జాతీయవాదంపై పాఠాలు చెప్తున్న సైనికులు
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
బ్రిటిష్ వాళ్లు ఒకప్పుడు భారతీయులను నాగరికులను చేసే బాధ్యత నెత్తిన వేసుకున్నట్టే ప్రస్తుత ప్రభుత్వం భారతీయులని జాతీయవాదులుగా మార్చే బృహత్తర బాధ్యత తలకెత్తుకుంది. భారతీయులు ఇంతవరకు సంపూర్ణ జాతీయవాదులు కారన్న అభిప్రాయమే దీనికి కారణం. దేశవాసులను జాతీయవాదులుగా మార్చడానికి ఈ ప్రభుత్వం ఎన్నుకున్న పద్ధతి ఏమిటంటే సైన్యం అంటే ప్రజల్లో గౌర్వభావంతో పాటు భయం కల్పించడం. అందుకేనేమో "ప్రజలు మమ్మల్ని చూస్తే భయపడాలి" అంటున్నారు సైనికదళాధిపతి బిపిన్ రావత్. అంటే భారతీయతా భావనకు సైనిక దళాలకు మధ్య సంబంధం మారిపోతున్నట్టుంది. ప్రజాధనంతో నియమితులై దేశాన్ని రక్షించవలసిన బాధ్యత ఉన్న వారు సైనికులు అన్న భావన ఉండేది. అది కాస్తా సైనికులు ప్రజలకు జాతీయవాదం అంటే ఏమిటో పాఠాలు చెప్తారన్న తీరులో మారిపోయింది.
జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జె.ఎన్.యు.) వైస్ చాన్సలర్ జగదీశ్ కుమార్ ఇటీవల విద్యార్థులకు సైనికులపై గౌరవభావం కలిగించడానికి ఒక శతఘ్నిని తెప్పించి విశ్వవిద్యాలయం ఆవరణలొ పెట్టాలని సంకల్పించారు. ఆ శతఘ్నిని ప్రముఖమైన చోట ఉంచితే విద్యార్థులకు "నిరంతరం" సైన్యం మీద గౌరవభావం కలిగించవచ్చునని, వారి సాహసం, త్యాగం గుర్తుకు వస్తాయి అని జగదీశ్ కుమార్ చెప్పారు. జె.ఎన్.యు.లో ఇటీవల కార్గిల్ దినోత్సవాన్ని నిర్వహించినప్పుడు కేంద్ర మంత్రులు వి.కె.సింగ్ కు, ధర్మేంద్ర ప్రధాన్ కు వైస్ చాన్సలర్ ఈ సూచన చేశారు. జె.ఎన్.యు.లో కార్గిల్ దివసం నిర్వహించడం ఇదే మొదటి సారి. "దేశద్రోహులుగా" ఉన్న విద్యార్థులను దేశభక్తులుగా మార్చడానికి ఇటీవల అనేక ప్రతిపాదనలు వస్తున్న నేపథ్యంలో వైస్ చాన్సలర్ ఈ సూచన చేశారు. ఏడాది కిందట అప్పుడు మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్న ప్రస్తుత జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ కేంద్రీయ విశ్వవిద్యాలయాలన్నింటిలో జాతీయ పతాకం ఉండాలని ప్రతిపాదించారు. జె.ఎన్.యు.లో జాతీయ పతాకం ఇంతకు ముందునుంచే ఉన్న విషయం ఆమె ఆ తర్వాత తెలుసుకున్నారు. తన ప్రతిపాదన వీగిపోయినందుకు నిరాశపడ్డ స్మృతి ఇరానీ విశ్వవిద్యాలయ విద్యార్థులకు సైనికాధికారులతో జాతీయవాదంపై ఉపన్యాసాలు ఇప్పించాలని అన్నారు. కాని ఆమెను జౌళి మంత్రిత్వ శాఖ గురించి చూడమని చెప్పడం ఆమె దురదృష్టమే కావచ్చు. విశ్వవిద్యాలయాలు ఉన్నది దేని కోసమో ఈ ప్రభుత్వానికి తెలియక పోవడం పెద్దగా ఆశ్చర్యకరమేమీ కాదు. కాని సైనికులను దైవాంశ సంభూతులుగా మార్చడం ప్రమాదకరమైందే. ఈ భావనను ముందుకు తీసుకెళ్తే ప్రజాస్వామ్య వ్యవస్థలకు విఘాతం కలగక తప్పదు.
సైనికుడు దేశభక్తికి చిహ్నం కావడంలో కొత్తేమీ లేదు. కాని భారత జాతీయత మూలాలు వలసవాద పాలనలో ఉన్నాయి కనక వలసవాద సంప్రదాయం నుంచి వచ్చిన సైనికులకు అవి అంతగా రుచించవు. స్వాతంత్ర్యం వచ్చిన తొలి దశలో సైన్యాన్ని ప్రభుత్వ నియంత్రణలో ఉండే వృత్తిపరమైన దళంగా భావించే వారు. ఆ రోజుల్లో జాతీయవాది అంటే ఖాదీ బట్టలు ధరించే సత్యాగ్రాహి లేదా చావుకు వెరవని విప్లవకారుడే. ఇప్పుడు ఆ ఇద్దరి స్థానంలో సైనికుడిని ప్రతిష్ఠిస్తున్నారు.
1965లో భారత-పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు అప్పటి ప్రధానమంత్రి "జై జవాన్-జై కిసాన్" నినాదం ఇచ్చారు. 1962లో చైనాతో యుద్ధంలో ఓటిమి వల్ల నిరాశలో కూరుకుపోయిన సైన్యాన్ని ఉత్తేజపరచడానికి ఆయన ఈ నినాదం ఇచ్చారు. కాని ఆదర్శప్రాయుడైన జాతి సేవకుడిగా రైతు సరసన జవాన్ ను ఉంచారు. అటల్ బిహారీ వాజపేయి నాయకత్వం వచ్చే దగ్గరికి ఈ నినాదం "జై జవాన్-జై కిసాన్-జై విజ్ఞాన్" గా మారి జాతీయవాదం అంటే అతిశయించిన సైనిక వాదంగా మారింది. 1998లో పోఖ్రాన్ లో రెండో సారి నిర్వహించిన అణుపాటవ పరిక్షల ద్వారా భారత్ అణ్వస్త్రాలున్న దేశంగా మారిపోయింది. ఈ రెండు నినాదాల మధ్య కాలంలో 1971లో పాకిస్తాన్ తో యుద్ధం జరిగింది. ఆ నేపథ్యంలోనే 1974లో మొట్ట మొదటి సారి అణుపాటవ పరిక్ష జరిగింది. కాని 1990ల చివరకు వచ్చే సరికి శాంతి, నిరాయుధీకరణ అన్న సూత్రాలకు భారత్ కట్టుబడడం ఉదాహరణప్రాయంగా కూడా లేకుండా పోయింది. కార్గిల్ యుద్ధ విజయాన్ని జరుపుకోవడానికి శతఘ్నులు చిహ్నాలుగా మారాయి.
సైనికులను జాతీయవాదులుగా కొలవడం వెనక సైన్యం వ్యవహారాల్లో రాజకీయ జోక్యం కూడా కారణం అయింది. బిపిన్ రావత్ ను సైన్యాధ్యక్షుడిగా నియమించినప్పుడు ఇద్దరు సీనియర్ అధికారులను కాదని ఆయనను నియమించారు. రాజకీయంగా అనుకూలురైన వారికి పదోన్నతులు కల్పించడం కొత్త కాదు. ఇందిరా గాంధీ హయాంలో అరుణ్ వైద్యను ఇదే పద్ధతిలో సీనియర్లను కాదని నియమించారు. అయితే ప్రస్తుత సైన్యాధిపతి అడ్డూ ఆపూ లేకుండా బహిరంగ ప్రకటనలు చేయడం మాత్రం మునుపెన్నడూ లేనిదే. కశ్మీర్ లో తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మనుషులను కవచాలుగా వాడుకోవడాన్ని రావత్ సమర్థించడాన్ని ప్రభుత్వ పెద్దలు తప్పు పట్టనేలేదు. ఈ విషయమై ఎవరైనా బహిరంగ విమర్శలు చేస్తే వారిని జాతి వ్యతిరేకులుగా ముద్ర వేశారు.
ఉత్తర బెంగాల్ విశ్వవిద్యాలయ ఆవరణలో 40 ఏళ్ల నుంచి సైనిక శతఘ్ని ఉంది. అక్కడ అది ఉండడానికి భిన్నమైన కారణాలున్నాయి. అది బంగ్లా దేశ్ విముక్తి పోరాట సమయంలో మన సైనికులు పాకిస్తాన్ సేనలనుంచి స్వాధీనం చేసుకున్నది. అది విదేశీ సేనలపై మన విజయానికి సంకేతం. కాని జె.ఎన్.యు. వైస్ చాన్సలర్ ఆ విశ్వవిద్యాలయం ఆవరణలో శతఘ్ని ఉంచాలని కోరడం వెనక ఆ సంస్థ జాతివ్యతిరేకులకు నిలయమైందని జాతీయవాదులమని చెప్పుకునే వారి ప్రచార ఫలితమే. ఈ ప్రతిపాదన ప్రభావం గురించి ఇంకా అనుమానాలు ఏమైన ఉంటే జె.ఎన్.యు.లో కార్గిల్ దివసాన్ని పాటించినప్పుడు కొందరు అతిథుల ప్రసంగాలను వింటే ఆ అనుమానాలు కూడా తొలగి పోతాయి. సాధారణ పౌరులకు సైన్యాన్ని ప్రశ్నించే అధికారం లేదని మాజీ క్రికెట్ క్రీడాకారుడు గౌతం గంభీర్ అన్నారు. జె.ఎన్.యు.లో కార్గిల్ దివసం జరపడం కేవలం కార్గిల్ యుద్ధంలో విజయం గుర్తు చేసుకోవడానికి జరుపుకొనే ఉత్సవం మాత్రమే కాదని అంది అంతర్గత యుద్ధంలో జె.ఎన్.యు.పై విజయానికి కూడా చిహ్నమని రచయిత రాజీవ్ మల్హోత్రా అన్నారు. జె.ఎన్.యు.ను స్వాధీనం చేసుకోవడంతో ఆగిపోకూడదని జాదవ్ పూర్ విశ్వవిద్యాలం "కోట"ను, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలని మాజీ సైనికాధికారి జి.డి.బక్షీ పిలుపు ఇచ్చారు. జె.ఎన్.యు. వైస్ చాన్సలర్ సమక్షంలోనే ఇలాంటి ప్రకటనలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో సైనిక వాదాన్ని కొనియాడుతున్నారు. అది జాతీయవాదానికి అత్యున్నత వ్యక్తీకరణ అంటున్నారు. ఈ శతాబ్దారంభం నుంచి ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.