పని మనుషులపై వివక్ష
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
జులై 12వ తేదీన నోయిడాలోని గేటెడ్ గృహ సముదాయంలో పనిమనుషులకు, వారిని నియమించుకున్న యజమానులకు మధ్య మొదలైన గొడవ సంపూర్ణమైన వర్గ కలహంగా, మరీ ముఖ్యంగా ముస్లిం వ్యతిరేక వివాదంగా మారింది. ఓ మురికి వాడలో ఉండే జోహ్రా బీ అనే పని మనిషి మోహగన్ మాడర్న్ సొసైటీలో రోజంతా పని చేసి సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. పోలీసులు, ప్రభుత్వం ఆమె పట్ల వివక్ష ప్రదర్శించారు. జోహ్రా బీ భర్త రాత్రి హెల్ప్ లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ ఉన్న 2000 ఫ్లాట్లను పోలీసులు మొక్కుబడిగా తనిఖీ చేశారు. మర్నాడు జోహ్రా బీ నివసించే మురికి వాడలోని వారు ఆ గృహ సముదాయంలో గుమిగూడినప్పుడు పోలీసులు సరిగ్గా వ్యవహరించనందువల్ల కలహం లాంటి పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ముందే సరిగా సోదా చేసి ఉంటే సమస్య తీవ్రమయ్యేది కాదు. ఉన్నత వర్గాల వారు ఇలాగే కనిపించని వ్యక్తి గురించి ఫిర్యాదు చేస్తే పోలీసులు ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించే వారా?
కాని అదే పోలీసులు పని మనుషులను కుదుర్చుకున్న వారు, ఆ గృహ సముదాయంలో ఉండే వారు, భవన నిర్మాత ఫిర్యాదు చేసినప్పుడు చక చకా దర్యాప్తు చేశారు. మురికి వాడల్లో ఉండే 13 మందిని అరెస్టు చేశారు. కాని తాను పని చేసే ఇంటి యజమాని కొట్టారని జోహ్రా బీ ఫిర్యాదు చేస్తే మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. అంతకన్నా ఘోరమైంది ఏమిటంటే ఆ ప్రాంత పార్లమెంటు సభ్యుడు, కేంద్ర సాంస్కృతిక సాఖ మంత్రి మహేశ్ శర్మ ఆ గృహసమూదాయంలో నివసించే వారి తప్పేమీ లేదని, అరెస్టయిన మురికి వాడల వాసులకు ఏళ్లు గడిచినా జామీను రాకుండా చేస్తానని ప్రకటించి న్యాయ ప్రక్రియ కొనసాగకుండా చేశారు. ఆయన కేవలం గృహ సముదాయంలో నివాసం ఉండే వారితోనే మాట్లాడారు తప్ప పని మనుషులతో మాట్లాడలేదు. పైగా "ఈ దేశంలో చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోలేరు" అని ప్రకటించారు. కాని ఆయన ప్రాతినిధ్యం వహించే రాజకీయ పక్షం అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయినప్పటి నుంచి ముస్లింల మీద మూకుమ్మడిగా దొమ్మీకి దిగి ముస్లింలను హతమార్చిన సంఘటనలు అనేకం జరిగాయి.
ఆ గృహ సముదాయంలో నివాసం ఉండే వారు, పోలీసులు, ప్రభుత్వం కలిసి పని మనుషులను వేధించి తమ వర్గ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. మురిక వాడకు పక్కన ఉన్న అనేక దుకాణాలను నోయిడా పౌర అధికారులు నేల మట్టం చేశారు. ఆ దుకాణాలన్నీ మురికి వాడల వాసులవే. మురికి వాడల వాసులు ప్రభుత్వ భూమిని ఆక్రమించారన్న అభియోగం మోపారు. ప్రస్తుతం సామాజంలో ఉన్న ముస్లింల వ్యతిరేక పరిస్థితిని ఆసరాగా చేసుకుని ముస్లింలు లేదా ముస్లింలుగా కనిపించే వారిని కేసులు మోపి వేధించడం రివాజైంది. ఈ ముస్లింలు ప్రధానంగా తూర్పు బెంగాల్ నుంచి వచ్చిన వారు. ఆ గృహ సముదాయంలో పని మనుషులుగా ఉన్న 600 మందిలో వీరే ఎక్కువ. వీరు బంగ్లా దేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చారన్న మరో సాకు కూడా వీరిని వేధించడానికి ఉపయోగపడుతోంది. బంగ్లా దేశ్ నుంచి అక్రమంగా వచ్చారన్న కత్తి వారి మెడ మీద నిరంతరం వేలాడుతూనే ఉంటుంది. ఈ సంఘటనలో వాస్తవానికి జరిగింది ఇది: పోలీసులు ఆ మురికి వాడ మీద దాడి చేసి తాము భారతీయులమేనని రుజువు చేసుకోవాలని అన్నారు. ఘర్షణలు జరగక ముందు ఈ అంశం ప్రస్తావనకే రాలేదు.
ఈ సంఘటన లాంటివాటిని దృష్టిలో ఉంచుకుంటే దేశంలోని దాదాపు రెండు కోట్ల మంది పని మనుషుల హక్కులను పరిరక్షించడానికి పార్లమెంటు సమగ్రమైన చట్టం తీసుకు రావాల్సిన అగత్యం ఉంది. అవ్యవస్థీకృత రంగంలో ఉన్న వారిలో ఎక్కువగా ఇబ్బందులు పడే వారు ఇళ్లల్లో పని చేసే వారే. వారు వలస వచ్చిన వారు, మహిళలు కావడమే దీనికి కారణం. వారి కోసం చట్టం చేస్తే వారిని కార్మికులుగా గుర్తించడానికి, ఇళ్లల్లో పని చేయడాన్ని కించపరుస్తూ చూడకుండా ఉండడానికి వీలవుతుంది. అనేక ప్రభుత్వాలు విధానాలు రూపొందించినప్పటికీ అవి చట్టాలు కాలేదు. వారికి వేతనాలు తక్కువ, పని ఎక్కువ, అనేక గంటల పాటు పని చేయాల్సి వస్తుంది. వారు అనేక రకాల ముప్పు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సార్లు ఇంటి యజమానులు వారిని నిర్బంధించడం, కొట్టడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. పని మనుషులు ఇళ్లల్లో పని చేస్తారు కనక వారికి ముప్పు మరింత ఎక్కువ.
దేశంలోని సగం రాష్ట్రాలు పని మనుషులకు కనీస వేతనాల చట్టం వర్తించే పరిధిలోకి తీసుకొచ్చాయి. కాని నోయిడా ఉన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, దిల్లీ, మధ్యప్రదేశ్, మహా రాష్ట్ర వీరిని కనీస వేతనాల చట్టం పరిధిలోకి తీసుకు రాలేదు. కనీస వేతనాల చట్టం పరిధిలో ఉండే వారికి వేతనాలు, పని గంటలు, సెలవు దినాలు మొదలైనవి వర్తిస్తాయి. అయినా ఈ చట్టమూ ఉండాల్సిన రీతిలో లేదు. ఉదాహరణకు పని మనుషులు ప్రభుత్వం దగ్గర నమోదు చేయించుకోవాల్సిన అవసరం లేదు. అలా నమోదు చేయించుకుంటే రెండు పక్షాల వారి వ్యవహారాలను పరిశీలించ వచ్చు. తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారా లేదో చూడవచ్చు. వివాదాలు వస్తే న్యాయపరంగా పరిష్కరించవచ్చు. జాతీయ స్థాయిలో తీసుకు వచ్చే చట్టం వారి భద్రత, ఆరోగ్యం, వారి పిల్లల చదువు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలలో పని మనుషుల సంక్షేమ బోర్డులు ఈ వ్యవహారాలను పట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కాని ఆ సంక్షేమ సంఘాలకు నిధులు అరకొరగా ఉన్నాయి. లాభాపేక్షతో పనిమనుషులను కుదిర్చే కొన్ని సంస్థలు ఏర్పడ్డాయి. వాటిలో కొన్ని బాలలను పని మనుషులుగా వినియోగిస్తున్నారు కనక జాతీయ చట్టం పరిగణనలోకి తీసుకోవాలి.
చట్టాలు కీలకమైనవే. పని చేసే వారి పని పరిస్థితులు మెరుగుపడడానికి ఉపకరిస్తాయి. చట్టాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలంటే పనిమనుషులను వినియోగించేకునే వారు సామాజికంగా, ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్న వారు కనక పకడ్బందీగా వ్యవహరించాలి. నోయిడా సంఘటన దీనికే సంకేతం. గత దశాబ్ద కాలంగా పని మనుషులు వ్యవస్థీకృతులవుతున్నారు. పెద్ద పట్టణాల్లో వారి యూనియన్లు ఏర్పడుతున్నాయి. పనిమనుషులను నియోగించుకునే వారు ఫ్యూడల్ ఆలోచనా ధోరణి ఉన్నవారు గనక ఈ చట్టాలు కూడా సరిపోవు. పనిమనుషులను యజమానులు బానిసలుగా చూస్తారు. ఇద్దరి మధ్య సంబంధాలు చట్టంతో సంబంధం ఉన్నవి కావు. కింది కులాలలో పుట్టిన వారు సేవ చేయాల్సిందేననుకుంటారు. ఈ పరిస్థితి మారాలి.