నష్టం అనేట్టుగా ఉంది. ఒక వేళ భావప్రకటనా స్వేచ్ఛకు అడ్డుతగులుతున్నారు అని గనక మీరు అంటే దానికి రుజువులు లేవు అంటున్నారు. కొంత మంది రచయితలను, ప్రసిద్ధ పత్రికా రచయితను హతమార్చడం, కొందరిపై దేశద్రోహం కేసులో, పరువు నష్టం కేసులో మోపడం భావప్రకటనా స్వేచ్ఛ మీద దాడి కాదంటారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావప్రకటనా స్వేచ్ఛకు ఎంత విలువ ఇస్తారో చెప్పడానికి సామాజిక మాధ్యమాలలో తనను అనుసరించే వారు ఎలాంటి వారైనా ఆయన అనుసరించకుండా ఆగరని, సెప్టెంబర్ 5న బెంగుళూరులో హత్యకు గురైన గౌరీ లంకేశ్ మీద అభ్యంతరకరమైన భాషలో దూషణకు పాల్పడ్డ వారిని కూడా అనుసరించేంటంతటి ఔదర్యాం ఆయనది అని ఊదరగొడ్తారు. గౌరీ లంకేశ్ హత్య గురించి సెప్టెంబర్ ఆరున ప్రకటన విడుదల చేసిన ప్రసిద్ధ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహా కు కర్నాటక బీజేపీ యువజన విభాగం పరువు నష్టం నోటీసు జారీ చేసినా వారి దృష్టిలో ఇది అసహనం కాదు, భావప్రకటనా స్వేచ్ఛకు అడ్డుతగలడమూ కాదు. ధబోల్కర్, పన్సారే, కల్బుర్గీని హతమార్చిన సంఘ్ పరివార్ వారే గౌరీని కూడా అంతమొందించారు అని Scroll.in కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామచంద్ర గుహా అభిప్రాయపడ్డారు. ఈ ప్రకటన బీజేపీ ప్రతిష్ఠను దెబ్బ తీస్తుందని ఆయనకు జారీ చేసిన నోటీసులో ఆరోపించారు. ఆయన మాటలు ఆరోపాణలతో కూడినవి, పరువు నష్టం కలిగించేవి అని పేర్కొన్నారు.

తేలేదేమిటంటే బీజేపీకి అనుకూలంగా ఉంటే విద్వేషాన్ని రెచ్చగొట్టడాన్ని కూడా ఆ పక్షం భావ ప్రకటనా స్వేచ్ఛగా పరిగణిస్తుంది. కాని గుహా లాంటి వారు తమ అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు మాత్రం భావప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని నిందిస్తారు. విమర్శకుల నోళ్లు మూయించడానికి వారి దగ్గర ఉన్న పెద్ద ఆయుధం నేరపూరిత పరువునష్టం దావా వేయడమే. లేదా భారత శిక్షా స్మృతిలోని 124వ సెక్షన్ ఆధారంగా దేశద్రోహ నేరం మోపుతారు. 2014 నాటికి ఒక్క దేశద్రోహం కేసు కూడా ఉండేది కాదని 2016 నాటికి అవి 11 కు చేరాయని The Hoot పేర్కొన్నది. ఒక రకంగా ఈ కేసుల సంఖ్య తక్కువగానే కనిపించవచ్చు. కాని ఈ ప్రతి కేసు రాజకీయ అసమ్మతి వ్యక్తం చేసే అందరికీ ఓ హెచ్చరిక. ఈ కేసు ఉన్న వారు అనుసరించవలసిన న్యాయ ప్రక్రియ, అనుభవించవలసిన శిక్ష కన్నా అసలు దేశద్రోహం నింద మోయడమే పెద్ద శిక్ష. తమను విమర్శించే వారి మీద దేశద్రోహం కేసు మోపడం అంటే అదే అభిప్రాయం వ్యక్తం చేసే వారు విమర్శించే ముందు పునరాలోచించుకోవాలని హెచ్చరించడమే. వేధించే ఈ ఎత్తుగడలను వ్యూహాత్మకంగా వినియోగిస్తారు. ఎవరి మీద ఈ అస్త్రం ప్రయోగించాలో జాగ్రత్తగా నిర్ణయించుకుంటారు. అందువల్ల దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

కొంత మేరకు ఈ వ్యూహం పని చేసి ఉండవచ్చు. భావప్రకటనా స్వేచ్ఛకు బద్ధులైన వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉంటారు. 2016లో దేశద్రోహ ఆరోపణకు గురైన జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జె.ఎన్.యు.) విద్యార్థులు అదే పని చేస్తున్నారు. కాని అసమ్మతి, భావప్రకటనా స్వేచ్ఛ అన్న అంశం మీద నిజానికి జరగాల్సినంత జన సమీకరణ జరగనే లేదు. భావప్రకటనా స్వేచ్ఛ అనే అంశం మీద సామాన్య ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేస్తారని, ఉద్యమిస్తారని ఆశించలేం. తమ దాకా వస్తే తప్ప ఇలాంటి స్వేచ్ఛల గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అందుకే విద్యార్థులు, రచయితలు, పత్రికా రచయితలు, మేధావులు ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్వేష వాతావరణం అలుముకుని ఉన్న దశలో జూన్ లో దిల్లీ సమీపంలో జునైద్ ఖాన్ ను కొట్టి చంపినప్పుడు  నిరసన వ్యక్తమైన తీర్ చూస్తే భావాప్రకటనా స్వేచ్ఛను హరించడం వల్ల ఆందోళనకు గురయ్యే వారు ఎక్కువ మందే ఉన్నారని అర్థం అవుతోంది. అలాగే పక్షం రోజుల కిందట గౌరీ అలంకేశ్ ను హతమార్చినప్పుడు వందలాది మంది పత్రికా రచయితలు, పౌర సమాజానికి చెందిన వేలాది మంది ఈ హత్య అసమ్మతి వ్యక్తం చేయడం మీద ప్రత్యక్ష దాడి అని భావిస్తున్నారు.

ఇటీవల ఇన్ని నిరసన ప్రదర్శనలు జరిగిన తర్వాత, కొద్ది నెలల్లో కర్నాటక శాసన సభకు ఎన్నికలు జరగవలసిన నేపథ్యంలో బీజేపీ తన కర్నాటక యువజన విభాగాన్ని అత్యంత ప్రసిద్ధుడైన రామచంద్ర గుహాకు లీగల్ నోటీసు ఇవ్వడాన్ని ఎందుకు అనుమతించినట్టు? బీజేపీ నాయకులు అంత అవివేకులా లేదా కొన్ని నగరాల్లో నిరసన ప్రదర్శనలు జరిగినంత మాత్రాన ఎన్నికల సమయంలో తమ అవకాశాలు దెబ్బ తినవు అన్న ధీమాతో ఉన్నారా? గుహా లాంటి వారి మీద తీసుకునే ఇలాంటి గట్టి చర్యలు కూడా తమను సమర్థించే వారిని మరింత సంఘటితం చేయడానికి ఉపకరిస్తాయనుకుంటున్నారు. సామాజిక మాధ్యమాలలో వెల్లువెత్తుతున్న విమర్శలు ఎన్నికలలో తమ అవకాశాలకు నష్టం కల్గించవనే ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అందుకే ప్రధానమంత్రి కొంత మందిని సామాజిక మాధ్యమాలలో తనను అనుసరించే వారిని బ్లాక్ చేయాలన్న అంశం టీవీలకు ఉపకరించవచ్చునేమో కాని బీజేపీకి పెద్దగా పోయేదేమీ లేదు. అదీగాక తమను విమర్శించే వారిని ఒంటరి వాళ్లను చేస్తే వారిని పట్టించుకునే వారే ఉండరని బీజేపీ భావిస్తోంది.

స్వేచ్ఛ గురించి రోజా లక్సెంబర్గ్ చెప్పిన మాటలు సమకాలీన భారత్ కు బాగా నప్పుతాయి. ఆమె ఇలా అన్నారు: "స్వేచ్ఛ అంటే ఎప్పుడైనా విభిన్నంగా ఆలోచించే వారి స్వేచ్ఛే. ఇది న్యాయానికి సంబంధించిన భావనకు పరిమితమైంది కాదు. స్వేచ్ఛ ఒక ప్రత్యేక హక్కు అయినప్పుడు అది హరించుకుపోతుంది". ప్రస్తుతం మన దేశంలో అదే జరుగుతోంది. భావప్రకటనా స్వేచ్ఛ కొందరికి విశిష్టమైన హక్కుగా తయారైంది. ఈ స్వేచ్ఛను హరించే వారు సిగ్గు వదిలి స్వేఛ, స్వాతంత్ర్యాల గురించి గంభీరోపన్యాసాలు చేస్తున్నారు. 

Updated On : 15th Nov, 2017
Back to Top