లాలూ మీద దాడి కక్ష సాధింపే
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
లాలూ ప్రసాద్ యాదవ్ మీద దాడి చేయడానికి ఎన్నుకున్న సమయం కక్ష సాధింపు ధోరణే తప్ప ఆయన తప్పులకు సంబంధించింది కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రతి ప్రభుత్వం రాజకీయ ప్రతినిధుల మీద కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ను ఒక అస్త్రంగా వినియోగించుకుంది. రాష్ట్రీయ జనతా దళ్ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్, అయిన కుటుంబ సభ్యులు బీజేపీ ప్రభుత్వానికి ప్రధానమైన శతృవులు. 2017 జూన్ 20వ తేదీన ఆదాయపు పన్ను శాఖ రాష్ట్రీయ జనతా దళ్ అధిపతి, ఆయన కుటుంబ సభ్యులపై 1988నాటి బినామీ ఆస్తుల లావాదేవీల చట్టం కింద ఆరోపణలు మోపింది. వెయ్యి కోట్ల విలువ గల భూముల లావా దేవీలు చేశారని, పన్నులు ఎగవేశారని అభియోగాలు మోపారు. ఆ తర్వాత 2017 జులై ఏడో తేదీన లాలూ ప్రసాద్, ఆయన కుటుంబ సభ్యుల ప్రాంగణాలపై సీబీఐ దాడులు చేసింది. లాలూ ప్రసాద్ 2004 నుంచి 2009 మధ్య రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వేకి సంబంధించిన హోటళ్ల నిర్వహణను ఒక ప్రైవేటు కంపెనీకి అక్రమ పద్ధతుల్లో టెండర్లు కేటాయించారని అభియోగం ఉంది. ప్రధానమైన మీడియా సంస్థలు లాలూ ప్రసాద్ మీద తమకు తోచిన తీర్పులు చెప్పేస్తున్నాయి. ఈ దర్యాప్తులన్నీ రాజకీయ దురుద్దేశాలతో కూడుకున్నవేనని లాలూ వాదిస్తున్నారు. బీజేపీ పనుపుతో ఈ పని చేస్తున్నారని ఆయన అంటున్నారు. అవినీతి ఆరోపణలు ఎలా ఉన్నా లాలూ యాదవ్ నిర్దోషి అనడానికి వీలు లేకపోవచ్చు.
నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్.డి.ఎ. ప్రభుత్వం ఎలాంటి వ్యతిరేకతనైనా సహించక పోవడానికి పేరొందింది. తమ మాట కాదనే వారిని అపఖ్యాతి పాలు చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆరితేరిపోయారు. వారి పార్టీలోగాని, వెలుపల గాని వ్యతిరేకతను సహించలేరు. గుజరాత్ లో 2000 సంవత్సరం ఆరంభంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే పద్ధతిలో వ్యవహరించారు. కాంగ్రెస్, అమ్ ఆద్మీ పార్టీని అపఖ్యాతి పాలు చేసిన తర్వాత ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ మీద దృష్టి సారించారు. లాలూ మీద దాడి చేయడానికి ఎంచుకున్న సమయాన్ని బట్టి చూస్తే ఈ కేసులన్నీ రాజకీయ దురుద్దేశంతో మోపినవేనన్న లాలూ ఆరోపణలో నిజం లేకపోలేదని అనిపిస్తోంది. ఇటీవల ముగిసిన రాష్ట్రపతి ఎన్నికలలో ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని ఎన్.డి.ఎ. ఏతర పార్టీలు మే నుంచే ప్రయత్నిస్తున్నాయి. లోక సభలో తమకు ఉన్న మెజారిటీని ఆధారంగా చెసుకుని బీజేపీ తనకు ఇష్టమైన బిల్లులను ఆమోదించుకోవడానికి, బిల్లులను ఆమోదించకుండా ఉండడానికి రాష్ట్రపతికి ఉన్న వీటో అధికారం లేకుండా చేయడానికి ప్రయత్నిస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్ ప్రతిపక్షాల ఐక్యతకు ప్రధాన కేంద్రం అయినందువల్ల ఆయన అధికార పార్టీ ఆగ్రహానికి గురయ్యారు.
బీజేపీ, లాలూ మధ్య వైరానికి దీర్ఘకాలిక చరిత్ర ఉంది. బీజేపీతో కత్తు కలపని ప్రాంతీయ పార్టీ నాయకుడు ఆయన ఒక్కరే అన్న ప్రతిష్ఠ ఉంది. ఆయన మతతత్వానికి వ్యతిరేకంగా నిరంతరం నిలబడిన వ్యక్తి. బీజేపీని, దాని మాతృ సంస్థ అయిన ఆర్.ఎస్.ఎస్. ను కూడా లాలూ నిరంతరం వ్యతిరేకిస్తూనే ఉన్నారు. 1990లో మతోద్రిక్తతలను రేకెత్తించిన బీజేపీ నాయకుడు ఎల్.కె.అడ్వాణీని అరెస్టు చేసిన ఘనత కూడా లాలూకు ఉంది. అడ్వాణీ రామ రథ యాత్ర బిహార్ గుండా వెళ్లకుండా నిరోధించింది లాలూనే. 2015 నవంబర్ 7 సంచికలో ఇ.పి.డబ్ల్యు. వారపత్రిక 2015 ఎన్నికలలో బీజేపీపై లాలూ ప్రసాద్ యాదవ్ విజయం సాధించడానికి బీజేపీని, ఆ పార్టీ మతత్వాన్ని, బ్రాహ్మణీకాన్ని ఆయన నిరంతరం వ్యతిరేకించడమే ప్రధాన కారణం అని రాసింది. హిందువులు గో మాంసం తిన్న ఉదంతాల గురించి లాలూ అనేక దృష్టాంతాలు చూపించారు. ఆ రకంగా లాలూ యాదవ్ బీజేపీ సిద్ధాంతానికి సవాలుగా పరిణమించారు. బిహార్ లో ఘన విజయం సాధించిన తర్వాత లాలూ జాతీయ రాజకీయాలలో తాను కీలక పాత్ర పోషించగలననుకున్నారు. కాంగ్రెస్, ఇతర సెక్యులర్ పార్టీల మద్దతుతో ఆయన ఆ పని చేస్తున్నారు కూడా.
మరో వేపున బీజేపీ ఇప్పటికీ బిహార్ లో ఎదురైన ఓటమిని తలుచుకుని చింతిస్తూనే ఉంది. 2014 నుంచి బీజేపీ కొనసాగుతున్న విజయపరంపరలో విఘాతం కలిగింది బిహార్ లోనే. 2019 ఎన్నికలలో బీజేపీ మిత్రపక్షాలతో కలిసి కాని వాటితో నిమిత్తం లేకుండా కాని లోక సభలో మెజారిటీ సాధించాలంటే బిహార్ లో విజయం సాధించడం చాలా కీలకం. నితీశ్ కుమార్ నాయకత్వంలోని జె.డి.(యు), లాలూ నాయకత్వంలోని ఆర్.జె.డి. మధ్య ఉన్న మహా కూటమిని భగ్నం చేస్తే తప్ప విజయం సాధ్యం కాదని బీజేపీకి తెలుసు. లాలూ పార్టీ బిహార్ లో అధికారంలో ఉంటే మళ్లీ బిహార్ లో గూండా రాజ్యం వచ్చేసిందని ప్రచారం చేయడానికి లాలూ మీద అవినీతి ఆరోపణలు చేయడం బీజేపీకి అవసరం. మచ్చలేని పరిపాలన అందిస్తామని వాగ్దానం చేసిన నితీశ్ కుమార్ ను కూడా లాలూ మీద అవినీతి ఆరోపణలు ఇరకాటంలో పడవేస్తాయి. 2014 ఎన్నికలలో నరేంద్ర మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా నిర్ణయించినందుకు నిరసనగా నితీశ్ కుమార్ బీజేపీతో తనకున్న 17 ఏళ్ల బంధాన్ని విడనాడారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా నితీశ్ కుమార్ ను మహా కూటమి నుంచి విడదీయడానికి ప్రయత్నాలు సఫలమైనా నితీశ్ నిర్ణయం తిరగదోడడానికి అలవి కానిది ఏమీ కాదు.
లాలూ ప్రసాద్ దాణా కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలను దిగమింగి నిలబడ్డ కాకలు తీరిన రాజకీయ నాయకుడు. బిహార్ రాజకీయాలలో మరో సారి తన ఆధిపత్యాన్ని రుజువు చేసుకున్న వారు. ఆయన పల్లెటూరి వ్యవహార ధోరణి, నిక్కచ్చితనం, లాఘవం అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి ఉపకరించాయి. అందువల్ల బీజేపీ ఆయన మీద చేస్తున్న దాడి ఆ పార్టీ మీదకే తిరగబడే అవకాశమూ ఉంది. సీబీఐ దాడులు జరిగిన తర్వాత వివిధ మీడియా సంస్థలకు లాలూ ఇచ్చిన ఇంటర్వ్యూలలో తన రాజకీయ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడినా సరే బీజేపీ మతత్వ ఎజెండానూ, మోదీని ఎదిరించి తీరతానని తన ప్రత్యర్థులకు హెచ్చరిక జారీ చేశారు. ఒక వేళ లాలూకు శిక్ష పడితే ఆయన రాజకీయ జీవితానికి తెర పడవచ్చు. కాని ఆయన శతృవులను ఓడించాలంటే 2015లో బిహార్ లో విజయం సాధించిన తర్వాత చెప్పినట్టు మతత్వ వ్యతిరేక పోరాటాన్ని బిహార్ కు మాత్రమే పరిమితం చేయకుండా వీధుల్లోకి ఎక్కించగలగాలి. ప్రతిపక్షాలతో ఐక్యత సాధించి ఈ పని చేయాలి.