బొగ్గు కుంభకోణం గుణపాఠాలు
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
బొగ్గు క్షేత్రాల అక్రమ కేటాయింపుల కుంభకోణంలో బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి హరీశ్ చంద్ర గుప్తాకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి భారత్ పరాశర్ మే 23న వెలువరించిన తీర్పు అధికార వర్గాలలో కలకలం రేపుతోంది. ఒక ప్రైవేటు సంస్థకు అక్రమంగా బొగ్గు క్షేత్రాలు కేటాయించినందుకు ఆయనకు ఈ శిక్ష విధించారు. సీబీఐ దాఖలు చేసిన కేసులను విచారించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం ఈ శిక్ష విధించడాన్ని ఐ.ఎ.ఎస్. అధికారుల సంఘం తీవ్రంగా విమర్శించింది. గుప్తా నిజాయితీపరుడైన అధికారి అయినప్పటికీ ప్రభుత్వ తప్పుడు విధానాల కారణంగా ఆయనకు శిక్ష విధించారని ఈ సంఘం అభిప్రాయపడింది.
ఈ ఉదంతం దేశంలో చట్టం ఎలా అమలు అవుతోందన్న విషయంలో రెండు ముఖ్యమైన అంశాలను ఎత్తి చూపుతోంది. మొదటిది చట్ట వ్యవహారాలలో ఉన్న అస్పష్టత కారణంగా విచక్షణాధికారాలను దుర్వినియోగం చేయడానికి సంబంధించింది. రెండవది "బొగ్గు కుంభకోణం"లో న్యాయ ప్రక్రియ ఎలా కొనసాగిందనడానికి సంబంధించింది. 1993 నుంచి 214 బొగ్గు క్షత్రాల కేటాయింపు అక్రమమైందని సుప్రీం కోర్టు తీర్పు చెప్పి ఈ కేటాయింపులను రద్దు చేసింది. అయితే అధికారుల మీద పెత్తనం చెలాయించే రాజకీయ నాయకులను న్యాయస్థానం ఎందుకు దోషులుగా పరిగణించలేదనేది అసలు సమస్య. వీరు ఖజానాను దోపిడీ చేశారు కనక వీరూ జైలు శిక్ష అనుభవించవలసిన వారే. ఉన్నతాధికారులు, వ్యాపారస్థులు కూడా రాజకీయ నాయకులతో కలిసే పని చేస్తారు కనక ఈ కేసులను దర్యాప్తు చేసిన సీబీఐ ప్రభుత్వాధికారులతో పాటు వీరి మీదా సమాన స్థాయిలో దర్యాప్తు చేసిందా లేదా అనేది మరో ప్రశ్న.
బొగ్గు క్షేత్రాల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న వ్యవహారం 2012 లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక అందజేసి అభిశంసించక ముందునుంచే తెలిసిన వ్యవహారమే. ఈ అక్రమ కేటాయింపుల వల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ. 1, 86,000 కోట్ల మేర నష్టం కలగడానికి అవకాశం ఉందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణం. ఈ కుంభకోణం జరిగిన సమయంలో ఎక్కువ కాలం బొగ్గు శాఖ కూడా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింఘ్ అధ్వర్యంలోనే ఉండేది. బొగ్గు క్షేత్రాల కేటాయింపునకు వేలం పద్ధతి అనుసరించాలని నిర్ణయించడానికి ఎనిమిదేళ్లు పట్టిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఆ లోగా ప్రభుత్వ ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఏ సంస్థకు బొగ్గు క్షేత్రాలు కేటాయించాలన్న విషయం నిర్ణయించేది. ఈ కమిటీలు దాపరికంతోనూ, వివక్షా పూరితంగానూ పని చేసేవి అన్న విషయం కూడా తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఈ పద్ధతి చట్ట విరుద్ధమైంది కూడా. 2008లో ఉద్యోగ విరమణ చేసే దాకా అంతకు ముందు రెండేళ్లు గుప్తా ఈ కమిటీకి అధిపతిగా ఉండే వారు. ఈ రెండేళ్ల కాలంలో కనీసం 40 బొగ్గు క్షేత్రాలు కేటాయించారు. ఆయనకు శిక్ష పడిన కేసులో కాకుండా మరో పది కేసులలో ఆయన మీద విచారణ జరుగుతోంది. ఆయనకు శిక్ష పడ్డ కేసు మధ్యప్రదేశ్ లోని కమల్ స్పాంజ్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (కె.ఎస్.ఎస్.పి.ఎల్.) కు సంబంధించింది. ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ కుమార్ అహ్లూవాలియా కు కూడా శిక్ష పడింది. బొగ్గు మంత్రిత్వ శాఖలో మరో ఇద్దరు ఉన్నతాధికారులు కె.ఎస్. క్రోఫా, కె.సి.సమీరా కు కూడా శిక్ష పడింది.
బొగ్గు కుంభకోణంపై దర్యాప్తునకు సంబంధించి చట్టాన్ని అమలు చేసే విభాగం ఎలా వివక్షాపూరితంగా వ్యవహరించిందో చూడడానికి ముందు 1988నాటి అవినీతి నిరోధక చట్టం లోని 13(1)(డి)(III) సెక్షన్ ఎంత అస్పష్టంగా ఉందో గమనించాలి. ఈ సెక్షన్ ప్రకారం "ఏ ప్రభుత్వాధికారి అయినా ఏ ప్రజాప్రయోజనం లేకుండా లబ్ధి పొందితే" దోషి కిందే లెక్క. అంటే సీబీఐ కాని, మరే దర్యాప్తు సంస్థ గాని ఇందులో "నేరపూరిత ఉద్దేశం" గాని, నీకు ఇది నాకు ఇది అనే రీతిలో ప్రయోజనం పొందడానికి అక్రమానికి పాల్పడ్డారని తేల్చవలసిన అగత్యం లేదు. ఈ అంశంతో నిమిత్తం లేకుండానే ప్రభుత్వ అధికారిని చట్టం ప్రకారం విచారించి శిక్ష విధించ వచ్చు. ఈ సెక్షన్ ను రద్దు చేసే విషయాన్ని ప్రస్తుతం పార్లమెంటరీ కమిటీ పరిశీలిస్తోంది. గుప్తా, ఇతర ఐ.ఎ.ఎస్. అధికారుల వాదన ఏమిటంటే మహా అయితే కె.ఎస్.ఎస్.పి.ఎల్. కు బొగ్గు క్షేత్రాలు కేటాయించడంలో "పొరపాటు" జరిగి ఉండవచ్చు. దీనిలో నేరపూరిత ఉద్దేశం కాని, స్వలాభాపేక్ష గాని లేవు అన్నది వీరి వాదన. కాని గుప్తా అప్పటి బొగ్గు శాఖ మంత్రికి, ప్రధానమంత్రికి తెలియకుండా "తుది నిర్ణయం" తీసుకున్నారని న్యాయమూర్తి పరాశర్ తేల్చారు. ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో మాత్రమే అప్పీలు చేసుకునే అవకాశం ఉంది.
ఈ కేసులో సీబీఐ కాని, న్యాయవ్యవస్థ గాని రాజకీయ నాయకుల పాత్రను ఎందుకు పట్టించుకోలేదు అన్నదే అసలు ప్రశ్న. బొగ్గు కుంభకోణంలో బొగ్గు శాఖ సహాయ మంత్రులుగా పని చేసిన సంతోశ్ బగ్రోడియా, దాసరి నారాయణ రావుతో పాటు మూడు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు విజయ దర్దా కూడా ఉన్నారు. ఆయన లోక్ మత్ మీడియా సంస్థ అధినేత. ఆయన సోదరుడు రాజేంద్ర దర్దా మహారాష్ట్రలో విద్యా శాఖ మాజీ మంత్రి. ఇందులో మరింత ఘోరమైన వ్యవహారం పార్లమెంటులో కాంగ్రెస్ సభ్యుడు, పారిశ్రామికవేత్త అయిన నవీన్ జిండాల్ కు సంబంధించింది. బొగ్గు క్షేత్రాల కుంభకోణంలో ఎక్కువగా లబ్ధి పొందింది ఆయన అధీనంలోని కార్పొరేట్ సంస్థే. ఆయన దాసరి నారాయణ రావుకు లంచం ఇచ్చి బొగ్గు క్షేత్రాలు సంపాదించారన్న అభియోగం ఉంది. అంతే కాక ఈ కుంభకోణంతో ఇంకా అనేక మంది కాంగ్రెస్ నాయకులకు, బీజేపీ నాయకులకు, ఆ పార్టీలకు సన్నిహితంగా ఉండే పారిశ్రామికవేత్తలకు కూడా సంబంధం ఉంది. బొగ్గు కుంభకోణంతో సంబంధం ఉన్న వ్యక్తులను ప్రైవేటుగా కలుసుకున్నారన్న ఆరోపణతో సీబీఐ ఏప్రిల్ 25న సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా మీద కేసు నమోదు చేసింది. ఆయన దర్యాప్తు జరగకుండా చేశారని, అడ్డు తగిలారని ఆరోపణలున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం సీబీఐని ఉపయోగించుకుని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం, ఆయన కుమారుడు కార్తీకి చెందిన ఆవరణలపై దాడులు నిర్వహిస్తోందని, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీద దాడులు చేయిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో న్యాయ వ్యవస్థ, చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలు సమన్యాయం పాటించవలసిన అవసరం ఉంది. దేశంలో అతి పెద్ద కుంభకోణంలో శక్తిమంతమైన నాయకుల మీద చర్య తీసుకునేటప్పుడు పక్షపాత రహితంగా వ్యవహరించవలసిన అగత్యం ఉంది. అలా జరుగుతోందనడానికి ఇప్పటి వరకు దాఖలాలైతే లేవు.