ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

మేడేను ఇక మరిచిపోవడమేనా?

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

ప్రపంచవ్యాప్తంగా నాలుగు దశాబ్దాల నుంచి పెట్టుబడిదారీ అధికారవర్గం దాడుల కారణంగా కార్మిక వర్గం తన మౌలిక తత్వమైన పోరాట పటిమను విస్మరించినట్టు ఉంది. లేకపోతే కార్మికులు మేడేను ఎలా విస్మరించగలరు? ఈ నాలుగు దశాబ్దాలలో మేడే ప్రాశస్త్యం గురించి కార్మికోద్యమంలో కూడా ప్రస్తావించడం మానేశారు. శ్రామికవర్గం గతంలో ప్రదర్శించిన పోరాట పటిమ అట్టడుగు స్థాయి నుంచి ఇనుమడింపవలసిన దశలో ఆ పటిమను అణచి వేశారు. 19వ శతాబ్దంలో కూడా "ఉద్యోగంలో ఉండడానికి బదులు నిరుద్యోగమే మేలు" అన్నంతగా కార్మికవర్గం అవేదన ఉండేది. అప్పుడు ఇప్పుడూ కూడా పెట్టుబడి దృష్టిలో శ్రామికులు కేవలం ఉత్పత్తి వ్యయంలో భాగమే. కాని కార్మికులు సాహసించి రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పనితో పాటు తమ హక్కులు సాధించుకోవడం కోసం ఉద్యమించారు.

1886 మే ఒకటవ తేదీన ఉత్తర అమెరికాలో కార్మికులు ఎనిమిది గంటలు మాత్రమే పని చేసే హక్కు సాధించడం కోసం లక్షల సంఖ్యలో సమీకృతమయ్యారు. అప్పుడు చికాగో కార్మికులు సంఘటితం కావడానికి కేంద్రంగా ఉండేది. వామపక్ష కార్మికోద్యమానికి నెలవుగా ఉండేది. అంతర్జాజాతీయ కార్మిక సంఘం ఈ ఉద్యమానికి నాయకత్వం వహించేది. ఊహించినట్టుగానే కార్మికవర్గం పెట్టుబడిదారీ వర్గం నుంచి వ్యవస్థీకృతమైన వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది. వాణిజ్య ప్రయోజనాలకోసం మాత్రమే పని చేసే మీడియా, పోలీసులు కార్మికవర్గాన్ని అణచి వేసే వారు. పోలీసులు మరీ కిరాతకంగా వ్యవహరించే వారు. 1886 మేలో షికాగోలోని హే మార్కెట్ లో బాంబు పేల్చారన్న బూటక ఆరోపణ మోపి, అన్యాయమైన పద్ధతిలో విచారణ జరిపి నలుగురు అమాయకులకు మరణ శిక్ష అమలు చేశారు. వీరిలో కార్మికుల హక్కులు, ఎనిమిదిగంటల పనిదినాలకోసం నిరంతరం పోరాడడం తప్ప మరే పాపమూ ఎరగని క్రియాశీల కార్మిక ప్రతినిధులు, అరాచకవాద సిద్ధాంత అనుయాయులు అయిన ఆగస్ట్ స్పైస్, ఆల్బర్ట్ పార్సన్స్ కూడా ఉన్నారు.

ఎనిమిదిగంటల పని చట్టం అనేక చోట్ల ఉన్నప్పటికీ పెట్టుబడిదార్లు అమలు చేసే వారు కాదు. చట్టాన్ని ఉల్లంఘించే వారిని శాసనకర్తలు ఉపేక్షించే వారు. అందువల్ల కార్మికులు మే ఒకటి నుంచి సమ్మె చేయడంతప్ప మరో మార్గం లేకుండా పోయింది. కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ప్రభుత్వ న్యాయవాది "చట్టం ప్రమాదంలో ఉంది. అరాచకత్వ ముంచుకొస్తోంది...వీరి మీద అపరాధం ఖరారు చేయండి. వీరికి శిక్ష ఇతరులకు గుణపాఠంగా ఉండేట్టు చేయండి. ఉరి తీయండి. మన వ్యవస్థలను, సమాజాన్ని కాపాడండి" అని నిప్పులు ఉమిశాడు. కాని "మమ్మల్ని ఉరి తీయడం ద్వారా కార్మికోద్యమాన్ని అణగదొక్కగలమని మీరు అనుకుంటే, కష్టాలలో కూరుకుపోయి అందులోనుంచి బయటపడడానికి పోరాడుతున్న లక్షలు, కోట్ల మందికి విముక్తి కలిగించగలమని మీరు అనుకుంటే, అదే మీ అభిప్రాయం అయితే మమ్మల్ని ఉరి తీయండి. కాని మీరు ఓ నిప్పు రవ్వ మీద అడుగు వేస్తున్నారు. కాని అక్కడే, మీ వెనకాలే, మీ ముందే, ప్రతి చోటా మంటలు ఎగసి పడతాయి. అది అంతర్వాహినిగా ఉన్న అగ్ని. దాన్ని మీరు ఆర్పలేరు" అని మరణ శిక్ష అమలు చేయడానికి ముందు స్పైస్ స్పష్టం చేశారు.

అప్పుడు చికాగో కార్మికులకు ప్రతిభగల నాయకులు ఉండే వారు. క్రియాశీలమైన వామపక్ష పత్రికలు ఉండేవి. స్పైస్ సంపాదకత్వంలోని అర్బీటర్-జీతుంగ్ అనే జర్మన్ పత్రిక కూడా ఉండేది. డబ్బున్నవాళ్లు అప్పుడు కార్మికులను "ప్రమాదకరమైన వర్గం" అనే వారు. కాని ప్రస్తుతం అమెరికాలోని కార్మికులు కార్మిక సంఘాలలో లేకపోవడం దురదృష్టకరం. నిజానికి రస్ట్ బెల్ట్ (ఒకప్పుడు పరిశ్రమలకు ఆలవాలమైన) రాష్ట్రాలైన ఐయోవా, మిషిగన్, ఓహియో, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల కార్మికులే ఇటీవల జరిగిన ఎన్నికలలో జాతి ఉన్మాది, విదేశీయులంటే పడని కరడుగట్టిన జాతీయవాది "అమెరికాను మళ్లీ మహత్తర దేశంగా చేయండి" అని నినదించే డోనాల్డ్ ట్రంప్ ను గెలిపించారంటారు. ట్రంప్ ఎదుగుదలలాంటి ధోరణే ఫ్రాన్స్ లో నేషనల్ ఫ్రంట్ రూపంలో, బ్రెక్సిట్ కోసం ఉద్యమిస్తున్న యునైటెడ్ కింగ్డంలో ఇండిపెండెన్స్ పార్టీ రూపంలో, ఇటలీలో ఫైవ్ స్టార్ ఉద్యమం రూపంలో, జర్మనీలో పెడిగా రూపంలో, ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ నాయకత్వంలో శరణార్థులకు వ్యతిరేక ఉద్యమం రూపంలో అనేక చోట్ల కనిపిస్తోంది.

భారత్ లో నరేంద్ర మోదీ ప్రచారం చేస్తున్న "మేక్ ఇన్ ఇండియా" – (భారత్ లో తయారీ) విజయవంతం కావడం వెనక శాశ్వత ప్రాతిపదికన పని చేసే కార్మికులు చేసే పనే చేసినా వేతనం మాత్రం అందులో పదో వంతో, నాల్గో వంతో తాత్కాలిక/కాంట్రాక్టు కార్మికులకు చెల్లించడమే ప్రధాన కారణంగా ఉంది. ఈ కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదు. సహజంగానే స్వతంత్ర కార్మిక సంఘాలు పని చేయడానికి వీలుండదు. యాజమాన్యాలకు తొత్తుల్లాగా పడి ఉండే కార్మిక సంఘాలు, పోలీసులు కుమ్మక్కై పని చేస్తారు. హర్యానాలోని మానెసర్ లో మారుతి సుజుకి కర్మాగారంలో ఇలాగే జరిగింది. దేశంలోని కార్మిక చట్టాల ప్రకారం న్యాయం జరగాలని కోరే కార్మిక సంఘాలను నిర్దాక్షీణ్యంగా అణచి వేశారు. అత్యవసరమైన సామాజిక సేవలు అందించే పది లక్షల మంది కార్మికులను ప్రభుత్వం శాశ్వత కార్మికులుగానూ, తమ ఉద్యోగులుగానూ గుర్తించదు. అంగన్ వాడీ సేవకులు, సర్వ శిక్షా అభియాన్ పథకం కింద పారా టీచర్లుగా పని చేసే వారు, గ్రామీణ ఆరోగ్య మిషన్ పథకం కింద గుర్తింపు పొందిన ఆరోగ్య కార్యకర్తలకు ఉద్యోగులకు ఉండే హక్కులు ఉండవు. అవసరమైన ఈ దశలో ఐక్యమై కార్మికులను రోజు కూలీలుగా మారుస్తున్న స్థితిలో, తక్కువ వేతనాలు చెల్లిస్తున్న దశలో, పని గంటలు పెంచుతున్న పరిస్థితిలో  చీలికలు వాలికలై ఉన్నకార్మిక సంఘాలు వారిని సమీకరించలేకపోతున్నాయి.

చాలా కార్మిక సంఘాలు కనీసం గతంలో పోరాటం చేసిన కార్మికులకు నివాళి అర్పించ రోజుగానైనా మేడేను పాటించడం లేదు. ఇక పెట్టుబడిదారీ విధానానికి ఆవల పోరాటాలకు ప్రతీకగా మార్చే అవకాశం ఎటూ లేదు. ఈ కార్మిక సంఘాలకు 1880లలో షికాగోలో పాడిన ‘ఎనిమిది గంటల పాట’ ను గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఆ పాట ఆఖరి వాక్యాలు ఇలా ఉంటాయి:

మాకు సూర్యోదయం కావాలి, మేం పూల వాసన చూడాలి;

ఎనిమిది గంటల పని భగవదేచ్ఛ, అది దేవుడి అభీష్టం

నౌకానిర్మాణ కేంద్రాలు, దుకాణాలు, మిల్లుల్ల నుంచి జనాన్ని సమీకరిస్తున్నాం;

ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి, ఎనిమిది గంటలు మనకు ఇష్టమైన దానికి.

 

 

  

  

Updated On : 13th Nov, 2017
Back to Top