హరిత ట్రిబ్యునల్ తో కేంద్రానికి ఇరకాటం
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
రాజకీయ, సామాజిక, ఆర్థిక ప్రయోజనాల కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం తమకు అడ్డు వచ్చే సంస్థలను, వ్యవస్థలను స్వాధీనం చేసుకోవడానికి లేదా వాటిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్న దశలో జాతీయ హరిత ట్రిబ్యునల్ కూడా ఈ జాబితాలో చేరడంలో ఆశ్చర్యం లేదు. 2010నాటి జాతీయ హరిత ట్రిబ్యునల్ చట్టం ప్రకారం ఏర్పడిన పర్యావరణాన్ని పరిరక్షించడం, అటవీ సంరక్షణ, పర్యావరణానికి సంబంధించి న్యాయపరమైన హక్కులను పరిరక్షించడం, పర్యావరణానికి హాని కలిగినందువల్ల నష్టపోయిన వారికి పరిహారం అందేట్టు చూడడం ఈ సంస్థ బాధ్యత. పర్యావరణానికి సంబంధించిన వ్యాజ్యాలను త్వరగా తెమల్చడం కోసం ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులను తిరగదోడే అవకాశం కేవలం సుప్రీం కోర్టుకు మాత్రమే ఉంటుంది. కాని త్వరితంగా అభివృద్ధి సాధించాలనుకుంటున్న ప్రభుత్వానికి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే ఈ ట్రిబ్యునల్ అడ్డంకిగా మారింది.
2014 మేలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ సంస్థ అధికారాలను కుదించాలన్న ఆలోచన ఉన్నట్టు ప్రభుత్వ వర్గాల నుంచి వినిపించింది. ఈ చట్టం పరిధిలో జోక్యం చేసుకోక పోయినా 2017నాటి ఆర్థిక చట్టం ప్రకారం కచ్చితంగా అదే పని చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సంస్థకు ఇతర ట్రిబ్యునళ్లకు వర్తించే నియమాలే అమలవుతున్నాయి. కాని 2017 నాటి ఆర్థిక చట్టం ప్రకారం ఈ ట్రిబ్యునల్ లో సభ్యులుగా ఉండే వారు, వారికి ఉండాల్సిన అర్హతలేమిటి అన్న విషయాలను వర్తింప చేయాలనుకుంటున్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ప్రకారం పదవీ విరమణ చేసిన, లేదా పదవిలో ఉన్న సుప్రీం కోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చైర్మన్ గా ఉండడానికి అవకాశం ఉంది. అంటే న్యాయ వ్యవహారాలలో అనుభవం ఉన్న వ్యక్తిని ట్రిబ్యునల్ చైర్మన్ గా నియమించాలి. కాని కొత్త నిబంధనల ప్రకారం సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడానికి అర్హత ఉన్న వారిని ఎవరినైనా ట్రిబ్యునల్ చైర్మన్ గా నియమించవచ్చు. అంటే పదేళ్ల పాటు హై కోర్టు న్యాయవాదిగా అనుభవం ఉన్న వారు లేదా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులవడానికి అర్హత ఉన్న వారినెవరినైనా ట్రిబ్యునల్ చైర్మన్ గా నియమించవచ్చు. అలాగె ట్రిబ్యునల్ సభ్యులను నియమించే అధికారం సుప్రీం కోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన ఉన్న కమిటీకి మాత్రమే ఉంది. కాని కొత్త నిబంధనల ప్రకారం సభ్యులను నియమించే అధికారం ప్రభుత్వ అధికారులకే ఉంటుంది. ఈ మార్పుల ప్రభావం జాతీయ హరిత ట్రిబ్యునల్ తీసుకునే నిర్ణయాల మీద దీర్ఘ కాలం ఉంటుంది. సీనియర్ న్యాయమూర్తులకు న్యాయ విషయాల్లో ఉండే అనుభవం ఈ ట్రిబ్యునల్ కు ఇక మీదట ఉండదు. స్వతంగ్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉండదు. ఈ ట్రిబ్యునల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల మీద కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వీలూ ఉండదు.
నరేంద్ర మోదీ ఆత్మకు ఇంపైన అంశాల మీద కూడా ఈ ట్రిబ్యునల్ తీసుకున్న నిర్ణయాలను బట్టి చూస్తే ప్రభుత్వం చేసిన మార్పులు ఎంత విషాదకరమైనవో, విపరీతమైనవో అర్థం అవుతుంది. గంగా నది ప్రవహించే ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోని 25 పట్టణాలలో కాలుష్యంపై 1985లో పర్యావరణ పరిరక్షకుడు ఎం.సి. మెహతా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఆధారంగా 1986లో గంగా నది కార్యాచరణ ప్రణాలిక మొదటి దశ ప్రారంభించారు. 1993లో ఈ ప్రణాళిక రెండో దశ ఆరంభమైంది. ఇందులో గంగా నదికి ఉపనదులైన యమున, దామోదర్, మహానదిని కూడా చేర్చారు. ఈ కార్యాచరణ ప్రణాళికలు ప్రారంభమైనా మెహతా దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ కొనసాగుతూనే వచ్చింది. గంగా కార్యాచరణ ప్రణాళిక కూడా పై మెరుగులకు మాత్రమే పరిమితమైంది. 2015లో మోదీ ప్రభుత్వం నమామి గంగే పథకం ప్రారంభించింది. ఈ పథకం కోసం గంగా నదిని శుద్ధి చేయడానికి అయిదేళ్ల కాలానికి భారీగా 20,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఇప్పటికే రూ. 7,000 కోట్లు ఖర్చు పెట్టారు కాని చెప్పుకోదగ్గ ఫలితమేదీ కనిపించడం లేదు.
మెహతా దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ బాధ్యతను సుప్రీం కోర్టు జాతియ హరిత ట్రిబ్యునల్ కు అప్పగించింది. ఆ ట్రిబ్యునల్ జులై 13న వెలువరించిన తీర్పులో గంగా నదిని శుద్ధి చేయడానికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా నాణ్యత రీత్యా మెరుగుదల ఏమీ కనిపించడం లేదని, తీవ్రమైన పర్యావరణ సమస్య మునుపటి లాగే ఉందని చెప్పింది. నదికి రెండు వైపులా 100 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని, 500 మీటర్ల పరిధిలో వ్యర్థాలను గుమ్మరించకూడదని, గంగా నదిలోకి కాలుష్యాలను వదులుతున్న కాన్ పూర్ లోని చర్మ పరిశ్రమలను రెండు వారాలలోగా మరో చోటికి మార్చాలని కూడా జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ చర్మ పరిశ్రమలు దశాబ్దాలుగా గంగా నదిలోకి కాలుష్యాలను వదులుతూనే ఉన్నాయి. ట్రిబ్యునల్ చేసిన ఈ వ్యాఖ్యలు నది ఒక దశకు సంబంధించినవి మాత్రమే. ఈ నది అయిదు రాష్ట్రాల గుండా ప్రవహించి అంతిమంగా బంగాళా ఖాతంలోకి కలిసే అన్ని ప్రాంతాలను పరిశీలించాలని న్యాయస్థానం భావిస్తోంది.
ఈ తీర్పులోని ప్రధానాంశం ఏమిటంటే కోర్టు ఉద్దేశం నిర్దిష్టమైంది. పర్యవేక్షణ బాధ్యత ఆయా రాష్ట్రాలకు వదలకుండా కచ్చితమైన పర్యవేక్షక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. మార్పు కనిపించాలంటే ఈ పనులు చేయాల్సిందేనని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ వ్యవహారాన్ని బట్టి చూస్తే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ కచ్చితంగా అవసరమని తేలుతోంది. ఈ తీర్పు ఆధారంగా మోదీ ప్రభుత్వం స్వతత్రంగా వ్యవహరించే హరిత "న్యాయస్థానం" వల్ల ప్రయోజనం ఉందో లేదో ్బేరీజు వేస్తుందో లేదో చూడాలి.