ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ఆరోగ్యం ప్రజల హక్కు

ఆరోగ్యాన్ని హక్కుగా గుర్తించడానికి జాప్యం చేయలేం, చేయకూడదు

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

ఆరోగ్య విధానం రూపొందించడం అంటే లక్ష్యాన్ని ప్రకటించడం. 2017 జాతీయ ఆరోగ్య విధానం సరిగ్గా ఈ పనే చేస్తోంది. అయితే ఇందులోనూ, దాన్ని రూపొందించిన తీరులోనూ అనేక లోపాలు ఉన్నాయి. ఈ లోపాలలో ప్రధానమైంది ఆరోగ్య సదుపాయాలు అందించడంలో ప్రైవేటు రంగంలో ఆరోగ్య సదుపాయాలు అందించడంపై విపరీతమైన శ్రద్ధ కనబరచడం.

ఆల్మా ఆటా ప్రకటనను ఆమోదించిన తర్వాత భారత్ లో మొట్ట సారి జాతీయ ఆయోగ్య విధానాన్ని 1983లో రూపొందించారు. రెండవ విధానాన్ని 2002 లో తీసుకొచ్చారు. మరణాల సంఖ్య, ఆయుప్రమాణాలు, రోగాలు వ్యాప్తిని అదుపు చేయడంలో పరిస్థితి మెరుగుపడ్డప్పటికీ మరణాల సంఖ్యను అదుపు చేయడానికి, ఆయు ప్రమాణాలు పెంచడానికి, రోగాలు రాకుండా చూడడానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను మాత్రం సాధించలేదు. అందువల్ల 2017 నాటి జాతీయ ఆరోగ్య విధానం కూడా ఈ లక్ష్యాలు సాధించడానికి పెట్టుకున్న గడువు పెంచింది.

ఆరోగ్య పరిరక్షణకు భారత్ లో కేటాయిస్తున్న మొత్తం ప్రపంచ దేశాలలో కన్నా చాలా తక్కువ. అది స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 1.3 శాతమే ఉంది కనక కొత్తగా పెట్టుకున్న లక్ష్యాలనైనా సాధించగలమన్న భరోసా కలగడం లేదు. 2017 జాతీయ ఆరోగ్య విధానాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ఆరోగ్య పరిరక్షణకు 2025లో బడ్జెట్ కేటాయింపులను 2.5 శాతానికి పెంచుతామని ఈ విధానంలో తెలియజేశారు. రాష్ట్రాలు మాత్రం తమ బడ్జెట్లో 8శాతం కేటాయిస్తాయని చెప్పారు. కేటాయించిన మొత్తంలో మూడింట రెండువంతులు ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణకు కేటాయిస్తామని మిగతా సొమ్ము ఇతర ఆరోగ్య పరిరక్షణా కార్యకలాపాలకు వెచ్చిస్తామని జాతీయ ఆరోగ్య విధానంలో ప్రకటించారు. సమగ్ర ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పూచీ పడుతుందని ప్రభుత్వం కల్పించే ఆరోగ్య బీమాకు ప్రాధాన్యం ఇస్తామని,మిగతా ఆరోగ్య పరిరక్షణా కార్యక్రమాలలో ప్రైవేటు రంగానికి ఎక్కువ బాధ్యత ఉంటుందని అంటే దానికి కావాల్సిన బీమా సదుపాయాలు ప్రైవేటు రంగం నుంచి తీసుకోవాలని ఈ విధానంలో తెలియజేశారు. సమగ్ర ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం బాధ్యత వహించడాన్ని ఆహ్వానించాల్సిందే. కాని ఆరోగ్యానికి 2.5 శాతం మాత్రమే కేటాయించడం మాత్రం చాలా తక్కువ. ఇతర వర్ధమాన దేశాలు కేటాయిస్తున్న దానికన్నా కూడా తక్కువ.

ఈ ఆరోగ్య విధానంలో అన్ని రాష్ట్రాలలోనూ ప్రజారోగ్య నిర్వహణ కార్యకర్తలను నియమిస్తామని చెప్పడం సానుకూలమైన అంశమే. సామాజిక, ఆర్థిక, నర్సింగ్, ఆసుపత్రుల నిర్వహణ రంగాల వారిని కూడా ఆరోగ్య పరిరక్షణా కార్యకర్తలుగా నియమించాలని ప్రతిపాదించడం మంచిదే. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం కేవలం వైద్య రంగానికి చెందిన వృత్తి నిపుణులనే కార్యకర్తలుగా నియమిస్తున్నారు. జిల్లా స్థాయి, అంతకన్నా తక్కువ స్థాయి ఆసుపత్రులను పటిష్ఠం చేయడం, కొన్ని జిల్లా స్థాయి ఆసుపత్రులను బోధనా ఆసుపత్రుల స్థాయికి పెంచడం కూడా ఆహ్వానించదగ్గ విధానమే. ప్రాథమిక ఆరొగ్య కేంద్రాలను బలోపేతం చేయడంలో భాగంగా ఆయుష్ వైద్య సేవలు అందించే వారిని కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో భాగస్వాములను చేస్తామంటున్నారు. వీరు మధ్య స్థాయిలో సేవలు అందిస్తారు. వైద్య సంబంధిత సేవలు అందించే వారు కూడా వీరిలో ఉంటారు. ఆరోగ్య పరిరక్షణ, అనారోగ్యాన్ని నివారించడం కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బాధ్యత అవుతుంది. 2017 ఆరోగ్య విధానం ప్రకారం డాక్టర్లు గ్రామీణ ప్రాతాలలో పని చేయడం తప్పనిసరి అవుతుంది. కుటుంబ వైద్యం, సాధారణ వైద్యంలో ఎం.డి. కోర్సులకు అధిక ప్రచారం కల్పిస్తారు. ఈ అంశాలను కనక వెంటనే అమలులోకి తెస్తే సమగ్రమైన ఆరోగ్య సదుపాయాలు అందించడానికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ సదుపాయాలు అందుబాటులోకి తేవడానికి చాలా ఉపకరిస్తుంది.

అయితే ఈ విధానంలో ఆరోగ్య రంగంలో ప్రైవేటు రంగానికి ఎక్కువ పాత్ర కల్పించడం, ఉదాహరణకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రైవేటు రంగం వారి వెలుపలి సేవలకు అవకాశం కల్పించడం, ఆరోగ్య బీమా పాలసీల "వ్యూహాత్మక కొనుగోలు"లో ఆ రంగానికి స్థానం కల్పించడం వంటివి ఆందోళన కలిగించేవే. ఆరోగ్య సదుపాయాలు కల్పించడానికి సాధారణ పన్నుల మీదే ఆధారపడతామని, ప్రభుత్వ రంగం ఆరోగ్య సేవలు అందించడానికి ప్రాధాన్యం ఇస్తుందని, ఆ తర్వాత లాభాపేక్ష లేని విధానాన్ని ప్రోత్సహిస్తామని, ప్రైవేటు రంగానికి స్థానం కల్పిస్తామని ఈ విధానంలో తెలియజేశారు. ఆరోగ్యం కోసం ప్రభుత్వ వ్యయాన్ని తప్పించుకోనంత మేరకు ప్రైవేటు రంగానికి స్థానం కల్పించకపోతే ఇది మంచి పద్ధతే. లేకపోతే ప్రజారోగ్యం కొనసాగడం సాధ్యం కాదు.

అయితే విద్యా హక్కు, ఆహార హక్కు లాగా ఈ విధానంలో ఆరోగ్య హక్కు ప్రస్తావన లేకపోవడం దురదృష్టకరం. జాతీయ ఆరోగ్య హక్కు చట్టానికి సంబంధించిన ప్రస్తావననే ఈ విధానంలో నుంచి తొలగించారు. 2015 ముసాయిదా ఆరోగ్య విధానంలో ఈ మాట ఉండేది. “మరింత హామీల ఆధారంగా ఉండే విధానాన్ని అనుసరిస్తామని, భవిష్యత్తులో ఆరొగ్య రక్షణ హక్కుగా ఉండే విధంగా వ్యవహరిస్తాం" అని మాత్రమే ఈ విధానంలో ప్రకటించారు. ఆరోగ్యాన్ని హక్కుగా మార్చాలంటే ఆరోగ్య మౌలిక సదుపాయాలు అత్యధిక స్థాయిలో ఉండాలని ఈ విధానంలో చెప్పారు. ఈ కారణం చూపితే సరిపోదు. ఇది ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుగా మార్చడానికి ఉపకరించదు. ఆరోగ్యాన్ని హక్కుగా పరిగణిస్తే తప్ప దీన్ని ప్రత్సహించడం కుదరదు, రాజకీయ సంకల్పమూ సాధ్యం కాదు. మౌలిక ఆరోగ్య సదుపాయాల కల్పనా సాధ్యం కాదు.

ఆరోగ్యం విషయంలో, ఈ రంగంలో ప్రభుత్వ వ్యయంలో, ప్రజారోగ్యం అందుబాటులో ఉండడంలో  థాయిలాండ్, శ్రీ లంక, ఇతర బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా కన్నా భారత్ వెనుకబడే ఉంది. ఆ దేశాలన్నీ లలస్ఖ్యాలను సాధించడంలో భారత్ ను అధిగమించాయి. కాని భారత్ మాత్రం ఈ లక్ష్యాలను క్రమంగా సాధిస్తాం అనే స్థితిలోనే ఉంది. ఈ లక్ష్యాల సాధన సత్వరం జరగాలన్న సంకల్పం ఈ ఆరోగ్య విధానంలో లేదు. ఆరోగ్యం హక్కు కావాలన్న బలమైన వాదనను విస్మరించడం ద్వారా ఈ విషయంలో మిగతా దేశాలకన్నా వెనుకబడి ఉండడానికి మాత్రమే ఈ విధానం ఉపకరిస్తుంది. 

 

  

Updated On : 13th Nov, 2017
Back to Top