ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

తీరం చేరని నక్సల్బరీ ఉద్యమం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణచి వేయడానికి 1948లో భారత ప్రభుత్వం సేనలను పంపడంతో కేంద్ర ప్రభుత్వం తన అసలు రంగు బయట పెట్టింది.  తెలంగాణాలో అర్థ ఫ్యూడల్ వ్యవస్థను కమ్యూనిస్టుల నాయకత్వంలో సాయుధ రైతాంగం అంతమొందించడాన్ని భారత ప్రభుత్వం అడ్డుకుంది. నిజానికి భారత సేనలు గ్రామీణ ప్రాంతంలో ఫ్యూడల్ వ్యవస్థను పునరుద్ధరించడానికి చురుకుగా పని చేశాయి. అప్పటి నుంచి భారత్ లో కోట్లాది మంది ప్రజలు పెట్టుబడిదారీ విధానం అనుసరించే నిర్హేతుకత, కిరాతక, అమానవీయ విధానాలకు బలి అవుతూనే ఉన్నారు. అందువల్ల విప్లవాత్మకమైన మార్పు అవసరం ఉంది అని నక్సలైట్లు (మావోయిస్టులు) 50 ఏళ్ల నుంచి నినదించడంలో ఆశ్చర్యం లేదు.

సరిగ్గా యాభై ఏళ్ల కింద భారత కమ్యూనిస్టు పార్టీలోని ఒక చీలిక వర్గం ఉత్తర బెంగాల్ లోని నక్సల్బరీలో సాయుధ పోరాటం ప్రారంభించింది. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిపోయి ఏర్పడిన సీపీఐ(ఎం) నుంచి చీలిన వర్గం సాయుధ పోరాటం ప్రారంభించింది. ఈ పోరాటం 1967లో మార్చిలో ప్రారంభం అయింది. ఈ ఉద్యమాన్ని జులైలో అణచి వేశారు. ఆ తర్వాత ఈ పోరాటానికి నాయకత్వం వహించిన చారూ మజుందార్ సీపీఐ (మార్క్సిస్టు-లెనినిస్టు) అనే కొత్త పార్టీకి కార్యదర్శి అయ్యారు. "దేశంలో వందలాది నక్సల్బరీలు కుతకుత ఉడుకుతున్నాయి. నక్సలైట్ ఉద్యమం చల్లార లేదు. అది చల్లారదు" అన్నారు మజుందార్. ఆ తర్వాతి పరిణామాలను చూస్తే ఆయన అన్న మాటలు పగటి కలలు కావని రుజువైంది. వలస పాలన సమయంలో సాయుధ పోరాటం, ఆ తర్వాత ప్రజల ఆకాంక్షలు ఉద్యమానికి కొత్త గతి సమకూర్చాయి. 1968 నుంచి 1972 దాకా అనేక నక్సల్బరీలు వివిధ ప్రాంతాలలో పెల్లుబికాయి. అందులో ప్రధానమైంది ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో, బిహార్ లోని భోజ్ పూర్ లో చెలరేగిన ఉద్యమాలు ప్రధానమైనవి. కాని ఈ రెండు ఉద్యమాలను కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కిరాతకంగా అణచి వేశాయి. 

కాని ఆ పోరాటం మీద నమ్మకం, అభిమానం, ఆశ, భావోద్వేగం కారణంగా విప్లవకారులు ప్రాణాలకు తెగించి పోరాడారు. పేదల మీద అపారమైన అన్యాయాలు, అవమానాలు జరుగుతూ ఉంటే కిమ్మనకుండా ఉండడానికి ఈ విప్లవకారులు అంగీకరించలేదు. ప్రాణాలు రక్షించుకోవాలన్న ఆలోచనను వదిలేశారు. 1960లు, 1970లలో విప్లవకారులు అపజయం పాలైనప్పటికీ విప్లవానికి కారణమైన పరిస్థితులు అలాగే కొనసాగాయి. కొత్త తరాల వారు ఆధిపత్యం చెలాయించారు, దోపిడీ చేశారు, అణచి వేశారు. మళ్లీ విప్లవం రగుల్కోవడానికి కావాల్సిన పరిస్థితులు సృష్టించారు. అందుకే మేధావులు మిన్నకుండలేక పోయారు. మరణించిన వారి స్థానంలో వీరు ఆయుధాలు చేపట్టారు.

1977 నుంచి 2003 దాకా సాగిన నక్సలైట్ ఉద్యమం రెండో దశలో ప్రజా సంఘాలు, ప్రజోద్యమాలు బాగా పెరిగాయి. ఈ ప్రభావం ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కనిపించింది. ఆ తర్వాత మధ్య బిహార్ లో (ప్రస్తుతం జార్ఖండ్) కనిపించింది. ఇంకా దండకారణ్యం అనే ప్రాంతంలో కనిపించింది. దండకారణ్యం అంటే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా సరిహద్దులను ఆనుకుని ఉన్న గిరిజన ప్రాంతం. అలాగే ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ ప్రాంతం కూడా ఉద్యమానికి కేంద్రం అయింది. ఆత్మ రక్షణ కోసం గ్రామ స్థాయి మిలిటెంట్ దళాలను, సాయుధ దళాలను ఏర్పాటు చేశారు. "దున్నే వాడిదే భూమి", "అటవీ ప్రాంత వాసులకు పూర్తి హక్కులు" అన్నవి ప్రధానాంశాలు అయినాయి.

ఈ ఉద్యమం విస్తరించేకొద్దీ భారత రాజ్య వ్యవస్థ పూర్తి స్థాయిలో ఈ విద్రోహ వ్యతిరేక చర్యల అణచివేతకు స్వీకారం చుట్టింది. నక్సలైట్ పార్టీలో ముఖ్యమైన నాయకులు, ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రాంతంలోని ముఖ్యమైన నాయకులను అంతమొందించింది. దీనికోసం సకల నియమాలను తుంగలో తొక్కింది. నూతన సహస్రాబ్ది ఆరంభం అయ్యే నాటికి ఉద్యమాన్ని లొంగ దీయడం మరింత క్లిష్టమైంది. నక్సలైట్లు ప్రజా గెరిల్లా దళాలు ఏర్పాటు చేశారు. ఉద్యమం అణచివేయలేని, బలమైన శక్తిగా తయారైంది. "దీర్ఘకాలిక ప్రజాయుద్ధం కొనసాగించడానికి" నిబద్ధమై ఉన్న మావోయిస్టు పార్టీలు 1998లో 2004లో ఏకం అయినాయి. 2004 తర్వాత మూడవ దశలో బస్తర్ ప్రాంతం మావోయిస్టు ప్రతిఘటనోద్యమాలకు కంచుకోటగా తయారైంది. దండకారణ్య ఆదివాసి కిసాన్ మజ్దూర్ సంఘటన, క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘటన, క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘ్, భూంకల్ మిలీషియా (ఈ పేరు 1910నాటి గిరిజనుల తిరుగుబాటుతో వచ్చింది) వంటి సంస్థలు అవతరించాయి. ప్రజా విమోచన గెరిల్లా సైన్యం ఏర్పడింది. అయిదు దశాబ్దాల కాలంగా విప్లవ సమీకరణ ఎలా కొనసాగింది అన్నది ప్రధానమైన ప్రశ్న. జార్ఖండ్ గెరిల్లా ప్రాంతంలో మానవజాతి శాస్త్ర పరిశోధన చేసిన అల్పా షా గిరిజనులకు, మావోయిస్టు సంస్థకు మధ్య "సన్నిహిత సంబంధాలు" ఏర్పడడమే దీనికి కారణం అని నిర్ధారించారు. పోరాటం కొనసాగుతున్న ప్రాంతాలలో గిరిజనులతో సంబంధాలు ఏర్పాటు చేయడం, అభివృద్ధి క్రమాన్ని అర్థం చేసుకోవడం, నిరంతరం విప్లవ మార్గంలో జనసమీకరణ కొనసాగడం ఇంతకాలంగా ఉద్యమం కొనసాగడానికి కారణం. సామాన్య ప్రజలను, ముఖ్యంగా కింది కులాల వారిని, గిరిజనులను గౌరవంగా, మర్యాదగా, సమానిలుగా భావించారు.

అయితే మావోయిస్టు ఉద్యమం గమ్యం ఏమిటి? భారత రాజ్య వ్యవస్థ మావోయిస్టులకు ప్రజలతో ఉన్న సన్నిహిత సంబంధాన్ని తెగ్గొట్టాలని ప్రయత్నిస్తోంది. అందుకోసం సక్రమ, అక్రమ పద్ధతులలో ఉద్యమాన్ని అణచడానికి సకల విధాలుగా ప్రయత్నిస్తోంది. జెనీవా ఒప్పందంలోని మూడవ అధికరణాన్ని, అంతర్జాతీయేతర ఘర్షణలకు సంబంధించిన నియమాలను కూడా బాహాటంగా ఉల్లంఘిస్తోంది. మరో వేపున మావోయిస్టు ఉద్యమం భారత రాజ్యవ్యవస్థను పడదోయాలని చూస్తోంది. దీని కోసం దీర్ఘకాలిక సాయుధ పోరాటం, ప్రజా సమీకరణ, అణగారిన జాతులతో వ్యూహాత్మక సంబంధాలు మొదలైన విభిన్నమైన పద్ధతులు అనుసరిస్తోంది. కాని ప్రస్తుత పరిస్థితిలో భారత రాజ్యవ్యవస్థ పెట్టుకున్న లక్ష్యం కాని, మావోయిస్టుల లక్ష్యం కాని నెరవేరే పరిస్థితి ప్రస్తుత దశలో లేదు.

ప్రపంచంలోని వర్ధమాన దేశాలలో అత్యంత బల సంపన్నమైన పెట్టుబడిదరీ రాజ్య వ్యవస్థను ఎదుర్కోవడంలో మావోయిస్టు ఉద్యమం మరింతగా సైనికీకరణకు గురవుతోంది. భారత రాజ్యవ్యవస్థ కూడా ఈ ఉద్యమాన్ని కేవలం సాయుధ సంఘర్షణకే పరిమితం చేయాలని చూస్తోంది. అందువల్ల ఉద్యమం పురోగమించడం కష్టసాధ్యం అవుతోంది. "సురక్షితమైన నేలవులు" లేనందువల్ల ఉద్యమానికి విఘాతం కలుగుతుంది. ఈ స్థావరాలు లేకుండా పార్టీ జనసామాన్య రాజకీయ విధానాలు కుళ్లిపోయిన ఉదారవాద రాజకీయ ప్రజాస్వామ్యం కన్నా మెరుగైనవన్న అభిప్రాయమూ లేదు. విస్తృతమైన సామాజిక నేపథ్యాలలో సమాంతరంగా తిరుగుబాట్లు చెలరేగే అవకాశాలు ఉన్నాయి. ఇది తీవ్రమైన తిరుగుబాటుకు దారి తీసి భారీ స్థాయిలో అలజడికి దారి తీయవచ్చు. ఇది కీలకమైన ముందడుగుకు దోహదం చేయవచ్చు.

 

  

Updated On : 13th Nov, 2017
Back to Top