ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ఏడు పదులు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

1947 ఆగస్టు పదిహేను అర్థరాత్రి వెలిగించిన జ్వాల ఇప్పుడు మసకబారి పోయింది. మన స్వాతంత్ర్యం మనందరి “భవిష్యత్ తో సమాగమం” అని తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ మన గణతంత్రంలోని “అంతర్ వైరుధ్యాల” పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ గణతంత్రం మౌలికమైన సామాజిక, ఆర్థిక సమానత్వం కల్పించకుండానే రాజకీయ సమానత్వం దత్తం చేసిందని ఆయన గుర్తు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన రోజున నౌఖాలీలో పర్యటించిన మహాత్మా గాంధీ కమ్యూనిస్టుల పరిభాషలో మాట్లాడి “ఈ స్వాతంత్ర్యం బూటకం” అన్నారు.

ఈ ద్వైదీభావం, ఈ అనిశ్చితి మనకు వచ్చిన స్వాతంత్ర్యం నిజమైందా, బూటకమైందా అన్న చర్చకు గత 70 సవత్సరాలుగా అవకాశం కల్పిస్తూనే ఉంది. మనం పండగ చేసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మనం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోగలిగాం. 70 ఏళ్ల కిందటితో పోలిస్తే ఇప్పుడు ప్రజలకు సాధికారికత పెరిగింది. వారు జీవనోపాధికి, జీవితాలకు కావాల్సిన తమ నిర్ణయాలు తాము తీసుకోగలుగుతున్నారు. అదే సమయంలో మురికి కాలవలను శుభ్రం చేసే క్రమంలో దళితులు ప్రాణాలు కోల్పోవడం నిత్యకృత్యం అయిపోయింది. మహిళల మీద దాడులు కొనసాగుతునే ఉన్నాయి. ముస్లింలను వీధుల్లో మూకుమ్మడిగా దాడి చేసి కొట్టి చంపుతున్నారు. మనం ఎన్నికల కమిషన్, అంతరిక్ష పరిశోధనా కేంద్రం లాంటి అగ్రగామి సంస్థలను ఏర్పాటు చేశాం. వాటిని సమర్థంగా నడపగలుగుతున్నాం. ఇవి మన గణ తంత్రానికి పునాదులుగా ఉన్నాయి. వలస వాదం ముగిసిన తర్వాత అనేక దేశాలలో భయంకరమైన మత పరమైన హింసాకాండలు జరిగాయి. అలాంటి వాటిని మనం నివారించగలిగాం. అంతే కాకుండా బహుళత్వాన్ని, మత సహనాన్ని పరిరక్షించగలిగాం. కాని మనం ప్రభుత్వ విధానంగా సెక్యులర్ భావాన్ని ధ్వంసం చేసే ప్రభుత్వాన్ని, మెజారిటీ మత విధానాన్ని అమలు చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం.

ఈ స్థితిలో మనం స్వాతంత్ర్యం సాధించినందుకు పండగ చేసుకోవాలా లేదా జార విడుచుకున్న అవకాశాల కారణంగా దుఃఖించాలా? ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను చూసి మిన్నకుండి పోవాలా?

ఈ సందిగ్ధత, లేదా కొంతమంది అంటున్నట్టు ఈ వైరుధ్యం ఆధారంగా వలసవాదం నుంచి విముక్తి పొంది స్వాతంత్ర్యం సాధించిన అంశంపై చర్చించాలా? ఇందులోనూ ఒక సానుకూలాంశం ఉంది. స్వాతంత్ర్యం వల్ల మనకు రాజకీయ చర్చకు ఆస్కారం కలిగింది. బాహాటంగా వీటి గురించి మాట్లాడుకునే అవకాశం వచ్చింది. ఈ పత్రికలో వీటిని విస్తారంగా రాసే వారు పెరిగారు. ఇలాంటి వారు దేశవ్యాప్తంగా ఉన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వారు, సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వారు ఉన్నారు. ఒక రకంగా చూస్తే సామాజిక శాస్త్రాలలో పరిశోధన పెరుగుతోంది. విధానాలపై వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. విస్తరిస్తున్నాయి. అయినా ఈ చర్చలకు, విధానాలకు మధ్య  చర్చలకు, రాజకీయాలకు మధ్య దూరం పెరుగుతోంది. ప్రభుత్వ విధానాలను రూపొందించడంలో విద్యావేత్తల, పండితుల గొంతు వినిపించడం లేదు. ప్రభుత్వంలోనూ, ప్రజాజీవనంలోనూ ఉన్న వారికి విద్యావేత్తలతో సంబంధం లేకుండా పోయింది.

స్వాతంత్ర్యం సాధించిన తర్వాత కొన్ని దశాబ్దాల పాటు దేశ నిర్మాణానికి అవసరమైన అనేక విధానాల గురించి ఈ పండితులు చర్చించే వారు. ఆ కారణంగానే మన దేశంలో సామాజిక శాస్త్రాలు పరిఢవిల్లాయి. వస్తు రీత్యా మనం అభివృద్ధి సాధించకపోయినా ఈ చర్చలు మాత్రం కొనసాగాయి. మన విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ స్థాయి గల విద్యావేత్తలను, భావాలను తయారు చేశాయి. అనేక లోపాలు ఉన్నప్పటికీ మన భారత అభివృద్ధి నమూనా – అది ఆర్థిక విధానాల విషయంలోనైనా, ప్రజాస్వామ్యం లేదా సెక్యులరిజం గురించి అయినా చర్చ కొనసాగడం యాదృచ్ఛికం ఏమీ కాదు. ఈ రంగాలలో సాధించిన విజయాలది చాలా పెద్ద జాబితానే. రాజనీతి శాస్త్రంలో, సామాజిక శాస్త్రంలో, చరిత్రలో, సాహిత్యంలో, ఆర్థిక శాస్త్రంలో గతంలో వలస వాద కాడి కింద పడి నలిగిన ఏ దేశంలోనూ జరగనంత కృషి మన దేశంలో సాగింది. ఈ రంగాల్లో మన పండితుల వాణిని అంతర్జాతీయ చర్చల్లో విస్మరించడానికి అవకాశమే లేదు. టూకీగా చెప్పాలంటే ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ సామాజిక శాస్త్రాల విషయంలో భారత్ సజీవమైన విజయాలు సాధించింది. వీటి వల్ల ప్రభుత్వ విధానాలు రూపొందాయి.

కొన్నేళ్లుగా, ముఖ్యంగా 1980ల తర్వాత మన దేశంలో ఉన్నత విద్య అపూర్వంగా విస్తరించింది. అక్షరాస్యత పెరగడం, సమాజంలో మార్పుల వల్ల వందలు, వేల మంది కళాశాలల్లోకి, విశ్వవిద్యాలయాల్లోకి వస్తున్నారు. ఈ విస్తరణ కేవలం శాస్త్రాలు, సాంకేతిక, ఇంజనీరింగ్, యాజమాన్య రంగాలకే పరిమితం అయింది కాదు. సామాజిక శాస్త్రాలలో, మానవ శాస్త్రాలలో కూడా ఈ విస్తృతి కనిపిస్తోంది. ప్రభుత్వ పెట్టుబడి పెరిగినా అది ఈ విస్తరణకు అనువుగా లేదు. ప్రైవేటు వ్యాపార విద్య సామాజిక శాస్త్రాలను పట్టించుకోవడం లేదు. సామాజిక శాస్త్రాలు, మానవీయ శాస్త్రాలతో సంబంధం లేకుండానే రెండు తరాలు ఎదిగాయి. ఆ తరాలు తమ రాజకీయ ఆకాంక్షలు వ్యక్తం చేశాయి. ఈ లోటును టీవీలు, వాట్స్ ఆప్ లాంటివి కొంత వరకు పూరించాయి. ఇలాంటి విద్యను చూసి రాజకీయాలు గుణపాఠం నేర్చుకోవాలి. వందలు, వేల మంది సామాజిక శాస్త్రాలు, మానవీయ శాస్త్రాలతో అంతగా సంబంధం లేకుండానే ఎదిగారు అంటే విద్యా రంగం అవాస్తవికంగా తయారైందనే. దీని వల్ల విభిన్న పరిణామాలు సంభవించాయి. అందులో ప్రధానమైంది విపరీతమైన పరిభాషతో, పాండిత్య ప్రకర్షతో కూడిన వ్యర్థ మాటలతో కూడిన సామాజిక శాస్త్రాల విభాగాల వ్యాప్తి. ఈ విభాగాలు అత్యంత సామాన్యవిషయాన్ని కూడా అనవసరంగా గంభీరంగానూ, అర్థం కాని క్లిష్టమైన పద్ధతిలోనూ చెప్పడం పెరిగింది. విద్యావంతులకు సైతం అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. పరిశోధనాంశాలు వాస్తవ జీవితానికి సంబంధం లేకుండా పోయాయి. అనవసరమైన రహస్యానికి, వితండవాదానికి దిగి విశ్లేషించే కృత్రిమత్వానికి దారి తీసింది. దీనివల్ల సామాజిక శాస్త్రవేత్తలు తమ చుట్టూ ఉన్న సమాజాన్నే అర్థం చేసుకోలేని స్థితి ఏర్పడింది. వారు తమ అస్తిత్వం కోసం పోరాడాల్సిన పరస్థితి ఎదురైంది.

ప్రస్తుత భారత సమాజం మూడు దశాబ్దాల కిందో, రెండు దశాబ్దాలకిందో ఉన్న సామాజిక, రాజకీయ సమాజం కాదు. పరిస్థితులు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఉన్నట్టుగా లేవు. ఇప్పుడు చదవను, రాయను వచ్చిన  వారు అపారంగా పెరిగారు. పని చేయడానికి సుదూర ప్రాంతానికైనా వెళ్లే వారు ఎక్కువయ్యారు. తమ తీరిక వేళలను ప్రయోజనవంతంగా గడపడమూ పెరిగింది. ఆస్తులను సమకూర్చున్న వారు, అలాంటి సమాజాలు అధికమైనాయి. జనం వృత్తులు మారుతున్నారు. వారి ఆదాయాల్లోనూ మార్పు ఉంది. కుటుంబాలు రూపాంతరం చెందాయి. రాజకీయాల్లో స్త్రీ, పురుషుల పాత్రలూ మారిపోయాయి. మన సమాజం ఇందిరా గాంధీ ఉన్న రోజులకన్నా కూడా విపరీతంగా మారిపోయింది.

ఈ నవభారతాన్ని అర్థం చేసుకుని, విడమర్చే సిద్ధాంతాలు, పద్ధతులు ఎక్కడున్నాయి? భారత్ ను అర్థం చేసుకోగలిగే నమూనాలు, దృక్పథాలు ఎక్కడున్నాయి? సామాజిక, రాజకీయ ప్రపంచం మనకు అంతుపట్టకుండా పోతోంది. దిగ్భ్రమకు గురయ్యే ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. నవ భారతానికి, పండితులకు మధ్య అంతరం పెద్ద నోట్ల రద్దులో కనిపిస్తోంది.

70 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత మన దేశం స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారు గుర్తుపట్టడానికి వీలు లేనంతగా మారిపోయింది. ఒక కవి చెప్పిన మాటలు ఈ సందర్భంగా గుర్తుకు వస్తున్నాయి:

ఏడుపదుల తర్వాత నాకు బాగా గుర్తుంది:

ఈ కాలంలో అనేక గంటల పాటు

నేను భయంకరమైన, వింతైన విషయాలు చూశాను

ఈ కాళ రాత్రి గతంలో తెలిసినవన్నీ వ్యర్థమైపోయాయి.

ఈ స్వాతంత్ర్య దినోత్సవం భవిష్యత్ లక్ష్యాల సాధనకు సంకల్పం పూన వలసిన సమయం కూడా. ఎకానామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, దాని పూర్వ రూపమైన ఎకనామిక్ వీక్లీ భారత అంతశ్చేతనకు ప్రతిబింబంగా ఉంది. అన్వేషణ కొనసాగించవలసిన ఈ దశలో మేం మేం చర్చలకు, సంవాదాలకు, నోరు లేని వారి తరఫున మాట్లాడడానికి నిబద్ధులమై ఉన్నాం. కొత్త గొంతుక అవతరించ వలసిన అగత్యం ఉంది. అది ప్రజల కోర్కెలను పసి గట్టగలగాలి. వలసవాదం అంటే ఏమిటో తెలియని వారి ఆకాంక్షలు ఏమిటో కనిపెట్టగలగాలి.

Updated On : 13th Nov, 2017
Back to Top