ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

విమర్శకుల నోటికి తాళాలు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

పాలకులందరికీ తమ చుట్టూ వందిమాగధులు ఉంటే ఇష్టం. దీనివల్ల వారికి పరిపాలించడం సులభమవుతుంది. చేయాల్సిందల్లా పై నుంచి నిర్ణయాలు ప్రకటించడమే. అనుచరులు భజనకీర్తనలు ఆలాపిస్తారు. అవివేకులు మాత్రమే ప్రశ్నలు అడుగుతారు. ఇంకా ముందుకెళ్తే విమర్శిస్తారు. ఒక వేళ విమర్శిస్తే దాని పరిణామాలు ఏమిటో కూడా వారికి తెలుసు. ఇది మహాద్భుతంగా కనిపిస్తుంది. కాని భారత ప్రజాస్వామ్యం ఈ ఊహాలోకం వేపే వెళ్తోంది. మూడేళ్లుగా అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం అంతవరకు సచేతనంగా ఉన్న మీడియాను, చిన్న చిన్న బెదిరింపులకు దిగే టీవీ మీడియాను కూడా నాయకుడి కీర్తిగానం చేసేట్టుగా మార్చేసింది. అంతో ఇంతో మిగిలి ఉన్న ప్రతిపక్షాలను వేపుకుని తింటోంది.

ఈ పరిస్థితిలోనే లోపాలు ఎన్ని ఉన్నప్పటికీ ఎన్.డి.టి.వి. ఇప్పటికీ భిన్నంగా ఉంది. ఎన్.డి.టి.వి. వ్యవస్థాపకులు, యజమానులు అయిన ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ ఇంటి మీద కేంద్ర నేర పరిశోధనా సంస్థ (సీబీఐ) జూన్ అయిదున దాడి చేయడం పత్రికా స్వేచ్ఛ మీద నేరుగా దాడి అవునా కాదా అన్న విషయంలో చర్చ చాలానే జరిగింది. ఎన్.డి.టి.వి. ఆర్థిక వ్యవహారాలపై 2009 నుంచి దర్యాప్తు జరుగుతోంది. కాని ఒక ప్రైవేటు బ్యాంకుతో ఎన్.డి.టి.వి. నడిపిన వ్యవహారాలపై ఒక ప్రైవేటు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ దాడి చేయడం మాత్రం చాలా అసాధారణమైంది. ఈ దాడులు చేయడానికి ఎంచుకున్న సమయం, దాడి ఎవరి మీదో అన్న విషయాన్ని బట్టి ఈ దాడి ఉద్దేశం ఏమిటో అన్న ప్రశ్నలు బయలుదేరాయి.

ప్రత్యర్థుల, మీడియా సంస్థల నోరు మూయించడానికి గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా సీబీఐని వినియోగించుకున్న మాట వాస్తవం. కాని ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక పద్ధతి అనుసరిస్తోంది. ప్రత్యర్థుల ఆర్థిక దుష్ప్రవర్తన మీద దృష్టి సారించి రెండు ప్రయోజనాలు సాధించాలని చూస్తోంది. ఒకటి ప్రత్యర్థులు ప్రతిపక్ష నాయకులైనా, మానవ హక్కుల కార్యకర్తలు అయినా, స్వచ్ఛంద సంస్థ అయినా, మీడియా సంస్థ అయినా అపఖ్యాతి పాలు చేయడం; రెండు అదే సమయంలో తమ మీద కూడా ఇలాంటి దాడులే జరుగుతాయన్న భయం ఇతరులలో కల్పించడం. తాము పత్రికా స్వేచ్ఛకు కట్టుబడి ఉంటాం అని చిలకపలుకులు వల్లిస్తూనే మీడియా సంస్థల యజమానుల మీద డాడి చేస్తూ తమకు కావాల్సిందల్లా ఆర్థిక వ్యవహారాలలో నిజాయితీ మాత్రమే అని చెప్పి అపఖ్యాతి పాలు చేయడం చాలా సులభం. ప్రభుత్వాన్ని విమర్శించే మీడియాను నమ్మలేమని, మీడియా అసత్య ప్రచారం చేస్తుందని జనాన్ని ముందే నమ్మిస్తారు కనక ప్రభుత్వ దాడులను ప్రజలు సమర్థిస్తారు. లేదా దాడి జరగడానికి కొద్ది రోజుల ముందు బీజేపీ అధికార ప్రతినిధి లాగా ఎన్.డి.టి.వి. కి 'ఎజెండా' ఉంది అని ముద్ర వేస్తారు.

మీడియా కార్పొరేటు యజమానుల మీద ఒత్తిడి తీసుకురావడంతో పాటు ఈ ప్రభుత్వం వ్యక్తిగతంగా పత్రికా రచయితలలో కూడా భయం పుట్టించ గలిగింది. దాడి జరిగిన మరుసటి రోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఎన్.డి.టి.వి. కి చెందిన రవీశ్ కుమార్ దేశ రాజధానిలో, ఇతర చోట్ల  పత్రికా రచయితలు తమను ఓ కంట కనిపెడ్తున్నారన్న భయంతో ఉన్నారని చెప్పారు. ఒక వేళ పత్రికా రచయితలు విమర్శలకు దిగితే పత్రికా రచయితలకు సమాచారం అందించే వారు, ఆధారాలు అందించే వారు చాలా ముఖ్యం కనక ప్రభుత్వ అధికారులలో కూడా భయం కల్గించి సమాచారం అందకుండా చేస్తారు. దేశ రాజధానిలోనూ, కొన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ ఇదే జరుగుతోంది. మీడియా నోరు ఇలా నొక్కేయడం సెన్సార్షిప్ విధించినంత సమర్థంగా పని చేస్తుంది.

పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఎన్.డి.టి.వి.  మీద ప్రభుత్వం దాడికి దిగడం వల్ల భారీ స్థాయిలో నిరసన వ్యక్తం అవుతుందని అనుకుంటాం. కాని ఈ ప్రభుత్వ ఎజెండా ఏమిటో తెలిసినా పత్రికా రచయితలలో ఈ సందర్భంలో సంఘీభావం అంతగా కనిపించలేదు. కొన్ని మీడియా సంస్థలను మినహాయిస్తే మీడియా సంస్థలు ఎన్.డి.టి.వి.కి అండగా నిలబడలేదు. తమ మీద కూడా ఇలాంటి దాడులే జరుగుతాయన్న భయం ఆ సంస్థల్లో ఉంది. ఎడిటర్స్ గిల్డ్ లాంటి వ్యవస్థలు ఎన్.డి.టి.వి. ని సమర్థించాయి. అంతకు మించి ఏమీ లేదు. ఇతర మీడియా సంస్థల మీద ఇలాంటి దాడులే జరిగినప్పుడు ఎన్.డి.టి.వి. వాటికి అండగా నిలబడలేదు కనక మీడియాకు వెలుపల ఉన్న వారు కూడా బాహాటంగా ఎన్.డి.టి.వి. కి మద్దతు ఇవ్వడానికి వెనుకాడుతున్నారు. అదీగాక పెద్ద మెట్రో నగరాల్లో మీడియా సంస్థల మీద దాడి జరిగితే అది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది కాని కశ్మీర్, ఈశాన్య ప్రాంతాల లాంటి చోట, మారుమూల ప్రాంతాలలో  చిన్న పత్రికల మీద, కాలిక పత్రికల మీద దాడి జరిగితే పట్టించుకునే వారే ఉండరు అన్న విషయాన్ని కూడా గ్రహిస్తున్నారు. అలాంటి మీడియా సంస్థల మీద ప్రభుత్వం ఏరికోరి గురి చూసి దాడి చేస్తోంది. శక్తిమంతులైన వారి దుర్నీతిపై పరిశోధన చేసే వారి మీద దాడులు జరుగుతున్నాయి. వారు హత్యలకు గురవుతున్నారు కూడా. మన దేశంలో మీడియా చీలికలు వాలికలై ఉంది. ఈ కారణంగానే అధికారంలో ఉన్న వారు మీడియాను చీల్చి ప్రభుత్వం తరఫున ప్రచారం చేసేట్టుగా చేయగలుగుతారు.

ఎన్.డి.టి.వి. మీద సీబీఐ దాడి జరిగిన తర్వాత కొంత మంది ఈ పరిస్థితిని 1975లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించి, సెన్సార్షిప్ అమలు చేసిన రోజులతో పోల్చారు. ఇప్పటి పరిస్థితి భిన్నమైంది అయినా బీజేపీ ఎమర్జెన్సీ రోజుల నాటి పరిస్థితి నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. సెన్సార్షిప్ విధించినందుకు ఇందిరాగాంధీ రాజకీయంగా మూల్యం చెల్లించారు. సెన్సార్షిప్ కు గురైన మీడియాను ఇందిర నమ్మారు. తన విధానాల వల్ల పేదలకు కలిగిన నష్టాన్ని తెలుసుకోలేకపోయేంతటి అంధురాలిగా మారారు. మార్చి 1977లో జరిగే ఎన్నికలలో మీరే విజయం సాధిస్తారని గూఢచార శాఖ వారు చెప్పిన సమాచారాన్ని కూడా నమ్మారు. ఎందుకంటే ప్రజలు ఆమె విధానాలను ఆమోదించారనుకున్నారు. ఆ ఎన్నికలలో ఇందిరాగాంధీ ఘోరంగా ఓడిపోయారు. పేదలు ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేశారు. వైపరీత్యం ఏమిటంటే ఇందిరాగాంధీ ఓటమి పుణ్యమా అని బీజేపీకి (అప్పుడు భారతీయ జన సంఘ్) జనతా పార్టీలో భాగస్వామిగా కేంద్రంలో కాలు మోపడానికి అవకాశం వచ్చింది.

ఒక్కో సారి చరిత్ర పునరావృతం అవుతుంది. ఇందిరా గాంధీ లాగే తమ కుచ్చికుక్క లాంటి మీడియా చెప్పే విషయాలను బీజేపీ నమ్ముతోంది. తమను వ్యతిరేకించే వారిని ఇందిరాగాంధీలాగే అణచివేస్తోంది. చరిత్రను గమనిస్తే ఇలాంటి ధోరణికి రాజకీయ మూల్యం చెల్లించవలసి వస్తుంది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలోనే రైతుల ఉద్యమ తీవ్రత చూస్తే బీజేపీ అన్నట్టల్లా ఆడే మీడియా పాలకులను గుడ్డివాళ్లను చేసే సమాచారం అందిస్తున్నట్టుంది.

 

 

Updated On : 13th Nov, 2017
Back to Top