ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

విధేయంగా ఉండే రాష్ట్రపతేనా?

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

రాష్ట్రపతి పదవికి రాంనాథ్ కోవింద్ ను ఎన్.డి.ఎ. అభ్యర్థిగా నామినేట్ చేయడం ద్వారా అధికారపక్షానికి దళితుల ప్రయోజానాలు కాపడడంలో కపట రాజకీయాలు అనుసరించడానికి అవకాశం కల్గింది. అదే సమయంలో అధికారాన్ని మరింత కేంద్రీకరించడానికి ఉపయోగపడింది. జులై 17న జరగాల్సిన రాష్ట్రపతి ఎన్నిక ఫలితం ఇదివరకే ఖరారైపోయింది. బిజూ జనతా దళ్, జనతా దళ్ (యునైటెడ్), తెలంగాణ రాష్ట్ర సమితి వంటి పార్టీలు కూడా ఎన్.డి.ఎ. అభ్యర్థికి మద్దతు ప్రకటించినందువల్ల రాంనాథ్ కోవింద్ రాష్ట్రపతి కావడం ఖాయం. ఆయనకు మొత్తం నియోజక గణంలో 55 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఎన్.డి.ఎ. చైర్మన్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాంనాథ్ కోవింద్ అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తూ ఆయన పేద దళిత కుటుంబంలో జన్మించారని, కష్టపడి ఎదిగారని చెప్పారు. కోవింద్ ను దళితుడిగా చిత్రించడం వల్ల ప్రతిపక్ష పార్టీలు లోక సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాయి. అంతకు ముందు ప్రతిపక్ష పార్టీలు గోపాల కృష్ణ గాంధీని తమ అభ్యర్థిగా నిలబెట్టాలని అనుకున్నాయి. చివరకు ఇద్దరు దళితుల మధ్య పోటీ ఉండాలన్న కాంగ్రెస్ ప్రతిపాదన ఆమోదయోగ్యమైంది.

రాష్ట్రపతి అభ్యర్థులను నిర్ణయించడానికి అనేక అంశాలు కారణమయ్యాయి. కులాలకు సంబంధించిన అనేక ఘటనలు, హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థి అసహజమైన మరణం, ఉనాలో నలుగురు దళితులపై గో సంరక్షకుల దాడి, షహరాన్ పూర్ లో దళితులపై దాడులు మొదలైన విషయాలలో బీజేపీ క్రియా రాహిత్యం విమర్శలకు గురైంది. ఈ సంఘటనల విషయంలో బీజేపీ వైఖరిని కప్పి పుచ్చుకోవడానికి కోవింద్ ను నామినేట్ చేశారు. ఆయనను నామినేట్ చేయడం వెనక బీజేపీ, సంఘ్ పరివార్ దీర్ఘ కాలిక లక్ష్యాలు కూడా ఉన్నాయి. దళితుల హక్కుల కోసం పోరాడుతున్న అంశాన్ని రాజకీయాలకు అతీతంగా మార్చడం వారిని బ్రాహ్మణీకానికి ప్రాధాన్యం ఇచ్చే ఏకాండీ హిందుత్వలో, కులవ్యవస్థలో భాగం చేయడం, మైనారిటీలకు వ్యతిరేకంగా దళితులను తయారు చేయడం, అంబేద్కర్ వారసత్వాన్ని సొంతం చేసుకోవడం, దళితులు, ఇతర వెనుకబడిన వారిలో చీలకలను వినియోగించుకుని వారు ఇతర పార్టీల దరి చేరకుండా చూడడం మొదలైనవి ఎన్.డి.ఎ. ఎత్తుగడల్లో భాగం.

కోవింద్ ను నామినేట్ చేయడం వల్ల ప్రతిపక్షాలలో చీలికలు బయట పడ్డాయి. కోవింద్ ను నామినేట్ చేసిన తర్వాత ప్రతిపక్షాలు సరైన వ్యూహం అనుసరించలేకపోయాయని రుజువైంది.

కోవింద్ ను నామినేట్ చేయడం అస్తిత్వ రాజకీయాల్లో భాగమని చాలా మంది వ్యాఖ్యానించారు. కాని కోవింద్ విజయం వెనక ఉన్న దీర్ఘ కాలిక ప్రభావాన్ని కూడా గమనంలోకి తీసుకోవాలి.

1977లో జనతా పార్టీ విజయం సాధించిన తర్వాత కోవింద్ అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయికి పర్సనల్ సెక్రెటరీగా పని చేశారు. 1980లో ఇందిరా గాంధీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టులో స్టాండింగ్ కౌన్సెల్ గా నియమించారు. 1991లో బీజేపీలో చేరిన తర్వాత ఆయన ఉత్తరప్రదేశ్ బీజేపీ సంయుక్త కార్యదర్శిగా, షెడ్యూల్డ్ కులాల మోర్చా అధిపతిగా, జాతీయ ప్రతినిధిగా ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించారు. 1991లో ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి లోక సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు ఉత్తరప్రదేశ్ లో ఠాకూర్లతో పొసిగేది కాదంటారు. 1994-2006 మధ్య ఆయనను బీజేపీ రెండు విడతలు రాజ్య సభ సభ్యుడిని చేసింది. ఆ సమయంలో ఆయన అనేక పార్లమెంటరీ కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు. అటల్ బిహారీ వాజపేయి హయాంలో కోవింద్ ఐక్య రాజ్య సమితిలో భారత ప్రతినిధిగా వ్యవహరించారు. 2015లో ఆయనను బిహార్ గవర్నరుగా నియమించారు.

మన దేశంలో అనేక రకాల వారు రాష్ట్రపతులయ్యారు. ఫక్రుద్దీన్ అలీ అహమద్ ఎమర్జెన్సీ విధించాలన్న ఇందిరా గాంధీ ప్రతిపాదనను అంగీకరించి రాజ్యాంగం అమలును తాత్కాలికంగా సస్పెండు చేశారు. జ్ఞానీ జైల్ సింగ్ ను మొదట విధేయుడైన రాష్ట్రపతి అనుకున్నారు. కాని అనేక సార్లు ఆయన రాజీవ్ గాంధీని ప్రతిఘటించారు. ప్రభుత్వం ఇతరుల మీద నిఘా వేసినప్పుడు ప్రధాని రాజీవ్ గాంధీని బర్తరఫ్ చేస్తానని కూడా బెదిరించారు. ఇటీవలి కాలంలోనే కె.ఆర్. నారాయణన్ భారత వైఫల్యాల గురించి మాట్లాడారు. రాజ్యాంగ రచనకు అంబేద్కర్ కృషిని ప్రస్తుతించారు. వాజపేయి ప్రభుత్వ అభిప్రాయాలతో చాలా సార్లు విభేదించారు. గత రాష్ట్రపతి ప్రతిభా సింగ్ పాటిల్, ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రభుత్వంతో ఘర్షణ పడలేదు. అయితే వారి పని తీరు, రాజకీయ నేపథ్యం భిన్నమైనవి. ప్రణబ్ ముఖర్జీ అనేక సార్లు సెక్యులరిజం, స్వేచ్ఛ గురించి వ్యాఖ్యానించినా ప్రభుత్వం వివాదాస్పదమైన ఆర్డినెన్సులు జారీ చేసినా వాటిని ఆమోదించారు. భూ సేకరణకు సంబంధించిన ఆర్డినెన్సు అందులో ప్రధానమైంది.

అయితే కోవింద్ అధికారంలో ఉన్న వారి ప్రయోజనాలను గుడ్డిగా పరిరక్షిస్తారా? దీనికి కాలమే సమాధానం చెప్తుంది. కాని ఆయన అభిప్రాయాలు, అధికారంలో ఉన్న వారి అభిప్రాయాలు భిన్నమైనవి కావు. ప్రపంచంలోకెల్లా అత్యంత విశాలమైన, 320 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న, 340 గదులతో కూడిన రాష్ట్రపతి భవన్ లో నివాసం ఉండబోయే కోవింద్ ఎలా వ్యవహరిస్తారో చూడాలి. ఇంతవరకు ఆయన సరళి దూకుడుగా వ్యవహరించేదిగా లేదు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఎక్కువ విలువ ఇచ్చేదేమీ కాదు. అందువల్ల విశ్వాసపాత్రంగా, విధేయంగా ఉండే అభ్యర్థిని ప్రధానమంత్రి ఎంపిక చేయడం ఆశ్చర్యకరమైంది ఏమీ కాదు. ఇటీవ ప్రభుత్వం చేసిన నియామకాలు అన్నీ ఇలాంటివే.

కోవింద్ ఎలాంటి రాష్ట్రపతిగా ఉండబోతున్నారు? ఎన్నికల ప్రచార సమయంలో రాజ్యాంగం మీద ఆయన చేసిన వ్యాఖ్యలు గమనించదగినవి. "రాష్ట్రపతికి రాజ్యాంగం సర్వోన్నతమైంది. అదే భగవద్గీత, రామాయణం, ఖురాన్, బైబిల్" అని ఆయన అన్నారు. ఆయన మతగ్రంథాలను ప్రస్తావించడం ఆందోళన కల్గించేదే. రాజ్యాంగం దైవదత్తమైంది కాదు. అది నైతికత, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, మానవహక్కులు మొదలైన సూత్రాల ఆధారంగా రూపొందింది. రిపబ్లికన్ ప్రజాస్వామ్యంలో ఈ సూత్రాలను నిరంతరం అనుసరిస్తుంటాం, వ్యక్తం చేస్తుంటాం. రాజ్యాంగం పాత్రపై కోవింద్ అభిప్రాయాలు ప్రజాస్వామ్యంలో మెజారిటీ తత్వాన్ని సమర్థిస్తాయా? కోవింద్ ఇంతవరకు వ్యవహరించిన తీరు గమనిస్తే ఆయన కేంద్రీకరణను, ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులను ప్రతిఘటిస్తారని చెప్పలేం. 

Updated On : 13th Nov, 2017
Back to Top