ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

మార్క్స్ కాపిటల్ కు 150 ఏళ్లు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

నూటా యాభై ఏళ్ల కింద, 1867 సెప్టెంబర్ 14న కార్ల్ మార్క్స్ బృహత్ గ్రంథం కాపిటల్ మొదటి సంపుటి జర్మన్ భాషలో జర్మనీలోని హాంబర్గ్ లో వెలువడింది. (ఈ సంపుటం ఇంగ్లీషు అనువాదం 1887లో కాని ప్రచురితం కాలేదు. 1872లో రష్యన్ భాషలో కాపిటల్ మొదటి సంపుటం వెలువడింది). ఈ గ్రంథం రాజకీయ అర్థ శాస్త్రాన్ని, సామాజిక శాస్త్రాలను విపరీతంగా ప్రభావితం చేసింది. ఎందుకంటే గతి తార్కిక భౌతిక వాద సూత్రాలను అనువర్తింప చేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దోపిడీకి గురి అవుతున్న దేశంలో పెట్టుబడి సమకూరే విధానాన్ని విడమర్చిన మొదటి ప్రయత్నం అదే. అర్థ శాస్త్రానికి గతితార్కిక భౌతిక వాద సూత్రాలను వర్తింప చేయడం ద్వారా మార్క్స్ సాంప్రదాయిక లేదా ప్రామాణిక రాజకీయ అర్థ శాస్త్ర సిద్ధాంత పరివర్తనకు కారకుడయ్యాడు. కాపిటల్ గ్రంథంలో సిద్ధాంతమూ ఉంది, చరిత్రా ఉంది. సిద్ధాంతం నైరూప్యమైంది అయిదే చరిత్ర నిర్దిష్టమైంది. ఈ రెండింటి మధ్య ఘర్షణ అనివార్యం. మార్క్స్ కు ఈ విషయం స్పష్టంగా తెలుసు. రెండింటికీ ఇవ్వవలసినంత ప్రాధాన్యం ఇచ్చాడు. దేనికి ఎంత ఊనిక ఉండాలో అంతా ఇచ్చారు.

మార్క్స్ కాపిటల్ గ్రంథం మూడు సంపుటాలు. మొదటిది 1867లో వెలువడి. పరివర్ధిత రెండవ ముద్రణ 1872లో ప్రచురితమైంది. రెండవ సంపుటాన్ని 1885లో, మూడవ సంపుటాన్ని 1894లో మార్క్స్ మరణం తర్వాత ఫ్రెడరిక్ ఏంగెల్స్ ప్రచురించారు. చరిత్రలో పెట్టుబడిదారీ విధానం ఎలా ఆవిష్కృతమైందో, అది ఎలా పెరిగిందో, ఎలా పని చేసిందో, ఎలా పరిణమిస్తుందో మార్క్స్ క్షుణ్నంగా విశ్లేషించాడు. విలువ, అదనపు విలువ, దోపిడీ రేటు (లేదా అదనపు విలువ రేటు), యంత్రాలు,  ముడి సరుకు కోసం పెట్టుబడి, కార్మికుల వేతనాల కోసం పెట్టుబడి,  లాభం రేటు, సాపేక్షికమైన అదనపు జనాభా (లేదా అదనంగా అందుబాటులో ఉన్న శ్రామిక బలగం) మొదలైన వాటిలో మార్క్స్ అనేక వైరుధ్యాలు కనిపెట్టాడు. చారిత్రక శ్క్తులు మార్పునకు దోహదం చేస్తూ ఉంటే వ్యవస్థాపరమైన శక్తులు సమతుల్యత పాటించడానికి ప్రయత్నిస్తాయని, ఈ రెండింటి మధ్య వైరుధ్యం ఉంటుందని మార్క్స్ నిరూపించాడు. ఈ సూత్రం ఆధారంగా పెట్టుబడి మీద ఆధిపత్యం ఉండే వారు/నియంత్రించే వర్గాలు కార్మికులను దోపిడీ చేస్తాయని శ్రామిక సిద్ధాంతాన్ని మార్క్స్ రూపొందించాడు. అదనపు విలువ ఎలా పుడుతుందో కనిపెట్టి దాన్ని ఎలా పెంపొందింప చేస్తారో విడమర్చాడు.

పెట్టుబడి సమకూరే పద్ధతికి మార్క్స్ అనుసరించిన దృక్పథం ఇంగ్లీషు ప్రామాణిక రాజకీయ ఆర్థిక శాస్త్ర  నిపుణుల్లో దిగ్గజమైన డేవిడ్ రికార్డో దృక్పథానికి పూర్తిగా విరుద్ధమైంది. ఆర్థిక చక్రాలను, సంక్షోభాలను ప్రభావితం చేసే శక్తులను మార్క్స్ బహిర్గతం చేశాడు. ఆర్థిక చక్రంలో లాభాలు తగ్గే ధోరణి, వినియోగించుకునే దానికన్నా ఎక్కువ ఉత్పత్తి చేసే ధోరణి ఉంటుందని మార్క్స్ చెప్పాడు. అలాగే పెట్టుబడి సాంద్రీకరణ, కేంద్రీకరణ జరిగే ప్రక్రియను కూడా మార్క్స్ వివరించారు. కేంద్రీకరణ వల్ల పరిశ్రమల విలీనాలు, స్వాధీనం చేసుకోవడం పెరుగుతుంది. మార్క్స్ అభిమతం ప్రకారం పెట్టుబడిదారీ గతి సూత్రాలలో ఉత్పత్తి, డబ్బు, పెట్టుబడి చాలా కీలకమైనవి. విప్లవకరమైన శ్రామికవర్గం వల్లే ఇది సాధ్యం అవుతుందని మార్క్స్ చెప్పారు. ఈ పెనవేసుకున్న ప్రక్రియలన్నీ ఒక దశలో పెట్టుబడిదారీ ఆవరణలో పొసగనివిగా తయారై ఇవి బద్దలై పోయి చివరకు అది పెట్టుబడిదారీ ప్రైవేటు పెట్టుబడి విధానానికి మృత్యు గంటగా మారుతుందని మార్క్స్ విశ్లేషించాడు. హక్కును స్వాధీనం చేసుకునే వారే చివరకు లేకుండా పోతారు.

శ్రామికవర్గం పెంపొంది ఒక విప్లవ వర్గంగా మారడం, పెట్టుబడీ దారీ వ్యవస్థను కూల దోయడం మార్క్స్ దృష్టిలో అనివార్యమైన పరిమాణం. మార్క్స్ అనుసరించింది గతితార్కిక భౌతిక వాదమే అయినా ఆయన చారిత్రక నియతి వాదానికి లొంగి పోయారనిపిస్తుంది. కాపిటల్ గ్రంథంలో మార్క్స్ రచనా శైలి, ఆయన వాడిన భావ చిత్రాలు, వైభవం, పెట్టుబడిని ఆవేశపూరితంగా ఈసడించడం - ఉదాహరణకు "పెట్టుబడి మృత శ్రమ, అది రక్త పిపాసి. శ్రమను పీల్చి పిప్పి చేసి బతుకుతుంది, ఇలా పీల్చి పిప్పి చేసినందువల్ల మరింతగా బతుకుతుంది" లాంటి శైలి పాఠకులను కట్టి పడేసే మాట వాస్తవమే. చదివిన వారు విప్లవాత్మకమైన మార్పు తప్పదనుకుంటారు. కాని అలా కట్టి పడేసే శైలే రచయితను కట్టి పడేసింది. అందుకే విప్లవకర మార్పును ఎక్కువ అంచనా వేశాడు. అలాంటి మార్పుకు ఉన్న అవరోధాలను తక్కువ అంచనా వేశాడు.

కాపిటల్ కేవలం రాజకీయ అర్థ శాస్త్ర గుణదోష విచారణ మాత్రమే కాదు. అది ఆర్థిక, సామాజిక అంశాలను కూడా క్షుణ్నంగా విడమరుస్తుంది. వస్తుకాముకతను మార్క్స్ ఇలా విడమర్చారు. “వస్తుమయమైన ప్రపంచంలో వ్యక్తిగత సంబంధాలు అమూర్తమైనవిగా ఉండకుండా వస్తువుల మధ్య సంబంధాలుగా మారిపోతాయి. మనిషిని, ప్రకృతిని దోపిడీ చేయడం ద్వారా సంపద ఉత్పత్తి అవుతుంది”. నిజానికి పర్యావరణానికి సంబంధించిన అంశాల మీద మార్క్స్ అభిప్రాయాలు  సమకాలీన జీవావరణ నిపుణులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఆయన కాలంలో జీవావరణ భావనలను పెంపొందింప చేయడానికి జరుగుతున్న ప్రయత్నాల ప్రభావం ఆయన మీద ఉంది. సమాజానికీ, ప్రకృతికి మధ్య జీవక్రియ జరగాలని భావించాడు. "అసలు సంపదకు మూలాధారమైన నేల, శ్రామికుడు అన్న భావనను పెట్టుబడిదారీ ఉత్పత్తి చిన్న చూపు చూస్తోంది" అని మార్క్స్ కాపిటల్ మొదటి సంపుటంలో ఊరకే రాయలేదు. కాపిటల్ మొదటి సంపుటంలోని 8వ భాగంలో "పెట్టుబడి సమకూరడానికి ఆదిమప్రేరణ" ఏమిటో మార్క్స్ ప్రస్తావించాడు. తద్వారా పెట్టుబడిదారీ వ్యవస్థ ఎలా ఎదిగిందో చెప్పాడు. బ్రిటన్ లో ఆవరణల (ఎంక్లోజర్స్) ద్వారా రైతులను ఎలా దుర్వినియోగం చేశారో, అంతకన్నా ముఖ్యంగా దోపిడీకి గురి కావడానికి గల కారణాలను, ప్రపంచ పెట్టుబడారీ వ్యవస్థకు అలవాటైన జీవావరణను చెండాడానికి ఎలా ప్రయత్నించారో అది "అందంగా కనిపించే పెట్టుబడిదారీ ఉత్పత్తికి" ఎలా దారి తీసిందో మార్క్స్ వివరించారు.

అయితే మార్క్స్ తాను చెప్పిన "బూర్జువా ఆర్థిక వ్యవస్థ"ను సంపూర్ణంగా వివరించలేదు. ముఖ్యంగా పెట్టుబడిదారీ రాజ్య వ్యవస్థ, విదేశీ వాణిజ్యం, అంతర్జాతీయ మార్కెట్ గురించి విడమర్చ లేదు. అందుకే ప్రపంచ వ్యవస్థ చట్రాన్ని గురించి తెలియజేశారు. కాని పెట్టుబడికి ఆదిమ ప్రేరణ గురించి చెప్పేటప్పుడు ఆయన ఎదుగుతున్న పెట్టుబడిదారీ విధాన ప్రభావం గురించి, అది ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థకు అంచుగా మారుతుందని అన్నారు.  యంత్రాలు, ఆధునిక పరిశ్రమల గురించి చెప్పేటప్పుడు, వలసవాద ఆధిపత్యాన్ని గురించి చర్చించేటప్పుడు, యూరప్ రాజ్యాలు "తమ మీద ఆధారపడిన దేశాలలోని పరిశ్రమలను బలవంతంగా నిర్మూలించాయి" అన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ అంతర్జాతీయ వ్యవస్థగా స్థిరపడిన సందర్భంలో దోపిడీ తత్వం గల కేంద్ర-కైవారంలో ఉండే అంశాల మధ్య సంబంధం గురించి మార్క్స్ కు తెలుసు.

పెట్టుబడి దారీ వ్యవస్థ పెంపొందే క్రమంలో వ్యవస్థకు అంచున ఉండే వారిలో అభివృద్ధి రాహిత్యం పెరగడం, గత 150 ఏళ్లుగా అంతర్జాతీయ వ్యవస్థలో ఈ లక్షణాలు కనిపించడం గమనిస్తే కాపిటల్ లోని ఈ అంశాలకు సన్నిహిత సంబంధం ఉందని రుజువు అవుతుంది. "శ్రామిక వర్గం" పేద రైతులు తాము చేసే పనిలో లాభాన్ని "పెట్టుబడిదారులకు" వదిలిపెట్టాల్సి వస్తుందని, తాము సాగు చేసే భూమి మీద కౌలును విడనాడాల్సి వస్తుందని, తమ అప్పుల మీద వడ్డీని భరించవలసి వస్తుందని, తమ వేతనాల్లో కొంత భాగాన్ని కూడా వదులుకోవాల్సి వస్తుందని మార్క్స్ అంటాడు. "శ్రామిక వర్గం"లో చిన్న స్థాయిలో ఉత్పత్తి చేసే వారూ ఉంటారని వీరు వాణిజ్య పెట్టుబడికి లోబడి ఉంటారని, ఇందులో లేని వారికి కూడా తమకు దక్కవలసిన "అదనం" దక్కదని, ఎందుకంటే వారు అసమానమైన వాణిజ్యంలో చిక్కుకుని ఉంటారని మార్క్స్ అంటాడు.

శ్రామికవర్గం అన్న మాటకు అసలు అర్థంలో కాకుండా ఉండే వారు, అంటే పని చేయడానికి సిద్ధంగా ఉన్న సరైన పని దొరకని శ్రామికులు, పని చేసే కార్మికులు కూడా తమ వేతనాలలో కొంత వదులుకోవాల్సి వస్తుంది. చిన్న తరహా ఉత్పత్తి దార్లకు అందవలసిన ధరల్లో కూడా కోత పడుతుంది. మార్కెట్లలో విపరీతమైన పోటీ ఉంటుంది. శ్రామికులు ఈ పరిస్థితులన్నింటినీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ మరిన్ని లాభాలు సంపాదించడానికి దోహదం చేస్తుంది. దీని వల్ల పెరిగిపోయే దారుణ పేదరికం చివరకు ప్రజల కొనుగోలుశక్తిని దిగజారుస్తుంది. అందువల్ల వినియోగం తగ్గుతుంది. ఇది ఉత్పత్తి సామర్థ్యం పెరగడానికి దారి తీస్తుంది. కొత్త పెట్టుబడుల మీద లాభాలు తగ్గి పెట్టుబడుల అవకాశాన్ని దెబ్బ తీస్తుంది. 

Back to Top