ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

మునుపటి ముప్పే నేటి వరప్రసాదం

ఒకప్పుడు అమెరికా సప్తమ నౌకా దళం అంటే అత్యంత ప్రమాదకరం. ఇప్పుడు అది వరప్రసాదం

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

అమెరికా సప్తమ నౌకా దళా యుద్ధ నౌకలకు భారత్ మరమ్మతులు చేయబోతోంది. ఇది భారత-అమెరికా దేశాల సంబంధాల మధ్య వచ్చిన విపరీతమైన మార్పుకు సంకేతం. 1971 డిసెంబర్ లో పాకి్స్తాన్ తో జరిగిన యుద్ధంలో భారత సేనలు, తూర్పు బెంగాల్ లో ముక్తి వాహిని విజయం మొగదలో ఉన్నప్పుడు అమెరికా నౌకా దళం తన సప్తమ నౌకా దళంలోని 10 యుద్ధ నౌకలను భారత సేనలకు దడ పుట్టిచడం కోసం బంగాళాఖాతానికి పంపించింది. అప్పటి వరకు సప్తమ నౌకా దళం దక్షిణ వియత్నాంలో ఉండేది. అయితే అంతకు ముందే 1971 ఆగస్టులో మన దేశం మునుపటి సోవియట్ యూనియన్ తో శాంతి, స్నేహ, సహకార ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలోని 9వ నిబంధన ప్రకారం భారత్ కు ఇతర దేశాలనుంచి ముప్పు ఏర్పడితే, లేదా భద్రతకు నిజంగానే ప్రమాదం తలెత్తితే సోవియట్ మనకు అండగా నిలబడుతుంది. వాస్తవానికి అమెరికా సప్తమ నౌకా దళం నుంచి ప్రమాదం తప్పించడానికి  అత్యంత వేగంగా వెళ్ల గలిగిన సొవియట్ యుద్ధ నౌకలు, విధ్వంసక నౌకలు, ఒక జలాంతర్గామి హిందూ మహాసముద్రం చేరాయి.

ప్రచ్ఛన్న యుద్ధం ముగియగానే, నిజానికి సోవియట్ యూనియన్ పతనం కాక ముందే భారత ప్రభుత్వం పిల్లి మొగ్గ వేసే సూచనలు కనిపించాయి. 1990 ఆగస్టు నుంచి 1991 ఫిబ్రవరి దాకా సాగిన మొదటి గల్ఫ్ యుద్ధం సందర్భంగానే అమెరికా యుద్ధ విమానాలకు భారత నేల మీద ఇంధనం నింపే సదుపాయం కల్పించారు. కాని 2016 ఆగస్టులో భారత్ అమెరికాతో వ్యూహాత్మకంగా ఇచ్చి పుచ్చుకునే ఒప్పందం (లాజిస్టిక్ ఎక్స్చేంజ్ మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్ -ఎల్.ఇ.ఎం.ఒ.ఎ. - లెమోవ) కుదుర్చుకుంది. దీని వల్ల భారత అమెరికా సేనలు సన్నిహితంగా కలిసి పని చేసే అవకాశం వచ్చింది. ఈ ఒప్పందం వల్ల ఈ రెండు దేశాలు యుద్ధ విమానాలలో ఇంధనం నింపడం, మరమ్మతులు, నిర్వహణ, సరఫరాలు మొదలైన విషయాలలో కలిసి పని చేయడానికి తమ సైనిక స్థావరాలను అందుబాటులో ఉంచుతాయి. ఈ ఒప్పందం కుదిరినప్పుడు పెంటగన్ లో 2016 ఆగస్టులో సంయుక్త పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడిన అమైరికా రక్షణ శాఖ మంత్రి   ఆస్టన్ కార్టర్ ఈ ఒప్పందం "మనం కావాలనుకున్నప్పుడు సంయుక్త కార్యాచరణకు తోడ్పడుతుంది" అని చెప్పారు. దీనివల్ల ఉమ్మడి వ్యూహరచన సులభం అవుతుంది, అది సమర్థంగా ఉంటుంది అని కార్టర్ అన్నారు. ఈ ఒప్పందం వల్ల సం యుక్త కార్యాచరణకు, వ్యూహరచనకు వీలవుతుందని అప్పటి భారత రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారీకర్ తెలియజేశారు. వాస్తవంగా ఏం జరుగుతుందో తెలియదు కాని ఈ ఒప్పందం వల్ల భారత సైనిక స్థావరాలు, రేవుల ద్వారా సైనిక సామాగ్రి, సిబ్బందిని నియోగించడం సాధ్యమవుతుంది.

ఈ ఒప్పందం రూపురేఖలు ఏమిటో వాస్తవ రూపంలో తెలియడానికి ఆరేడు నెలల సమయం పట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అనిల్ ధీరూభాయ్ అంబానీ అధీనంలోని రిలయన్స్ డిఫెన్స్ అండ్ ఇంజినీరింగ్ సంస్థ సప్తమ నౌకా దళంలోని యుద్ధ నౌకలకు, ఇతర అనుబంధ నౌకలకు పిపవావ్ నౌకా నిర్మాణ కేంద్రంలో మరమ్మతులు మొదలైనవి చేయడానికి "మాస్టర్ షిప్ రిపేర్ అగ్రిమెంట్" కుదుర్చుకుంది. ఈ ఒప్పందం వల్ల అనిల్ అంబానీ కంపెనీకి అయిదేళ్ల కాలంలో 1.5 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా. పిపవావ్ నౌకా నిర్మాణ కేంద్రాన్ని 2015లో అనిల్ అంబానీ సంస్థ చేజిక్కించుకుంది. కేంద్ర, గుజరాత్ ప్రభుత్వ సహాయంతో ఈ నౌకా నిర్మాణ కేంద్రం సామర్థ్యం పెంచారు. అమెరికా నౌకా దళం "ఆమోదిత కాంట్రాక్టర్" స్థాయి సంపాదించడానికి సత్వరం ఈ సామర్థ్యం పెంచారు.

అమెరికా నౌకా దళంతో కుదుర్చుకున్న ఈ ఒప్పందం ద్వారానే లెమోవాను ప్రభుత్వం బహిరంగ పరచడం గమనించదగిన అంశం. రక్షణ శాఖకు అవసరమైన సామాగ్రి సేకరించడానికి 2005లో ప్రభుత్వం "కీలకమైన విధానం" రూపొందించినప్పటి నుంచి రక్షణ శాఖకు కావాల్సిన సామాగ్రి సేకరించడంలో ప్రైవేట్ కార్పొరేట్ రంగం క్రియాశీల పాత్ర పోషిస్తోంది. ఈ విధానం ప్రకారం రక్షణ శాఖకు కావాల్సిన సామాగ్రి సరఫరా చేసే విదేశీ కంపెనీలు దీనిలో కొంత భాగాన్ని స్థానికంగా సమకూర్చుకోవాలి. ఈ విధానం భారత కంపెనీలతో కలిసి సంయుక్త రంగ సంస్థలు ఏర్పాటు చేయడాన్ని ప్రోత్సహించింది. ఉదాహరణకు రాఫేల్ ఒప్పందంలో దసాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్ సంస్థ కొంత "కీలక" సామాగ్రి సరఫరా చేస్తుంది. ఇది ప్రభుత్వం అమలు చేస్తున్న "మేక్ ఇన్ ఇండియా -భారత్ లో తయారీ" విధానాన్ని సమర్థించడానికి కూడా ఉపయోగపడుతుంది. వాస్తవానికి ఈ కీలక విధానం ప్రకారం లబ్ధి పొందే భారత ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు విదేశీ రక్షణ సామాగ్రి సరఫరా సంస్థలకు చిన్న భాగస్వాములుగానే ఉంటున్నాయి. రక్షణ శాఖకు అవసరమైన సామాగ్రి తయారు చేయడానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞాన్ని, ఉత్పత్తికి కావాల్సిన సదుపాయాలను సమకూర్చింది భారత ప్రభుత్వరంగ సంస్థలు, ఆయుధ కర్మాగారేలే. కాని ప్రైవేటు కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం ప్రభుత్వ రంగ సంస్థలను పక్కకు తప్పిస్తున్నారు.

భారత్ ను అమెరికా ఇప్పటికే "ప్రధాన రక్షణ భాగస్వామి"గా ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయిల్ దేశాల నుంచి అధునాతన ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నాం. చైనా ప్రభావాన్ని ఎదుర్కునేందుకు భారత్ ను ప్రోత్సహిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రి జేమ్స్ మాటిస్ పునరుద్ఘాటిస్తున్నారు. దీనివల్ల భారత ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు భారీ లాభాలు సంపాదించే అవకాశం ఉంది. సప్తమ నౌకా దళానికి చెందిన నౌకలకు మరమ్మతు చేయడానికి పెంటగన్ కాంట్రాక్టు సంపాదించిన తర్వాత రిలయన్స్ డిఫెన్స్ అండ్ ఇంజనీరింగ్ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే చైనాను నిలవరించడంలో భారత్ "ముందు పిటీన ఉన్న దేశం" అయినట్టుగానే ఈ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు కూడా ముందు పిటీన ఉంటామని అనుకుంటున్నాయి. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అభ్యర్థి కావడానికి అనిల్ అంబానీ, ఆయన అన్న ముఖేశ్ అంబానీ కృషి చేసినందుకు అప్పుడు వారు చేసిన ఉపకారానికి (పెట్టుబడికి) ఇప్పుడు ప్రయోజనం పొందుతున్నారు.

ఒకప్పుడు అమెరికా సప్తమ నౌకాదళాన్ని అత్యంత ప్రమాదకరంగా భావించే వాళ్లం. ఇప్పుడు అది కేవలం సైనికపరంగా ఓ అవకాశం మాత్రమే కాదు. అది అక్షరాలా కొంతమందికి బంగారు లంకె బిందె.   

 

Updated On : 13th Nov, 2017
Back to Top