ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

మోదీ-యోగి యుగళ గీతం

మోదీయోగి నాణానికి బొమ్మ బొరుసు లాంటి వారే

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

ఇటీవలి ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బ్రహ్మాండమైన విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి కచ్చితంగా తగినవాడు కరడుగట్టిన హిందుత్వ వాద నాయకుడు యోగీ ఆదిత్యనాథే అని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నిర్ణయించినప్పుడు ప్రజలు ఎందుకంత ఆశ్చర్యపోయారు? బీజేపీకి మార్గదర్శకత్వం వహించే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ను హిందూ రాష్ట్ర ఏర్పాటు వేపు నెడుతున్నప్పుడు దేశంలో జనాభా రీత్యా అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు ఆయనను నియమించడమే సరైంది కదా! అందరినీ కలుపుకుని పోవాలని జనం గట్టిగా కోరుతున్న దశలో బీజేపీ తన దీర్ఘకాలిక లక్ష్యంలో ఎలాంటి మార్పూ లేదని యోగీ అదిత్యనాథ్ ను నియమించి స్పష్టంగా చెప్పేసింది. గోరఖ్ నాథ్ దేవాలయం అధిపతి అయిన ఆదిత్య నాథ్ 2019 ఎన్నికలకు ముందు హిందూ ఓట్లను రాబట్టగలిగినప్పుడు, అది బీజేపీ విజయాన్ని ఖాయం చేస్తుందనుకున్నప్పుడు ఆయనను ఎందుకు నియమించకూడదు?

ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రిని ఎంపిక చేయడంలో బీజేపీ అనుసరించిన తర్కంతో నిజానికి సమస్యే లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీలో కాఠిన్యం తగ్గి మెత్తబడ్డాడని మీడియాలో చాలా మంది భావించడమే అసలు సమస్య. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం కాకుండా మోదీ దేశమంతటికీ ప్రధాని అయినందువల్ల హిందుత్వ ఎజెండాకు బదులు "అభివృద్ధి"కి ప్రాధాన్యం ఇచ్చారని అనుకున్నారు. కపటపూరితమైన ఈ అంశాన్ని నమ్మడం కేవలం భ్రమ. అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లవుతున్న దశలో తన మౌలిక భావాలు మారాయనడానికి మోదీ చేసింది ఏమీ లేదు. దేశవాసులందరికీ ఆమోదయోగ్యం కావాలంటే తాను మధ్యేమార్గ రాజకీయాలు అనుసరించాలని అనుకుని ఉన్నట్టయితే ఆయన తప్పని సరిగా ముస్లింల మీద విషం విరజిమ్మిన ఆదిత్యనాథ్ వంటి వారిని గట్టిగా అదుపు చేసే వారు. కాని ఆయన అలాంటిది ఏమీ చేయలేదు. దుర్భాషతో కూడిన తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నప్పుడు మౌనంగా ఉన్నారంటే మోదీ భావమేమిటో అర్థం అవుతూనే ఉంది. ఆదిత్యనాథ్ వంటి విపరీత చిత్తులు తమ పార్టీలో పంక్తి చివరన ఉండే వారు కాదని వారు పార్టీలో విడదీయరాని భాగం అన్నదే ఆయన భావన. వారి వల్ల ప్రయోజనం ఉంటుంది. మోదీ లాంటి వారి ద్వారా వారికి సంక్రమించే అధికారం, చట్టసమ్మతి తమ రాజకీయ లక్ష్యం సాదించడానికి చివరకు ఆయనకు, ఆయన పార్టీకే ఉపయోగపడతాయి.

మరీ తీవ్రమైన భావాలు ఉన్న వారిని వారిలో ఒకరికి అన్నింటికన్నా పెద్ద రాష్ట్రానికి అధిపతిని చేయడం వల్ల వ్యతిరేక ఫలితాలు వస్తాయని వాదించే వారు ఉండొచ్చు. అయిదు సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై, పచ్చి ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసి, గూండాలతో కూడిన తన నాయకత్వంలోని హిందూ యువ వాహిని ద్వారా ఆగడాలు సృష్టించిన వ్యక్తి వల్ల మోదీ ఉదారస్వభావానికి ఏమైనా విఘాతం కలుగుతుందా? ఆయన గతంలో చేసిన రెచ్చగొట్టే ప్రకటనలకు మోదీ ప్రధాన నినాదమైన సబ్కే సాథ్, సబ్కా వికాస్ అన్న నినాదానికి పొంతన ఎలా కుదురుతుంది అని అనొచ్చు.

ఈ రెండింటి మధ్య పొంతన కుదరదని ఇప్పటికే స్పష్టమైంది. అధికారం చేపట్టిన ఒక్క రోజు తర్వాతే గొడ్డు మాంసం ఉత్పత్తి చేస్తున్నారన్న ఏ సాక్ష్యమూ లేకుండానే "అక్రమ" కబేళాలను మూసివేయిస్తానని ఆదిత్యనాథ్ ప్రకటించారు. మూడు రోజుల తర్వాత హత్రాస్ జిల్లాలో మూడు మాంసం దుకాణాలను ధ్వంసం చేశారు. ఘజియాబాద్ జిల్లాలో 15 "అక్రమ" వధశాలలను మూసేశారు. కాన్ పూర్, మీరట్, ఆజంగఢ్ జిల్లాల్లో అనేక వధశాలలపై దాడులు జరిగాయి. వీటిలో చాలా వరకు ముస్లింలవే కనక దీనికి అధిక ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం స్పష్టమైందే. వీధుల్లో యువతులను వేధించకుండా "రోమియోల వ్యతిరేక దళాలు" ఏర్పాటు చేయాలని కూడా ఆదిత్యనాథ్ పోలీసులను ఆదేశించారు. నిజానికి పోలీసులు ముస్లిం యువకులనే ఎక్కువగా వేధించే అవకాశం ఉంది. మునుపు బాబరీ మసీదు ఉన్న స్థలంలో రామ మందిర నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు పెద్ద సవాలు. బాబరీ మసీదు స్థల వివాదం అనేక ఏళ్ల నుంచి కోర్టులలో నానుతూనే ఉంది. కాని ఈ కేసులో భాగస్వామి కాని బీజేపీ ఎం.పి. సుబ్రహ్మణ్య స్వామి విచారణ సత్వరం పూర్తి చేయాలని సుప్రీం కోర్టుకు అర్జీకి పెట్టుకోవడంతో రామ మందిర వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చింది. మరో వేపున సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకోవాలని సూచించారు.

ఆదిత్యనాథ్ ను ముఖ్యమంత్రిగా నియమించడం వల్ల మోదీ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందా అంటే మనం హిందు రాష్ట్రం ఏర్పాటు చేయడానికి కాషాయ రంగుతో కూడిన అభివృద్ధి సాధించడానికి వైరుధ్యం ఏమైనా ఉందా అని ఆలోచించాలి. 2002లో గుజరాత్ మారణ కాండను మరుగున పడేయడానికి మోదీ "గుజరాత్ నమూనా"ను ముందుకు తెచ్చారు. అప్పుడు కూడా ఆయన ఇప్పటిలాగే చాతుర్యం ప్రదర్శించారు. ఈ రకమైన అభివృద్ధి మార్గం ద్వారా కొంతమంది ఆశ్రిత పెట్టుబడిదారులకే ప్రయోజనం కలిగిందన్న వాస్తవాన్ని మరుగుపరచ గలిగారు. అలాగే ఆ రాష్ట్రంలోని ముస్లింలు నోరెత్తకుండా చేయగలిగారు. మోదీ చెప్పే అభివృద్ధి మార్గం ఓటర్లను హిందూ రాష్ట్రం అన్న భావనకు కట్టిపడేసిది తప్ప మరొకటి కాదు.

2015లో బిహార్, దిల్లీ శాసనసభ ఎన్నికలలో పరాజయం పాలైన తర్వాత బీజేపీ తన వ్యూహాన్ని మార్చుకఒక తప్పలేదు. 2014 ఎన్నికల సమయంలో మోదీ మంత్ర జపం అయిన అభివృద్ధిని గురించి మాట్లాడుతూనే మరో వైపున హిందూ ఓట్లను సంఘటితం చేయడం కోసం ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషం వెళ్లగక్కే పని కొనసాగించారు. ఉత్తర ప్రదేశ్ లో ఆదిత్యనాథ్ మంచి ప్రచారకుడిగా ఉపయోగపడ్డారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ తమ అధీనంలోకి వచ్చింది కనక "అభివృద్ధి", హిందుత్వ జుగల్బందీ బాగా ఉపకరిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. బీజేపీ అందరికీ చెందిన పార్టీ అన్న భావనను కూడా వదిలేసి తమ ఒంటెత్తు పోకడ విధానాలతో ముందుకెళ్లవచ్చు. ఉత్తరప్రదేశ్ లో యోగి, దిల్లీలో మోదీ భిన్న పద్ధతుల్లో జనాన్ని సమీకరించ గలరు. ఇందులో వారు సిద్ధహస్తులు.

 

 

Updated On : 13th Nov, 2017
Back to Top